close

తాజా వార్తలు

Published : 17/05/2020 00:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వైరస్‌పై నారి సారించారు

కరోనా కట్టడిలో పురుషాధినేతలు పరేషాన్‌ అవుతున్నారు.
పెద్దన్నలు సైతం పెద్దగా ఏం సాధించలేకపోతున్నారు.
అదే సమయంలో.. స్త్రీమూర్తులు తమ యుక్తిని చాటుతున్నారు.
దేశాధినేతలు కాస్తా తల్లిపాత్ర పోషిస్తున్నారు.
పిల్లల మేలుకోరి కొవిడ్‌పై పోరాడుతున్నారు.
తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయ్‌ఇంగ్‌ కావొచ్చు..
న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ కావొచ్చు..
ఎందరెందరో ఇంతులు..
కరోనా అంతు తేలుస్తున్నారు!


మూడు టీలతో ముందడుగు...
- ఏంజెలా మెర్కెల్‌, జర్మనీ ఛాన్సెలర్‌

భివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పే ఐరోపా దేశాలు.. కరోనా ధాటికి విలవిల్లాడిపోతున్నాయి. ఇటలీ, స్పెయిన్‌ వంటి దేశాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. జర్మనీ మాత్రం కరోనాను సమర్థంగా కట్టడి చేయగలిగింది. ఈ ప్రయత్నంలో జర్మనీ ఛాన్సెలర్‌ ఏంజెలా మెర్కెల్‌ పాత్ర కీలకం. దాదాపు ఎనిమిదిన్నర కోట్ల జనాభా. వీలైనంతమందికి పరీక్షలు నిర్వహిస్తేనే.. ఫలితం ఉంటుందనుకున్నారామె! ట్రేస్‌, టెస్ట్‌, ట్రీట్‌ విధానాన్ని ఎంచుకున్నారు. లక్షల్లో టెస్టింగ్‌ కిట్లను సిద్ధం చేశారు. ఇళ్ల వద్దే పరీక్షలు నిర్వహించారు. అదీ ఉచితంగా! పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పుడు మాత్రమే వారిని ఆసుపత్రులకు తరలించారు. వారానికి సుమారు మూడు నుంచి ఐదు లక్షల పరీక్షలు నిర్వహిస్తూ సమర్థంగా కట్టడి చేసే వ్యూహాన్ని పన్నారామె. ఫలితంగా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగలిగారు. మరణాలను తగ్గించగలిగారు.


ప్రపంచ దేశాలకు భరోసా...
- ఫ్రెడరిక్‌ సేన్‌, డెన్మార్క్‌ ప్రధాని

ర్మనీ సరిహద్దులో ఉంటుంది డెన్మార్క్‌. ఈ దేశ ప్రధాని ఫ్రెడరిక్‌ సేన్‌. ఆ పదవిని అలంకరించిన వారిలో పిన్నవయస్కురాలు. వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో దిట్టని పేరు. కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేయరు. కరోనా విస్తరిస్తున్న తీరును గమనించి వ్యూహాత్మక పోరుకు సిద్ధమయ్యారామె. మార్చి 13న లాక్‌డౌన్‌ విధించారు. సరిహద్దుల్ని మూసేశారు. భౌతిక దూరం పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పించారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించారు. వైరస్‌ వ్యాప్తిని గణనీయంగా తగ్గించగలిగారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి.. క్రమంగా ఆంక్షలు సడలిస్తున్నారు. ప్రతి రోజూ పదివేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తూ.. బాధితులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు. తమ ప్రజలు పాటించిన వ్యక్తిగత క్రమశిక్షణ కరోనాపై డెన్మార్క్‌ పైచేయి సాధించేలా చేసిందంటారు ఫ్రెడరిక్‌ సేన్‌. ఇప్పుడా దేశంలో లాక్‌డౌన్‌ ఎత్తేశారు. తొలివిడతగా పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు తెరిచి ప్రపంచదేశాలకు భరోసానిచ్చారు.


