close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 30/04/2020 00:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నడక  ఆగదు!

వివేకవాణి

భయపడుతున్నారా?

బాధ పడుతున్నారా?

ఈ దారి నువ్వు దాటిందే...

వచ్చే మార్గం కూడా నువ్వు ప్రయాణించాల్సిందే...

ఇది నీ జీవితం...

జీవించు... తరించు...

ఇది నవజీవన శంఖారావం...

క్లిష్ట సమయంలో సదా స్మరణీయం!

దేనికీ భయపడకండి. ఎంతటి క్లిష్ట పరిస్థితికైనా సంసిద్ధులు కండి. మీరు అద్భుతాలను సాధించగలరు.

మీ సర్వశక్తి సంపత్తులతో పోలిస్తే, లోకంలోని ప్రతికూలతలు, వ్యతిరేకతలు ధూళికణాలవంటివి.


మనల్ని మనం దృఢంగా తీర్చిదిద్దుకునేందుకు ఉన్న పెద్ద వ్యాయామశాలే ఈ ప్రపంచం. ఎంత శ్రమిస్తే అంత దృఢమవుతాం. గడిచిన కాలమే గతాన్ని పూడ్చిపెట్టుగాక. అనంతమైన భవిష్యత్తు మీ ముందుంది.

కసారి స్వామి వివేకానంద హిమాలయాల ప్రాంతాల్లో కాలినడకన ప్రయాణిస్తున్నారు.

ఎంతో ఎత్తైన పర్వత ప్రాంతమది. చాలా దూరం ప్రయాణించాక కూడా గమ్యం చేరేందుకు సుదీర్ఘమైన మార్గం మిగిలే ఉంది.

అక్కడ కాలి నడక తప్ప ప్రత్యామ్నాయం లేదు, వివేకానందతో పాటు ఓ వ్యక్తి నడుస్తున్నాడు. స్వామి నిశ్చలంగా ముందుకు సాగుతున్నారు.

తోడుగా ఉన్న వ్యక్తి మాత్రం ఆపసోపాలు పడుతున్నాడు. ఇంకా వందల మైళ్లు నడవాలని... పైగా అది ఎగుడు దిగుళ్లతో కూడా ఉంటుందని విని ఆ వ్యక్తి భయపడుతూ వివేకానందతో.. ‘మహాశయా! దీనిని ఎలా దాటడం! నేనిక ఎంత మాత్రమూ నడవలేను. ఆగామి రహదారిని ఊహించుకుంటేనే నిరుత్సాహంతో గుండె బద్దలవుతోంది’ అంటూ కూలబడిపోయాడు.

అప్పుడు స్వామీజీ అతనితో ‘ మిత్రమా! ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మనం నడచివచ్చిన దారిని గమనించండి. మీ కాళ్ల కింద ఉన్న బాట మీరు దాటిందే కదా!

మీ ముందు ఉన్నదీ ఆ బాటే కదా! త్వరలో అది కూడా మీ కాళ్ల కిందకు వస్తుంది.’ అంటూ ఉత్సాహపరిచాడు.

ఆ వ్యక్తి నిరాటంకంగా గమ్యంచేరాడు.

అమృతపుత్రులం..

‘అమృతం లభించడం లేదని మురికి నీటితో సరిపెట్టుకుంటామా?’ అని ప్రశ్నించేవారు వివేకానంద. అందుకే ఆయన ప్రతి ప్రసంగంలో మనిషిలోని దివ్యత్వాన్ని మేల్కొలిపేందుకే ప్రయత్నించేవారు. ‘ప్రాణాయామం’ వంటి యోగ క్రియలతో శక్తిని సద్వినియోగపరచుకుంటూ దేహాన్ని దృఢతరం చేసుకోమనేవారు. అందులో భాగంగా వారు తమ ‘రాజయోగం’ ప్రసంగాల్లో భాగంగా శ్వేతాశ్వతరోపనిషత్తులోని శ్లోకాన్ని తరచూ ఉటంకించేవారు.

శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః

ఆయే ధామాని దివ్యాని తస్థు||

వేదాహమేతం పురుషం మహాంతం

ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్‌

తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాన్యఃపంథా విద్యతేయనాయ||

అమృత పుత్రులారా! వినండి! ఈ అజ్ఞాన సముద్రం నుంచి తరించే మార్గం ఒకటే ఉంది. అజ్ఞానాంధకారం ఆవల ఉన్న ఆ పరమపురుషుడిని కనుగొనడమే ఆ మార్గం. వేరే దారేదీ లేదు. మనలోని అమృతత్వాన్ని ఆవిష్కరించుకోవడం కోసమే ఈ లోకంలోకి వచ్చామని వివేకానంద తరచూ బోధించేవారు.

వీరిలో నువ్వెవరు?

ఇతరుల నుంచి అరువుగా తెచ్చుకున్న వస్తువుకు అధిక శోభను చేకూర్చి మరీ, అతి భద్రంగా అప్పజెప్పేవారు ఉత్తములు.

ఆ వస్తువును స్వప్రయోజనాలకు వినియోగించుకున్నంత.. వినియోగించుకొని యథారూపంలో తిరిగి ఇచ్చేసేవారు మధ్యములు.

సదరు వస్తువు రూపురేఖల్ని మార్చి అధ్వానంగా ముట్టజెప్పేవారు అథములు.

