close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 11/05/2020 00:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మోగింది నగారా.. పారాహుషార్‌!

మెడికల్‌, ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షల సన్నద్ధతకు పదును

సందిగ్ధత పోయింది...అనిశ్చితి తొలగింది! వాయిదా పడిన ప్రవేశపరీక్షల తేదీలను ప్రకటించేశారు! ఇంటర్‌ బైపీసీ, ఎంపీసీ విద్యార్థులు పఠన ప్రణాళికను పకడ్బందీగా మల్చుకుని ప్రిపరేషన్‌ను పదునెక్కించాల్సిన తరుణమిది.అందుకు ఏం చేయాలో నిపుణుల మార్గదర్శకత్వం.. ఇదిగో!

మామూలుగా అయితే ఈ పాటికి అన్ని పోటీ పరీక్షలు పూర్తవ్వటంతో పాటు కొన్నింటికి ఫలితాలు కూడా వచ్చి ఉండేవి. కానీ కరోనా విపత్తు మూలంగా విద్యాసంవత్సరం వెనక్కి పోవాల్సిన పరిస్థితి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. పరీక్షలు సకాలంలో జరగకపోవటం వల్లా, సెలవులు రావటం వల్లా అలసత్వం ఏర్పడవచ్ఛు దాన్ని వీడాలి. చాలాసార్లు చదివిన పాఠ్యాంశాలే.. పదే పదే పునశ్చరణ చేసినవే. కానీ ఇప్పుడు కాలవ్యవధి స్పష్టమైనందున మరోసారి సమగ్రంగా పరీక్షల దిశగా ముందుకు సాగటం కర్తవ్యం.

తర్జన భర్జనల మధ్య జేఈఈ- మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌, నీట్‌, ఎంసెట్‌ పరీక్షల తేదీలు వెలువడ్డాయి. ప్రకటించిన ప్రకారం వీటిని నిర్వహించే తేదీలు-

* జేఈఈ మెయిన్‌: జులై 18 నుంచి 23 వరకు

* నీట్‌: జులై 26

* ఏపీ ఎంసెట్‌: జులై 27 నుంచి 31 వరకు

* జేఈఈ అడ్వాన్స్‌డ్‌: ఆగస్టు 23

సాధారణ పరిస్థితుల్లో అటు కళాశాల, ఇటు పోటీ పరీక్షల సన్నద్ధతలో సాధారణ విద్యార్థులు రెండింటినీ సమన్వయపరచుకోలేక సతమతమవుతుంటారు. ఇప్పటివరకు కాలేజీలో, తను అదనంగా నేర్చుకుంటున్న కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్లలో వారు చెప్పింది మాత్రమే విని, సొంతంగా చదువుకోవాలన్న వాటికి సమయం లేదని ఇబ్బందిపడే విద్యార్థులుంటారు. సానుకూల వైఖరితో ఆలోచిస్తే ఈ లాక్‌డౌన్‌ సమయం.. విద్యార్థులు గరిష్ఠంగా సద్వినియోగం చేసుకోవటానికి లభించిన అవకాశం.

సుమారుగా రెండు నెలల అదనపు సమయం ఈ సందర్భంలో దొరికిందంటే దాన్ని ఎంత బాగా సద్వినియోగపరుచుకోవాలన్నదే విద్యార్థుల లక్ష్యంగా ఉండాలి. రాబోయే ఏడెనిమిది వారాల్లో విద్యార్థి తను సిద్ధమయ్యే జేఈఈ-మెయిన్‌/ అడ్వాన్స్‌డ్‌/నీట్‌/ఎంసెట్‌ పరీక్షలకు ప్రణాళికను ఇస్తున్నాము. లాక్‌డౌన్‌ విరామ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా విద్యార్థుల లక్ష్యసాధనకు తోడ్పడేందుకు అనుభవజ్ఞులైన అధ్యాపకుల సూచనల మేరకు రూపొందిన ప్రణాళిక ఇది. దీని ద్వారా విద్యార్థి ఏ వారానికి ఆ వారం నిర్దిష్ట పాఠ్యాంశాలపై దృష్టి సారించి మంచి ఫలితం సాధించవచ్ఛు

జేఈఈ-మెయిన్‌.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌..నీట్‌.. ఎంసెట్‌.. పోటీ పరీక్ష ఏదైనప్పటికి దాదాపుగా అన్నింటికీ వాటికి కేటాయించిన సబ్జెక్టుల్లో సిలబస్‌ మాత్రం ఇంచుమించు సమానమే.

