close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 20/05/2020 00:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కళకళలాడే కోర్సులు!

ఇంటర్‌ తర్వాత - ఫైన్‌ ఆర్ట్స్‌

కుంచె పడితే కనువిందు చేసే చిత్తరువు.. కెమెరా క్లిక్‌మంటే మెరుపులాంటి ఛాయాచిత్రం.. రాతిని చెక్కితే మనోహరమైన శిల్పం.. దుస్తులపై ఆకర్షణీయమైన డిజైన్‌.. ఇవన్నీ లలిత కళా నైపుణ్యాలే. ఈ కళలతో మనసులను రంజింపజేయడమే కాకుండా మంచి ఆదాయాన్నీ పొందవచ్ఛు వివిధ యూనివర్సిటీలు, సంస్థలూ అందించే శిక్షణ పూర్తిచేసి ఫైన్‌ ఆర్ట్స్‌లో పట్టాలు సాధిస్తే ఉద్యోగాల్లోనూ చేరవచ్ఛు ఆసక్తి, అభిరుచి మేరకు ఇంటర్మీడియట్‌ అర్హతతో ఈ కోర్సుల్లోకి ప్రవేశించవచ్చు.

ఊహలు, ఆలోచనలకు ఆకర్షణీయమైన రూపాన్ని ఇవ్వడమే ఫైన్‌ ఆర్ట్స్‌. ఇంటర్‌లో ఏ గ్రూప్‌ చదివిన వారైనా ఈ కోర్సుల్లో చేరవచ్ఛు సాధారణ డిగ్రీ కోర్సుల వ్యవధి మూడేళ్లు. కానీ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ) నాలుగేళ్లు చదవాలి. కొన్ని సంస్థలు బీఏ ఫైన్‌ ఆర్ట్స్‌ పేరుతో మూడేళ్ల కోర్సులనూ అందిస్తున్నాయి. యూనివర్సిటీ క్యాంపస్‌లోనే ఈ విభాగంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు చదువుకోవచ్ఛు వివిధ యూనివర్సిటీల్లో ప్రత్యేక విభాగంగా ఫైన్‌ఆర్ట్స్‌ ఉంది. వాటిలో యూజీ, పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీలను అందిస్తున్నారు. పరీక్ష నిర్వహించి అందులో చూపిన ప్రతిభతో కోర్సులోకి తీసుకుంటున్నారు. కొన్ని సంస్థలు ఇంటర్‌ మార్కుల మెరిట్‌తో అవకాశం కల్పిస్తున్నాయి. యూజీ కోర్సులు పూర్తిచేసుకున్నవారు ఉపాధి పొందే వీలుంది. ఆసక్తి ఉంటే పీజీలో చేరవచ్ఛు ఉన్నత విద్య ద్వారా సంబంధిత విభాగాల్లో స్పెషలైజేషన్‌ కోర్సులూ ఎంచుకోవచ్ఛు

రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాల్లోనే కాకుండా జాతీయస్థాయి సంస్థల్లోనూ ఫైన్‌ ఆర్ట్స్‌ చదువుకునే అవకాశం ఉంది. కొన్ని చోట్ల సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సులూ ఉన్నాయి. కానీ ఎక్కువ అవకాశాలు బీఎఫ్‌ఏ చేసిన వారికి లభిస్తున్నాయి. ఈ చదువుల్లో స్వయం ఉపాధి, ఫ్రీలాన్సింగ్‌ ఎక్కువ. మనం చూస్తున్న రకరకాల విగ్రహాలు, ఆకృతులు స్కల్ప్‌చర్‌ తెలిసినవారు రూపొందించినవే. వీటిని లోహం, మట్టి, ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, చెక్క మొదలైనవాటితో తయారుచేస్తారు. వివిధ కళాకృతులు, చిత్రాలు అప్లయిడ్‌ ఆర్ట్స్‌, పెయింటింగ్‌ నిపుణులు రూపొందించినవే..

