close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 04/05/2020 02:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇకపై కొత్త లెక్క!

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నాయి. వ్యక్తిగతంగానూ.. ఆదాయ మార్గాలు దెబ్బతినడం, తగ్గిపోవడం చూస్తూనే ఉన్నాం. ఈ సమయంలో చిక్కుల్లో పడకుండా చూసుకోవడంతోపాటు.. భవిష్యత్తులోనూ భరోసా లభించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనాకు ముందు.. కరోనా తర్వాత.. ఇక నుంచి ప్రతిదీ ఇలాగే ఆలోచించాల్సి వస్తుంది. ఆర్థిక విషయాల్లో ఇది మరింత ముఖ్యం. గతంలో చేసిన పొరపాట్లు ఎలా ఉన్నా.. వాటిని సరిదిద్దుకుంటూ ముందుకెళ్లాల్సిన సమయమిది..

క్రమం తప్పకుండా ఆదాయం వచ్చినన్ని రోజులూ ఏ ఇబ్బందీ కనిపించదు. కానీ, అనుకోకుండా అది ఆగిపోయినా.. లేదా తగ్గినా.. బడ్జెట్‌ కాస్తా తలకిందులవుతుంది. చేతిలో కనీసం ఆరు నెలలపాటు ఖర్చులకు సరిపోయే మొత్తం ఉండాలని ఆర్థిక నిపుణులు ఎప్పుడూ సూచిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ లెక్క మారింది. ఈ అత్యవసర నిధి కనీసం 12 నెలల వరకూ ఉండాల్సిందే. ఎందుకు అని ప్రశ్నించే వారు.. ఒక్కసారి ప్రస్తుత పరిస్థితులను ఒకసారి గమనించండి. ఆదాయం లేకపోవడం, అనుకోని అనారోగ్యం, మరమ్మతులాంటి  వాటితోపాటు, రుణ వాయిదాల మొత్తమూ లెక్క వేసుకోవాలి. ఈ డబ్బును మంచి బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూపంలో దాచుకోవాలి. అనుకున్న వెంటనే చేతికి డబ్బు వచ్చేలా చూసుకోవాలి. అధిక వడ్డీ రుణాల జోలికి వెళ్లకుండా ఇది మనల్ని కాపాడాలి.


బ్యాంకు భద్రమేనా?

తాజాగా కొన్ని బ్యాంకుల పరిస్థితిని గమనిస్తే.. ఎన్‌పీఏలు పేరుకుపోవడంతో దివాలా తీసే పరిస్థితికి వచ్చాయి. ఇలాంటి బ్యాంకుల్లో మీ డిపాజిట్లు, ఇతర పెట్టుబడులు ఉంటే జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం తక్కువ ఎన్‌పీఏలతో, స్థిరంగా ఉన్న బ్యాంకులే క్షేమం. మీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఇలాంటి వాటిలోకి మార్చేయండి.


వెనక్కి తీసుకోవద్దు...

దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టిన పెట్టుబడులను తాత్కాలిక సంక్షోభంలో వెనక్కి తీసుకోవద్దు. మరీ.. తప్పదు.. ప్రాణావసరం అనుకున్నప్పుడే.. వాటిని ముట్టుకోండి. మీకు ఇప్పుడు కచ్చితంగా డబ్బు అవసరం ఉందనుకోండి.. ముందుగా మీ దగ్గర ఉన్న పెట్టుబడులు, బంగారం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలాంటివన్నీ ఒక దగ్గర రాసుకోండి. అందులో సులభంగా నగదుగా మార్చుకోగలవాటిని ఎంచుకోండి. తాత్కాలిక అవసరాల కోసం వాటిని వినియోగించండి. పరిస్థితులు కుదురుకున్నాక.. వాటిని తిరిగి భర్తీ చేయండి. భవిష్య నిధి, దీర్ఘకాలిక వ్యూహంతో చేస్తున్న పెట్టుబడులను సాధ్యమైనంత వరకూ తీయొద్దు.


వాయిదాల సంగతేంటి?

రుణ వాయిదాలు, క్రెడిట్‌ కార్డు బిల్లులపై కేంద్ర ప్రభుత్వం మూడు నెలల మారటోరియం విధించింది. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే.. ఇది కేవలం వాయిదాలను వాయిదా వేయడమే. రద్దు చేయడం కాదు.
ఈ కాలంలో చెల్లించాల్సిన వడ్డీని అసలులో కలుపుతారు. అంటే, ఇది కొత్తగా రుణం తీసుకున్నట్లే. ఈ కష్టకాలంలో మరీ అవసరమైతేనే ఈ సౌకర్యాన్ని వినియోగించుకోండి. ఆదాయం తగ్గిన వేళ.. క్రెడిట్‌ కార్డులను వాడి తాత్కాలికంగా గట్టెక్కవచ్చు. కానీ,
వీటి బిల్లులు మాత్రం ఎప్పటికప్పుడు చెల్లించడమే మేలు. లేకపోతే అధిక వడ్డీని భరించాల్సి వస్తుంది. కాబట్టి, మీ క్రెడిట్‌ కార్డు బిల్లులు పెరగకుండా చూసుకోండి.


