close

తాజా వార్తలు

Updated : 24/04/2020 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

క్షణక్షణం... కణం భయం!

అయినా లెక్కచేయకుండా విధుల్లోకి!

ఒక్కో నమూనా... ఒక్కో అణుబాంబు ప్రతి నమూనాలోనూ ఆ జిత్తులమారి వైరస్‌ ఉండొచ్చు..  అది నెగెటివ్‌ అయిన ప్రతిసారి హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంటారు.. అదే పాజిటివ్‌ వస్తే? గుండెలు చిక్కబట్టుకోవాలి. ప్రతి నిమిషం     ఆటంబాంబుతో ఆటలాంటిదే వాళ్ల వృత్తి కొవిద్‌-19 పరీక్షాల్యాబ్‌లో నిత్యం ఉండేది సమరమే అంటున్నారు.. వరంగల్‌లో తాజాగా ఏర్పాటైన కొవిడ్‌- 19 ల్యాబ్‌ మహిళా అధికారులు..
నిన్నమొన్నటి వరకు తెలంగాణలో కరోనా నిర్ధారణ పరీక్షలు హైదరాబాద్‌లోనే జరిగేవి. రాజధాని వెలుపల తొలి కొవిడ్‌-19 పరీక్షా కేంద్రం ఇటీవలే వరంగల్‌లో ఏర్పాటైంది. ఈ కేంద్రానికి నేతృత్వం వహిస్తున్నవారంతా మహిళలే. ఎన్నో సమస్యలను అధిగమించి సవాళ్లతో కూడుకున్న పరీక్షలను సమర్థంగా చేస్తున్నారు వీళ్లు. పక్కాగా ఫలితాలు ఇస్తున్నారు. కరోనా పరీక్షా కేంద్రం ఏర్పాటైన కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సుంకరనేని సంధ్య, ల్యాబ్‌ నోడల్‌ అధికారిణి డాక్టర్‌ కె.జ్యోతి, ప్రయోగశాల నడిపే మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్‌ ఎస్‌.శ్రీదేవి.. ఈ ముగ్గురూ అహర్నిశలూ కష్టపడుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో పరీక్షలు చేస్తూ కరోనా రక్కసిని తరిమేసే యజ్ఞంలో మేముసైతం అంటున్నారు.

ముద్దుల మనవరాలికి దూరంగా..
సరిహద్దులో జవాన్లలా దేశంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు పోరాడాల్సిన సమయమిది అంటారు డాక్టర్‌ సంధ్య. తన కూతురు గైనకాలజిస్టు. కోయంబత్తూరులో పనిచేస్తుండగా, మూడేళ్ల మనవరాలిని సంధ్యే చూసుకుంటున్నారు. అయితే కొవిడ్‌ పరీక్ష కేంద్రం ప్రారంభం కావడంతో చాలా అప్రమత్తంగా ఉంటున్నారామె. ముద్దుల మనవరాలి దగ్గరికి వెళ్లకుండా.. ఆ బాధ్యతను వాళ్ల తాతయ్యకు అప్పగించారు. ‘ఇంటికి వెళ్లకుండా కళాశాలలోనే ఉందామనుకుంటున్నా. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారిని చూస్తామని ఎవరూ ఊహించి ఉండరు. ఎంబీబీఎస్‌ చదివేటప్పుడు ‘పాండమిక్‌’ అనే పాఠం రాగానే.. దీంతో అవసరం ఉండదని చాలామంది పేజీలు తిప్పేస్తుంటారు. కానీ, ఇప్పుడు వాటి ఆధారంగానే పరీక్షలు చేయాల్సి వస్తోంది. ఈ పోరాటంలో భాగమైనందుకు గర్వంగా ఉంద’న్నారు సంధ్య. ఈ కేంద్రంలో రోజుకు వంద పరీక్షలు సాధ్యమవుతాయని ప్రభుత్వానికి చెప్పారామె. కానీ, ఇప్పుడు మూడు షిప్టులను నడుపుతూ రోజుకు వందకన్నా ఎక్కువ పరీక్షలను సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికి 600కు పైగా పరీక్షలు నిర్వహించగా, అందులో రెండు పాజిటివ్‌ వచ్చాయని చెప్పారు. తొలి పాజిటివ్‌ నివేదిక వచ్చినప్పుడు మళ్లీ హైదరాబాద్‌కు పంపి నిర్ధారణ చేసుకున్నామని వివరించారు. అక్కడ కూడా పాజిటివ్‌ రావడంతో నూరు శాతం కచ్చితత్వంతో పరీక్షలు చేస్తున్నట్టు రుజువు అయ్యిందంటున్నారు. దీంతో తమపై తమకు మరింత ఆత్మ విశ్వాసం పెరిగిందని, మరింత ఉత్సాహంతో పనిచేస్తామని చెబుతున్నారు.

రాత్రింబవళ్లు
నోడల్‌ అధికారిణి డాక్టర్‌ జ్యోతిది ఈ పరీక్షల్లో కీలక పాత్ర. కొవిడ్‌ ప్రయోగకేంద్రంలోకి వచ్చే నమూనాలను పర్యవేక్షించి, సమయానికి పరీక్షలు చేయించడం, టెక్నీషియన్లకు విధులు కేటాయించడం, ఫలితాలను ప్రభుత్వానికి వెల్లడించడం.. ఇలా ఇవన్నీ కత్తి మీద సాములాంటి పనులే. నమూనా పరీక్షకు సరిపడా వచ్చిందా అనే అంశంతోపాటు, పరీక్షించిన ఐడీలను పరిశీలించి వాటిని కంప్యూటర్లో అప్‌లోడ్‌ చేసే వరకు అన్ని దశలూ చాలా కీలకం. వీటన్నింటికీ జవాబుదారీ వహించాల్సింది నోడల్‌ అధికారిణే. ఈమెతోపాటు మైక్రోబయాలజీ విభాగాధిపతి శ్రీదేవికి సైతం ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. కొవిడ్‌ పరీక్ష కేంద్రం వచ్చాక వీరికి ఒక సమయమంటూ లేదు. అర్ధరాత్రి వరకు కళాశాలలోనే ఉంటున్నారు. సాంకేతిక పరమైన సందేహాలు వస్తే వెంటనే నివృత్తి చేస్తున్నారు.
అంతా వీడియో కాల్‌లోనే
నోడల్‌ అధికారిణి జ్యోతి పరీక్ష నిర్వహణపై సీసీఎంబీలో శిక్షణ పొందారు. కేఎంసీలోని మరికొందరు నిపుణులు పుణెకు వెళ్లి కరోనా పరీక్షలపై శిక్షణ పొందారు. తీరా పరికరాలొచ్చాక వారు శిక్షణ పొందిన దానికి భిన్నమైనవి కనిపించాయి. దీంతో అప్పటిప్పుడు పుణెలో ఎన్‌ఐవీ నిపుణులతో వీడియోకాల్‌లో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. లాక్‌డౌన్‌ లేకపోతే ప్రత్యేకంగా నిపుణులు వచ్చి పరీక్షలపై అవగాహన కల్పించేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చరవాణిలోనే ఆన్‌లైన్‌లో అవగాహన పెంచుకొని సమర్థంగా పరీక్షలు చేస్తూ ఉత్తీర్ణులయ్యారు. అలుపెరగకుండా విధులు నిర్వర్తిస్తూ కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తున్నారు.

- జి.పాండురంగశర్మ, ఈనాడు, వరంగల్‌


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.