చిన్నారుల భవిష్యత్తు కోసం
- సన్నామారిన్‌, ఫిన్‌లాండ్‌ ప్రధాని

ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉండే దేశాల్లో ఫిన్‌లాండ్‌ది మొదటిస్థానం. మార్చి పదహారు నాటికి మూడొందల కేసులు నమోదవ్వడం కలకలం రేపిందక్కడ. వెంటనే దేశంలో ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించారు సన్నామారిన్‌. పిన్న వయసులో ఫిన్‌లాండ్‌ ప్రభుత్వ సారథ్య బాధ్యతలు చేపట్టారామె. దేశాధినేతగానే కాకుండా.. తల్లిగా ముందుచూపుతో వ్యవహరించారు. ఇతర దేశాలతో రాకపోకల్ని నిషేధించారు. అన్నిరకాల ప్రయాణాల్ని నిలిపేశారు. లాక్‌డౌన్‌ని కఠినంగా అమలు చేశారు. చిన్నారుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని వర్చువల్‌ క్లాసులను కొనసాగించారు. వయసు మళ్లిన వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. వైద్య వ్యవస్థను బలోపేతం చేసి కరోనా కట్టడిలో ముందంజలో ఉన్నారు.


నెలన్నరలో... రెండు లక్షల పరీక్షలు...
- ఎర్నా సోల్బర్గ్‌, నార్వే ప్రధాని

సంక్షోభ సమయంలో నార్వే ప్రధాని ఎర్నా సోల్బర్గ్‌ స్థిరమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించగలిగారు. అందుకే అక్కడ కరోనా కల్లోలం తగ్గింది. ఫిబ్రవరి 26న నార్వేలో మొదటికేసు నమోదైంది. ఆ తరువాత వచ్చిన కేసుల్లో చాలావరకూ ఆస్ట్రియా, ఇటలీ దేశాల నుంచి తిరిగి వచ్చిన పర్యటకులవే కావడంతో... భౌతికదూరం ఆంక్షలు, ప్రయాణ ఆంక్షలు విధించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌ చేశారు. మార్చి 12 నుంచి లాక్‌డౌన్‌ అమలు చేశారు. నెలన్నర రోజుల్లో రెండు లక్షల పరీక్షలు నిర్వహించారు. బాధితులు త్వరగా కోలుకుంటున్నారు. మరణాల రేటూ తక్కువే!


యాప్‌తో జల్లెడపట్టి...
- కత్రిన్‌ జాకబ్స్‌డాట్టిర్‌, ఐస్‌లాండ్‌ ప్రధాని

స్‌లాండ్‌ జనాభా మూడున్నర లక్షలకు పైమాటే! దేశ జనాభాలో 12 శాతం మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకి వేలమంది పిట్టల్లా రాలిపోతుంటే.. ఇక్కడ మరణాల సంఖ్య కేవలం పదే! ఈ విజయం వెనక ఆ దేశ ప్రధాని 44 ఏళ్ల కత్రిన్‌ జాకబ్స్‌ డాట్టిర్‌ పాత్ర కీలకం. కొవిడ్‌ దేశ సరిహద్దులకు చేరేలోపే ఆరోగ్యశాఖాధికారులు, అంటువ్యాధి నిపుణులు, శాస్త్రవేత్తలతో సమీక్షలు నిర్వహించారామె! వారు చెప్పిన సూచనలు పక్కాగా అమలయ్యేలా చూశారు. ట్రేసింగ్‌ యాప్‌తో కరోనా సోకిన వ్యక్తిని తక్షణం గుర్తిస్తూ.. వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేశారు. ఐస్‌లాండ్‌ ఊపిరి పీల్చుకుంది. ఈనెల 4న అక్కడ లాక్‌డౌన్‌ సడలించారు. పాఠశాలలు, కార్యాలయాలు తెరుచుకున్నాయి. రోజుకు రెండుగంటల చొప్పున ప్రతితరగతి గదిలో 20 మంది మాత్రమే విద్యార్థులుండేలా నిబంధనతో పాఠశాలలు, కళాశాలలు పనిచేస్తున్నాయి. కరోనాను సమూలంగా అరికట్టి.. పర్యటక, వ్యాపారరంగాలు పునరుద్ధరించడానికి సిద్ధమవుతున్నామంటున్నారు కత్రిన్‌.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.