close

తాజా వార్తలు

Published : 05/05/2020 21:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చిరు ‘జగదేక వీరుడు..’ సినిమా అలా మొదలైంది!

హైదరాబాద్‌: అగ్రకథానాయకుడు చిరంజీవి-శ్రీదేవి జంటగా నటించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ 1990 మే9న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈనెల 9వ తేదీతో ఈ సినిమా విడుదలై 30ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా వైజయంతీ మూవీస్‌ ఈ సినిమా వెనుక ఉన్న కథను అభిమానులతో పంచుకుంటోంది. యువ కథానాయకుడు నాని వాయిస్‌ ద్వారా ఈ చిత్ర విశేషాలను చెప్పనున్నారు. ఇందులో భాగంగా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కథకు ఎలా బీజం పడిందో నాని వివరించారు. అది ఆయన మాటల్లోనే..

‘‘బ్లాక్‌ బస్టర్లు ఎన్నో వస్తాయి. కానీ, జనరేషన్లు మారినా, ఎవర్‌గ్రీన్‌గా ఉండే బ్లాక్‌ బస్టర్ల లిస్ట్‌లో ఫస్ట్‌ ఉండే సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. సినిమా తీసే, సినిమా చూసే విధానాన్ని మార్చిన ఈ చిత్రం  ఎలా పుట్టింది. అశ్వినీదత్‌గారికి ఏనాటి నుంచో ఎన్టీఆర్‌ జగదేక వీరుని కథలాంటి ఫాంటసీ సినిమా చిరంజీవిగారితో  చేయాలని, అది తను ప్రేమగా ‘బావ’ అని పిలుచుకునే రాఘవేంద్రరావుగారు మాత్రమే తీయగలరని గట్టి నమ్మకం ఉండేదట. ‘ఆఖరిపోరాటం’ తర్వాత చిరంజీవిగారితో సినిమా చేయాలనుకున్నారు దత్తుగారు. ఆయనకు క్లోజ్‌ ఫ్రెండ్‌, కో-డైరెక్టర్‌ అయిన శ్రీనివాస్‌ చక్రవర్తిని, రాఘవేంద్రరావుతో కలిపి తిరుపతికి పంపారు. సరిగ్గా తిరుమల కొండపై ఉండగా, దత్తగారి మనసు తెలిసిన శ్రీనివాస చక్రవర్తి ‘దేవకన్య భూమిపైకి వచ్చినప్పుడు ఆమె ఉంగరం పోతుంది. అది చిరంజీవిగారికి దొరుకుతుంది’ అని ఊహామాత్రంగా చెప్పారు. అది రాఘవేంద్రరావుగారికి బాగా నచ్చింది. దత్తుగారి కలకు దగ్గరగా ఉంది. ఆయనకీ నచ్చింది’’

‘‘మరి జగదేకవీరుడికి అతిలోక సుందరిగా జోడీ ఎవరు? అందరికీ మదిలో మెదిలిన పేరు ఒక్కటే. వైజయంతీ ఆస్థాన నాయిక వెండితెర దేవత శ్రీదేవి. క్రేజీ కాంబినేషన్‌ సెట్‌ అయింది. దానికి తగిన కథను సిద్ధం చేయటానికి వైజయంతీ ఆఫీస్‌లో రచయితల కుంభమేళా ప్రారంభమైంది. యండమూరి వీరేంద్రనాథ్‌గారు, జంథ్యాలగారితో మొదలై, సత్యమూర్తిగారు, విజయేంద్ర ప్రసాద్‌గారు, తమిళ రచయిత క్రేజీ మోహన్‌గారు ఇలా ఇంతమంది రచయితల సైన్యం సిద్ధమైంది. అంతేకాదు, చిరంజీవిగారు కూడా నెలరోజుల పాటు అక్కడకు వెళ్లి కథా చర్చల్లో పాల్గొని తన సలహాలు కూడా ఇచ్చేవారు. ‘దేవకన్యను అతిలోక సుందరిగా చూపిస్తున్నప్పుడు నేను కొంచెం మాసిన గడ్డంతో సామాన్య మానవుడి లుక్‌లో ఉంటేనే బాగుంటుంది. అందరూ కనెక్ట్‌ అవుతారు’ అని సలహా ఇచ్చారు. మరోవైపు బాంబేలో తన కాస్ట్యూమ్స్‌ తానే కుట్టించుకోవడం మొదలు పెట్టారు శ్రీదేవిగారు’’

‘‘ఇలా అందరూ కలిసి తమ సమష్టికృషితో ఈ అందమైన చందమామ కథను తెలుగు సినీ చరిత్రలో మర్చిపోలేని అద్భుత చిత్ర కావ్యంగా మలిచారు. చరిత్రను సృష్టించిన ఈ సినిమా అంత ఈజీగా అయిపోయిందనుకుంటున్నారా? లేదు మానవ! చాలా జరిగింది’’ అని ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా పుట్టుకను వివరించారు యువ కథానాయకుడు నాని.

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.