ఆచితూచి ఖర్చు

సంపాదించేది ఖర్చు చేసేందుకే అన్న ధోరణి విడనాడే సమయమిది. నగదు లభ్యత కష్టమవుతున్న తరుణంలో ఆచితూచి ఖర్చు చేయాలి. ప్రతి రూపాయికీ లెక్క ఉండాలి. నిజం చెప్పాలంటే.. ఇప్పుడు మనమందరమూ పిసినారులుగా మారాలి. అత్యవసరాలు కాని వాటిని వీలైనంత కాలం వాయిదా వేయడం నేర్చుకోవాలి. అనుకున్న వెంటనే కాదు.. అవసరమైతేనే కొనాలి అనేది అలవాటు చేసుకోవాలి. మీరు జీవించేందుకూ, మీపై ఆధారపడిన వారి అవసరాలు తీర్చడం, పనివారికి జీతాలు ఇవ్వడంలాంటి వాటికే డబ్బును కేటాయించాలి. మిగతా మొత్తాన్ని వీలైనన్ని మార్గాల్లో దాచి పెట్టాలి.


ప్రీమియం  చెల్లించారా?

కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. ఆరోగ్య, జీవిత బీమా పాలసీలను అలక్ష్యం చేయకూడదు. కుటుంబంలోని ప్రతి వ్యక్తికీ ఆరోగ్య బీమా రక్షణ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఇది లేదనుకోండి.. అనుకోకుండా ఏ అనారోగ్యం వచ్చినా.. డబ్బులకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనికి సంబంధించి ప్రీమియం ఎప్పటికప్పుడు గడువులోపు చెల్లించడం మేలు. యాజమాన్యం కల్పిస్తున్న బృంద ఆరోగ్య బీమా ఉంటే.. దానికి అదనంగా సూపర్‌ టాపప్‌ పాలసీలను తీసుకోండి. ఇక ఆధారపడిన వారున్న వారందరూ.. తప్పనిసరిగా వార్షికాదాయానికి కనీసం 12 రెట్ల వరకూ టర్మ్‌ జీవిత బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి.


పెట్టుబడులే రక్ష..

స్టాక్‌ మార్కెట్లు కాస్త అనిశ్చితిగానే ఉన్నాయి. ఇందులో పెట్టిన ప్రత్యక్ష, పరోక్ష పెట్టుబడులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. పెట్టుబడి మొత్తం తగ్గిపోతోంది. ఈ సమయంలో మదుపరులు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడి పెట్టుబడులను వెనక్కి తీసుకోవద్దు. మీ ఆర్థిక ప్రణాళికలను బట్టి, మీ మదుపు వ్యూహాలు ఉండాలి. అవసరమైతే వ్యక్తిగత ఆర్థిక నిపుణులను సంప్రదించి, పెట్టుబడుల విషయంలో ఏం చేయాలన్నది తెలుసుకోండి. అంతేకానీ.. భావోద్వేగాలతో కాగితం మీద ఉన్న నష్టాన్ని.. వాస్తవం అయ్యేలా చేసుకోవద్దు. నిపుణుల సలహాలతో మార్పులు చేర్పులు చేసుకునే ప్రయత్నం మంచిది. ఈక్విటీలు, బంగారం, డెట్‌ ఫండ్లు, బాండ్లు స్థిరాస్తులు తదితరాల్లో వైవిధ్యంగా మదుపు చేసేలా మీ వ్యూహం ఉండాలి.


వీలునామా రాయండి..

పెట్టుబడులకు నామినీని పేర్కొనడం తప్పనిసరి. అదే సమయంలో కుటుంబ పెద్ద తదనంతరం, అతని/ఆమె వారసులకు ఆస్తులు, పెట్టుబడులన్నీ ఏ ఇబ్బందీ లేకుండా బదిలీ కావాలి. దీనికోసం వీలునామా ఉపయోగపడుతుంది. నామినీల పేర్లు తెలియజేయకుండా, వీలునామా రాయకుండా ఉంటే.. ఇప్పటికైనా ఈ పనులను పూర్తి చేయండి.

- అధిల్‌ శెట్టి, సీఈఓ, BankBazaar.com

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.