నీట్‌ (యూజీ)/ ఎంసెట్‌

కాలవ్యవధి: 60 రోజులు (8 వారాలు)

సబ్జెక్టులు: ఫిజిక్స్‌, కెమిస్ట్ట్రీ, బయాలజీ

ముఖ్యమైన వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే...

బయాలజీలోని అధ్యాయాలు = 13

ఫిజిక్స్‌లోని అధ్యాయాలు = 19

కెమిస్ట్రీలోని అధ్యాయాలు = 26

కెమిస్ట్రీ పునశ్చరణకు కావలసిన రోజులు = 30

ఫిజిక్స్‌, బయాలజీల పునశ్చరణకు కావలసిన రోజులు = 30

ఈ వ్యవధిలోనే మాక్‌ టెస్టుల సాధనకు రోజులు = 30 (రోజు విడిచి రోజు)

దీన్ని అమలు చేయటం అసాధ్యమేమీ కాదు. పరీక్షలో గరిష్ఠ మార్కులు సాధించాలన్న తపన ఉన్న ఏ సాధారణ విద్యార్థికైనా ఇది సాధ్యమే!

ఇవి పాటించండి

* ముఖ్యమైన అధ్యాయాలను నీట్‌ (యూజీ) ప్రాస్పెక్టస్‌లోని సిలబస్‌ పక్కన పెట్టుకొని ఎన్‌సీఈఆర్‌టీ/ సీబీఎస్‌ఈ 11, 12 వ తరగతి పాఠ్యపుస్తకాల నుంచి సాధన చేయాలి.

* సీబీఎస్‌సీ 11, 12 తరగతి పాఠ్యపుస్తకాలకు అదనంగా ఉన్న అన్ని సపోర్టింగ్‌ మెటీరియల్స్‌, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల వెబ్‌సైట్‌లో ఉన్న ఎగ్జంప్లర్‌ పుస్తకాల్లోని ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలన్నీ ప్రాక్టీసు చేయాలి.

* ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీల ప్రయోగదీపికలను క్షుణ్ణంగా చదవాలి.

* ఇంచుమించుగా 11, 12 తరగతుల్లోని ఫిజిక్స్‌, బయాలజీల్లో సమానంగానే ప్రశ్నలు ఇస్తున్నారు. ఒక్క కెమిస్ట్రీలో మాత్రం 12 వ తరగతి నుంచి కొన్ని ఎక్కువగా వచ్చేందుకు అవకాశముంది.

* ప్రణాళికలో ఎన్‌సీఈఆర్‌టీలో అత్యధిక శాతం అడిగిన ప్రశ్నలతో కూడిన అధ్యాయాలకు ప్రాముఖ్యం ఇవ్వాలి.

* మీకు బాగా వచ్చిన అధ్యాయాలపై ఎక్కువ సమయం కేటాయించకుండా మిగిలినవీ ఎక్కువ సాధన చేసి పట్టు సాధించండి.

* కీలక పాఠ్యాంశాలు, సన్నద్ధత ప్రణాళిక ఎంసెట్‌ (మెడికల్‌, అగ్రికల్చర్‌) వారికి కూడా సరిపోతుంది.

* ఎంసెట్‌ ఫిజిక్స్‌లో సిద్ధ్దాంతపరమైన ప్రశ్నలు 10 శాతం లోపే. కానీ నీట్‌లో మాత్రం 30 శాతం వరకు ఉన్నాయి.

