close

తాజా వార్తలు

Published : 07/05/2020 21:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఓటీటీ కంటెంట్‌కు మించి ఇవ్వాల్సిందే: రాజమౌళి

కరోనా - లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బంది పడుతున్న రంగాల్లో సినిమా పరిశ్రమ ఒకటి. వేలాది మంది ఆధారపడే ఈ రంగాన్ని ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ లోగా ప్రేక్షకులు ఓటీటీల ద్వారా కొత్త తరహా వినోదానికి అలవాటు పడటం, ప్రపంచ సినిమాను రుచి చూడటం లాంటివి జరిగిపోయాయి. మరి కొత్త ‘సినిమా’ను చూసిన ఆ కళ్లు... రెగ్యులర్‌ భారతీయ సినిమాను ఎలా చూస్తాయి. దీని కోసం దర్శకనిర్మాతలు ఎలాంటి మార్పులు చేయాలి అనే అంశం గురించి ఓ వెబినార్‌ జరిగింది. అందులో దేశవ్యాప్తంగా సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొన్న ఆ వెబినార్‌లో మన తెలుగు పరిశ్రమ నుంచి ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌ బాబు, యువ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ పాల్గొన్నారు. ఈ చర్చలో వారు చెప్పిన అంశాలు మీ కోసం. 


లగ్జరీ తగ్గించుకుంటే.. అన్నీ తగ్గుతాయ్‌

‘‘కరోనా - లాక్‌డౌన్‌ తర్వాత సినిమా పరిశ్రమలో మార్పులు ఉంటాయనిపిస్తోంది. సినిమాను నదితో పోలిస్తే... ప్రస్తుతం సినిమా దారి మార్చుకుంది. దానికి తగ్గట్టే దర్శకులు కూడా కథల విషయంలో మార్పు చూపించాలి’’ అని ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి అన్నారు. వెబినార్‌లో వివిధ అంశాల మీద ఆయన స్పందించారు. ‘‘స్టోరీ టెల్లింగ్‌ ఒకటే సినిమాను ఎల్లకాలమూ బతికిస్తుంది. సమాజంలో కరోనా - లాక్‌డౌన్‌ వల్ల వచ్చిన మార్పులను ఒంటబట్టించుకొని సినిమాను కూడా మార్చాలి. ప్రేక్షకులు సినిమాను చూసే విధానం మారబోతోంది. మూస ధోరణిలో వెళ్తే బోల్తా పడతాం’’ అని చెప్పారు. ఆయన ఇంకా చెప్పారంటే... 

లేకపోతే రిజక్ట్‌ చేస్తారు...

ఇప్పటికిప్పుడు థియేటర్ల ఓపెన్‌ చేస్తే సినిమాలు చూడటానికి జనాలు వస్తారా లేదా అనేది చూడాలి.  థియేటర్‌కు రావడానికి ప్రేక్షకుడు జంకొచ్చు. కాస్త సమయం తీసుకొని పరిస్థితి కుదుటపడింది అని నిర్ణయించుకున్నాక రావొచ్చు. దీనికి ఆరు నెలలైనా పట్టొచ్చు, లేక సంవత్సరమైనా పట్టొచ్చు.  ఈ లోపు ప్రజలు ఆన్‌లైన్‌ కంటెంట్‌కి ఇంకా ఎక్కువగా అలవాటు పడతారు. అప్పుడు మనం వాటికి  మించి అలరించేలా మన సినిమాలను మార్చుకోవాలి.  లేకపోతే ప్రేక్షకులు సినిమాలను తిరస్కరిస్తారు. 

చాలా ఆతృతగా ఉన్నా...

కరోనా - లాక్‌డౌన్‌ తర్వాత ఏం చేయాలి, ఎలాంటి సినిమాలు చేయాలని నేను చాలా ఆతృతగా ఉన్నాను. ప్రస్తుత కష్ట కాలాన్ని  చూసి సినిమాకు ఏమవుతుందా అని నేను భయపడం లేదు. నాకు ఛాలెంజింగ్‌ గా ఉండటం అంటే ఇష్టం. కరోనా తర్వాత  పరిశ్రమలో, సినిమాల్లో వచ్చే మార్పులను ఛాలెంజింగ్‌గా తీసుకొని.. నన్ను నేను మరింతగా అభివృద్ధి చేసుకొని ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నిస్తాను. 

స్టార్‌ ఎక్కడైనా స్టారే...