యూజీ స్థాయిలో బీఎఫ్‌ఏ

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ)లో అప్లయిడ్‌ ఆర్ట్స్‌, పెయింటింగ్‌, స్కల్ప్‌చర్‌, ఫొటోగ్రఫీ తదితర కోర్సులను తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి. ఈ చదువుల కోసమే ప్రత్యేకంగా హైదరాబాద్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీని నెలకొల్పారు. కొన్ని సంస్థలు పోటరీ అండ్‌ సిరామిక్స్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌ కోర్సులను ఫైన్‌ ఆర్ట్స్‌లో భాగంగా యూజీ స్థాయిలో అందిస్తున్నాయి. వీటికోసం బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, విశ్వభారతి, రవీంద్ర భారతి యూనివర్సిటీలు ప్రసిద్ధి పొందాయి. సంస్థలను బట్టి ఫైన్‌ఆర్ట్స్‌ లేదా విజువల్‌ ఆర్ట్స్‌ పేరుతో వీటిని నిర్వహిస్తున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానాలు (తితిదే) ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రెడిషినల్‌ స్కల్ప్‌చర్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ సంస్థ ప్రత్యేకంగా దేవతామూర్తుల విగ్రహాలు, బొమ్మల తయారీలో శిక్షణ ఇస్తోంది. ఇక్కడ శిక్షణ పొందినవారు దేవాలయాలకు కావాల్సిన ఆకృతులు సిద్ధం చేస్తారు. పదో తరగతి విద్యార్హతతో స్టోన్‌, వుడ్‌, సిమెంట్‌, మెటల్‌ స్కల్ప్‌చర్‌ కోర్సులను డిప్లొమాలో భాగంగా అందిస్తున్నారు. పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశాలుంటాయి. చదువు, వసతి, భోజనం ఉచితం. కోర్సు పూర్తయిన తర్వాత తితిదే నుంచి ఉపాధినీ పొందవచ్ఛు తెలుగు విశ్వవిద్యాలయం అందించే బీఎఫ్‌ఏ కోర్సులో చేరవచ్ఛు

ఉన్నత విద్య: బీఎఫ్‌ఏ అనంతరం రెండేళ్ల వ్యవధితో ఎంఎఫ్‌ఏ కోర్సుల్లో చేరవచ్ఛు ఫైన్‌ ఆర్ట్స్‌, విజువల్‌ ఆర్ట్స్‌, పెయింటింగ్‌, ప్రింట్‌ మేకింగ్‌, స్కల్ప్‌చర్‌, ఆర్ట్‌ హిస్టరీ అండ్‌ విజువల్‌ స్టడీస్‌, అప్లయిడ్‌ ఆర్ట్స్‌, ప్లాస్టిక్‌ ఆర్ట్స్‌, పోటరీ అండ్‌ సిరామిక్స్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌ తదితర కోర్సులను పీజీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఫైన్‌ ఆర్ట్స్‌లో యూజీ కోర్సులు అందిస్తున్న సంస్థలన్నీ దాదాపు పీజీ, పీహెచ్‌డీ కోర్సులను నడుపుతున్నాయి. కొన్ని సంస్థల్లో యూజీ లేకపోయినా పీజీలో ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సులు ఉన్నాయి. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో కోర్సులు నిర్వహిస్తోంది. ఎంఎఫ్‌ఎ అనంతరం ఎంఫిల్‌ లేదా నేరుగా పీహెచ్‌డీ కోర్సులు చేయవచ్ఛు బోధన రంగంలో స్థిరపడాలనుకునే వారికి పీహెచ్‌డీ ఉపయోగపడుతుంది.