భగవంతుడు మనకు ఇచ్చిన మానవ జన్మ విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. మనిషిగా పుట్టించినందుకు పరమాత్మకు కృతజ్ఞతగా సార్థక జీవనాన్ని గడిపి, నలుగురి జీవితాల్లో వెలుగులు నింపి ఆయన పేరును నిలబెట్టేవారు ఉత్తములు.

‘నా చిన్నిపొట్టకు శ్రీరామరక్ష’ అనుకుంటూ ‘నేను, నా వాళ్లు’ అంటూ స్వార్థపరులుగానే గడిపేసేవారు మధ్యములు. భగవంతుడు నిర్దేశించిన ధర్మమార్గాన్ని అతిక్రమించి, అస్తవ్యస్త జీవనాన్ని గడుపుతూ, వచ్చిన మానవజన్మను వృథా చేసుకునేవారు అథములు.

గౌతమబుద్ధుడు పాంచభౌతికమైన ఈ దేహ ప్రయోజనం పరమోత్కృష్టమైనదని నిరూపించారు. అందుకే తథాగతుడని తలచుకోగానే, ఆయన వాల్చిన కనురెప్పల మాటున జారిన శాంతి నేటికీ తరంగాలు తరంగాలుగా పరివ్యాప్తమవుతోంది. సౌజన్య స్ఫూర్తి సహస్రదళాల కుసుమమై ప్రగాఢంగా పరిమళిస్తోంది.

చలించనివారే చరితార్థులు...

మన అంతరంగంలోని స్వేచ్ఛను సుఖదుఃఖాలేవీ భంగపరచకూడదు. బాహ్య పరిస్థితులేవీ మన మనో నిశ్చలతకు ఆటంకం కలిగించకూడదని తరచూ చెప్పేవారు వివేకానంద. ఇదే అంశంపై విదేశాల్లో ఓ సందర్భంలో ఆయన ప్రసంగిస్తూ.. ఓ ఎద్దు కథను దృష్టాంతంగా వివరించారు.

ఒకరోజు ఓ వృషభం కొమ్ముపైన దోమ ఒకటి వచ్చి వాలింది. చాలాసేపటి తర్వాత దాని దృష్టి ఎద్దుపై పడింది. తాను ఎంతో సేపటి నుంచి దీని కొమ్ముపై కూర్చున్నాను. దానికి భారమై ఉంటాననుకుంది దోమ. అదే బాధతో ఆ ఎద్దు కొమ్మువైపు నుంచి ముందుకు వచ్చి . ‘అయ్యో! నేను ఎప్పటి నుంచో నీ కొమ్ముపై కూర్చున్నాను. నీకు చాలా బరువై ఉంటాను. నేను అలా కూర్చోవటం వల్ల నువ్వు ఎంతో కష్టపడి ఉంటావు. నన్ను క్షమించు’ అంది. అప్పుడు వృషభం.. ‘అబ్బే! అదేమీ లేదు. అసలు నువ్వొక జీవివి నాపై వాలావన్న స్పృహే లేదు. నువ్వు నీ కుటుంబ పరివారంతో వచ్చి కలకాలమూ నా కొమ్ముపై కూర్చో,. దాని వల్ల నాకేమీ హానీ లేదు’ అని సమాధానమిచ్చింది. వివేకానంద ఈ కథ చెబుతూ మన మానసిక స్థితి కూడా అంత దృఢంగా ఉండాలి. ఈ ప్రాపంచిక సుఖదుఃఖాలేవీ మనల్ని చలింపజేయకూడదు అనేవారు. ●

‘ఇచ్ఛాశక్తి తక్కిన శక్తులన్నిటి కన్నా బలవత్తరమైంది. అది సాక్షాత్తూ భగవంతుని దగ్గరి నుంచి వచ్చేదే కాబట్టి దాని ముందు తక్కినదంతా తొలగిపోవలసిందే. నిర్మలం, గట్టిదైన సంకల్పం సర్వశక్తిమంతమైంది. ●

ఎవరి ధర్మాన్ని వారు ఆచరించాలి. స్వీయ ఆదర్శాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలి. పురోభివృద్ధికి ఇదే కచ్చితమైన మార్గం. కార్యాచరణలో అందరి శక్తిసామర్థ్యాలు ఒకేరీతిలో ఉండవు. నీ ఆదర్శాన్ని, ధర్మాన్ని బట్టి మరొకరి ధర్మాన్నీ తప్పుబట్టొద్ధు ఆపిల్‌ చెట్టు గుణాన్ని మర్రిచెట్టులో, మర్రి గుణాన్ని ఆపిల్‌చెట్టులో పరీక్షించ కూడదు. మర్రిచెట్టును పరీక్షించాలంటే.. ఆ చెట్టు పరిస్థితులనే పరిగణనలోకి తీసుకోవాలి. ఏ ఆదర్శాన్నీ ప్రశ్నించే, పరిహరించే హక్కు లేదు. స్వీయ ధర్మసిద్ధికి ప్రతివ్యక్తీ యథాశక్తి ప్రయత్నించాలి. అనేకత్వంలో ఏకత్వమే సృష్టి నియమం.

కష్టాలను, కడగండ్లను స్వశక్తితోనే అధిగమించాలి. మీకు సాయపడే వారెవ్వరూ లేరు. ధీరులూ, సమర్థులైన కార్యసాధకులకే అదృష్టం కూడా అనుకూలిస్తుంది. దిగంతాలను తాకే వీరోచితమైన ధైర్యోత్సాహాలతో ప్రయత్నిస్తూ కడదాకా వేచి ఉండేవాడే అద్భుతాలను సుసాధ్యం చేయగలరు.

- సైదులు


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.