దక్షిణాదిలో స్టార్ల సినిమాలొస్తే ఆటోమేటిక్‌ జనాలు థియేటర్‌కు వస్తారని అంటుంటారు. దానిని నేను ఏకీభవించను. స్టార్‌ ఎక్కడైనా స్టారే. ఉత్తరాదిలోనూ స్టార్ల సినిమాలకు జనాలు థియేటర్లకు వస్తారు. అయితే కరోనా తర్వాత ఈ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.  ఓ సినిమాలో హీరో ఇంట్రడక్షన్‌ సన్నివేశాన్ని వందలాది మంది ప్రేక్షకుల మధ్యలో థియేటర్‌లో చూస్తే ఉండే అనుభూతి వేరు. ఇంట్లో మొబైల్‌ / కంప్యూటర్‌లో హెడ్‌ఫోన్‌ పెట్టుకొని చూస్తే వచ్చే అనుభూతి వేరు. ప్రేక్షకులు థియేటర్లకు రప్పించే అంశాల్లో ఈ అనుభూతి ఒకటి. ఆ అనుభూతిని ప్రేక్షకులకు కలిగిస్తేనే ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారు. 

అప్పుడు అన్నీ తగ్గుతాయ్‌...

మనిషికి ముఖ్యంగా కావాల్సినవి రోటీ కపడా ఔర్‌ మకాన్‌. దీంతోపాటు వినోదమూ ముఖ్యమే. మన దేశంలో వినోదం అంటే ఎక్కువగా సినిమానే. కాబట్టి సినిమా ఎప్పుడు ఓపెన్‌ చేసినా బాగుంటుంది.  కరోనా తర్వాత సినిమాల్లో వచ్చే మార్పులు గురించి చూస్తే... ముందుగా చర్చించాల్సింది బడ్జెట్‌. దీని కోసం చేయాల్సిన పనుల్లో లగ్జరీ తగ్గించుకోవడం ముఖ్యమైంది. లగ్జరీ తగ్గితే ఖర్చు తగ్గుతుంది. దాని వల్ల రెమ్యూనరేషన్‌ తగ్గుతుంది. తద్వారా సినిమా బడ్జెట్‌ కూడా తగ్గుతుంది. దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకుంటారనుకుంటున్నాను. 

తక్కువ సిబ్బందితోనే... 

కరోనా తర్వాత సినిమాల కథ విషయంలో పెద్దగా మార్పులు ఉండవు. ఎందుకంటే మన సినిమా కథలకు కరోనాకు ఎలాంటి సంబంధం ఉండదు. అయితే సినిమా చిత్రీకరణ గురించే ఆలోచించాలి. తక్కువ మంది సిబ్బందితో జాగ్రత్తగా సినిమా చిత్రీకరణలు జరుపుకోవాలి. ఒకప్పటిలాగా ఎక్కువమంది బృందంతో చిత్రీకరణలు జరిపే పరిస్థితి ఉండకపోవచ్చు. పక్క రాష్ట్రాలు, విదేశాల నుంచి నటీనటులు, టీమ్‌ను తీసుకురావడం సాధ్యంకాకపోవచ్చు. స్థానిక బృందంతోనే సినిమాను కొనసాగించాలి. ఎక్కువమంది సిబ్బంది అవసరమైనప్పుడు, విదేశీయులు కావాల్సినప్పుడు విజువల్‌ ఎఫెక్ట్స్‌ సాయంతో చిత్రీకరణను ముందుకు తీసుకెళ్లాలి. 


వారమంతా వర్క్‌ ఫ్రమ్‌ హోం... వారాంతంలో సినిమా

‘‘సినిమా చిత్రీకరణలు ఎప్పుడు మొదలవుతాయి. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయి. సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయి అనే విషయాల్లో ఇంకా ఓ స్పష్టత లేదు. అయితే సినిమా పరిశ్రమ వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించాలని కోరుకుంటున్నాను’’ అని ప్రముఖ నిర్మాత డి. సురేశ్‌ బాబు అన్నారు. కరోనా - లాక్‌డౌన్‌ తర్వాత భారతీయ సినిమా గురించి ఆయన వెబినార్‌లో వివిధ అంశాలు చర్చించారు. పూర్తి జాగ్రత్తలతో చిత్రీకరణ నిర్వహించాల్సి ఉంటుంది. ఆదరాబాదరగా పరిశ్రమను పునర్‌ ప్రారంభించి... సమస్యలు కొని తెచ్చుకొని మళ్లీ మూసేసే పరిస్థితి తీసుకురాకూడదంటున్న డి. సురేశ్‌ బాబు చెప్పిన మరిన్న అంశాలవివీ.

ముందు పోస్ట్‌ ప్రొడక్షన్‌... 