* రసాయన శాస్త్రంలో అకర్బన, కర్బన, భౌతిక రసాయన శాస్త్రంలో దాదాపు సమ విభజనతో (మూడు విభాగాల నుంచి 15 ప్రశ్నల చొప్పున) వస్తున్నాయి. వీటిలో భౌతిక రసాయన శాస్త్రానికి కొంత అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎంసెట్‌ లో కూడా.

* నీట్‌లో ఎంసెట్‌తో పోలిస్తే ప్రశ్నల సంఖ్య ఎక్కువ, రుణాత్మక మార్కులూ ఉన్నందున వేగం, కచ్చితత్వం పెంచుకోవాలి. ఇందుకోసం వీలైనన్ని.. అంటే రోజు మార్చి రోజు ఒక నమూనా ప్రశ్నపత్రాన్ని ఆన్‌లైన్‌లో ప్రాక్టీస్‌ చేయాలి.

* నీట్‌లో మంచి ర్యాంకు రావటమే లక్ష్యంగా విద్యార్థి పఠనం సాగితే ఎంసెట్‌లో మంచి ర్యాంకు వచ్చినట్లే.

* వీలైైతే పక్క రాష్ట్రాల్లోని విద్యార్థులు రాసే నమూనా ప్రశ్నపత్రాలను మీ స్నేహితుల ద్వారానో, అధ్యాపకుల ద్వారానో సంపాదించి వాటిని కూడా సాధన చేయటం మేలు.


జేఈఈ మెయిన్‌/అడ్వాన్స్‌డ్‌/ఎంసెట్‌

ఈ పరీక్షలకు పునశ్చరణ ఎంతో కీలకం. అందుకే కొత్త టాపిక్స్‌ చదువుతూనే పాతవాటి రివిజన్‌కు సమయం కేటాయించాలి. పునశ్చరణను రోజువారీ ప్రిపరేషన్‌లో భాగం చేసుకోవాలి. ●

* ఎక్కువ నమూనా పరీక్షలను సాధన చేయండి.

* నమూనా పరీక్షలకు సిద్ధమవుతున్నపుడు మీరు చేసిన అన్ని పొరపాట్లనూ గమనించి, వాటిని మళ్లీ సాల్వ్‌ చేయండి.

* సిలబస్‌లో మీ బలమైన, బలహీనమైన పాయింట్లను వేరు చేయండి.

* ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడానికీ, నేర్చుకోవడానికీ ప్రయత్నించండి.

* ఫ్లాష్‌ కార్డులను తయారుచేసి, వాటిని నేర్చుకుని పునశ్చరణ చేయండి. ఇప్పటివరకూ నేర్చుకున్న అన్ని సూత్రాలనూ రివైజ్‌ చేయండి.

* ప్రతి భావనకూ లేదా సూత్రానికీ ఒక కీ వర్డ్‌ కేటాయించండి. దాంతో వాటితో మీకు సులభంగా సంబంధం ఏర్పడి, తేలిగ్గా గుర్తుంచుకోవచ్ఛు

* మీరు బాగా వచ్చాయని నమ్మకంగా ఉన్న విషయాలను పునశ్చరణ చేయటం మరవొద్ధు బాగా తెలిసినవాటిని మరింత స్పష్టపరుచుకోవటం వల్ల పరీక్షలో ఎక్కువ స్కోరుకు ఆస్కారం ఉంటుంది.

* ఏ కొత్త అంశాలనూ అధ్యయనం చేయొద్ధు బాగా తెలిసినవాటినే బలోపేతం చేసుకోండి.

ఎం. ఉమాశంకర్‌


జేఈఈ-మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌, నీట్‌, ఎంసెట్‌ పరీక్షల సన్నద్ధత, పునశ్చరణ, మాక్‌ టెస్టుల సాధనకు ఉపయోగపడే 8 వారాల ప్రణాళిక.. www.eenadupratibha.net లో చూడండి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.