ప్రపంచవ్యాప్తంగా ఏ సినిమా పరిశ్రమలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలి. వాటిపై అధ్యయనం చేయాలి. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మన దగ్గర ప్రారంభించాలి. తొలుత సినిమాల పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ మొదలవుతుంది. ఆ తర్వాత ఓటీటీ, టీవీ సీరియళ్లు, షో చిత్రీకరణలు మొదలవుతాయి. ఆ తర్వాతే సినిమా అనుకుంటున్నాను. ఈ లోపు అన్ని రకాల కోణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. చిత్రీకరణ ప్రదేశాల్లో వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలి. దీని కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించే పనిలో ఉన్నాం.  

ఖర్చు తగ్గించాలి... 

సినిమా పరిశ్రమను పూర్తి స్థాయిలో పునరుద్దరించాలంటే చాలా సమయమే పడుతుంది. నేనైతే 12 నెలలైనా పట్టొచ్చని అనుకుంటున్నాను. కరోనా - లాక్‌డౌన్‌ వల్ల ఎక్కువగా నష్టపోతోంది ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లే. నటులు, సాంకేతిక నిపుణులకు అంతగా ప్రభావం ఉండదు. నటీనటులు సినిమా బడ్జెట్‌, ఖర్చు గురించి  ఆలోచించాలి... అప్పుడే ఖర్చు తగ్గుతుంది. నిర్మాతగా ఎలాంటి విభాగాలు, పనుల్లో ఖర్చు తగ్గించొచ్చు అనేది ఆలోచిస్తున్నాం. 

కచ్చితంగా బయటకు వస్తారు... 
లాక్‌డౌన్‌ కారణంగా చాలా సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, ఎంఎన్‌సీలు వర్క్‌ ఫ్రమ్‌ హోంకి అలవాటు పడుతున్నాయని వార్తలొస్తున్నాయి. భవిష్యత్తులో చాలా శాతం పనులు ఇంట్లోంచే పూర్తవుతాయి. కాబట్టి ప్రేక్షకుడు వారమంతా ఇంట్లోనే ఉంటాడు. అప్పుడు వీకెండ్‌లో కచ్చితంగా ఇళ్ల నుంచి బయటకు రావాలనుకుంటారు. అప్పుడు వాళ్లకు రెస్టరెంట్లు, సినిమాలే ఆప్షన్‌గా కనిపిస్తాయి. కాబట్టి సినిమాలకు ఆదరణ కొనసాగుతుంది. 

‘‘కరోనా తర్వాత సినిమా కథల విషయంలో పెద్దగా మార్పులు ఉంటాయనుకోవడం లేదు. అయితే సినిమాను తెరకెక్కించే విధానం, ప్రజల ముందుకు తీసుకెళ్లే విధానంలో కొన్ని మార్పులు ఉంటాయి. కొత్త తరహా సినిమాలు, కథా బలమున్న సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. సినిమాను థియేటర్‌లో చూస్తే వచ్చే ఫీలింగ్‌ ఇంకెక్కడా రాదు. కాబట్టి ప్రేక్షకుడు థియేటర్‌కు వస్తాడు. అలా వచ్చినవాడు నిరాశపడకుండా మెరుగైన సినిమా చూపిస్తే చాలు’’

- నాగ్‌ అశ్విన్‌, దర్శకుడు

 

ఓటీటీలో విడుదల: పెద్ద సినిమాలు కష్టమే!

లాక్‌డౌన్‌ కారణంగా సినిమాలు ఓటీటీలో నేరుగా విడుదల చేస్తారంటూ వార్తలొచ్చాయి. ఒకటి రెండు అలా విడుదలయ్యాయి కూడా. దీనిపై ప్రముఖ నిర్మాత సురేశ్‌ బాబు మాట్లాడుతూ ‘‘ఓటీటీకి వెళ్లే అవసరం వస్తే... తొలుత చిన్న బడ్జెట్‌ సినిమాలు వెళ్తాయి. ఆ తర్వాత మధ్య తరగతి బడ్జెట్‌ సినిమాల వాళ్లు ఆలోచిస్తారు. భారీ బడ్జెట్‌, స్టార్‌ హీరోల సినిమాల ఈ స్టైల్‌లోకి రాకపోవచ్చు’’ అని అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ ‘‘సినిమాలు ఓటీటీల్లో రిలీజ్‌ అనేది ఆయా సినిమాలు, నిర్మాతల ఆలోచన బట్టి ఉంటుంది. సినిమా బడ్జెట్‌, స్పాన్‌ లాంటివి ఇక్కడ కీలకంగా ఉంటాయి’’ అని చెప్పారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.