ఉద్యోగావకాశాలు

స్వయం ఉపాధికీి, ఏదైనా సంస్థలో పని చేసుకోవడానికీ ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సులు ఉపయోగపడతాయి. విభాగాన్ని బట్టి సాఫ్ట్‌వేర్‌, బహుళ జాతి సంస్థలు అవకాశాలను కల్పిస్తున్నాయి. ఆర్ట్‌ స్టూడియోలు, అడ్వర్టైజింగ్‌ కంపెనీలు, గ్రాఫిక్‌, ప్రింటింగ్‌, పబ్లిషింగ్‌, ఫ్యాషన్‌ సంస్థలు, ఎలక్ట్రానిక్‌ ఇండస్ట్రీ, టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ, ఫిల్మ్‌ అండ్‌ థియేటర్‌, మల్టీ మీడియా, యానిమేషన్‌ తదితర సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. ఆర్ట్‌ గ్యాలరీల్లోకి వీరిని నియమించుకుంటారు. టెక్స్‌టైల్‌ కోర్సులు చదివినవారు వస్త్ర పరిశ్రమలో సేవలను అందించవచ్ఛు ఫొటోగ్రఫీ చేసినవారికి అన్ని చోట్లా అవకాశాలుంటాయి. చాలామంది ఫ్రీలాన్సింగ్‌, స్వయం ఉపాధి (వర్క్‌ షాపు నడపడం) ద్వారా పెద్దమొత్తంలో సంపాదిస్తున్నారు. ఎండోమెంట్‌, ఆర్కియలాజికల్‌ విభాగాల్లో వీరికి ఉద్యోగాలు లభిస్తాయి.


సంస్థలవారీ కోర్సుల వివరాలు

జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌: బీఎఫ్‌ఏలో పెయింటింగ్‌, అప్లయిడ్‌ ఆర్ట్స్‌, స్కల్ప్‌చర్‌, ఫొటోగ్రఫీ, యానిమేషన్‌ కోర్సులను అందిస్తోంది.

ఉస్మానియా యూనివర్సిటీ: బీఎఫ్‌ఏ ఫొటోగ్రఫీని మూడేళ్ల వ్యవధితో అందిస్తోంది. పెయింటింగ్‌, అప్లయిడ్‌ ఆర్ట్స్‌ కోర్సులను బీఎఫ్‌ఏలో భాగంగా అయిదేళ్ల వ్యవధితో పదోతరగతి అర్హతతో నడుపుతున్నారు.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం: స్కల్ప్‌చర్‌, పెయింటింగ్‌, ప్రింట్‌ మేకింగ్‌.

ఆంధ్రా యూనివర్సిటీ: నాలుగేళ్ల వ్యవధితో పెయింటింగ్‌, స్కల్ప్‌చర్‌.

కేఎల్‌ యూనివర్సిటీ: పెయింటింగ్‌, స్కల్ప్‌చర్‌, యానిమేషన్‌ అండ్‌ వీఎఫ్‌ఎక్స్‌, డిజిటల్‌ ఫిల్మ్‌ మేకింగ్‌.

రవీంద్ర భారతీ యూనివర్సిటీ: ఫైన్‌ ఆర్ట్స్‌లో భాగంగా రవీంద్ర సంగీత్‌, వోకల్‌ మ్యూజిక్‌, డ్యాన్స్‌, డ్రామా, ఇన్‌స్ట్రుమెంటల్‌ మ్యూజిక్‌ కోర్సులను బీఏలో మూడేళ్ల వ్యవధితో అందిస్తోంది. ఇదే సంస్థ విజువల్‌ ఆర్ట్స్‌లో నాలుగేళ్ల వ్యవధితో పెయింటింగ్‌, స్కల్ప్‌చర్‌, గ్రాఫిక్స్‌ (ప్రింట్‌ మేకింగ్‌), అప్లయిడ్‌ ఆర్ట్‌, హిస్టరీ ఆఫ్‌ ఆర్ట్‌ కోర్సుల్లో బీఎఫ్‌ఏను నిర్వహిస్తోంది.

బెనారస్‌ హిందూ యూనివర్సిటీ: పెయింటింగ్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌, ప్లాస్టిక్‌ ఆర్ట్స్‌, పోటరీ అండ్‌ సిరామిక్స్‌, అప్లయిడ్‌ ఆర్ట్స్‌ కోర్సులను నాలుగేళ్ల వ్యవధితో యూజీలో అందిస్తోంది. ఇవే కోర్సులు పీజీలోనూ ఉన్నాయి.

విశ్వభారతీ యూనివర్సిటీ: ఈ సంస్థ అయిదేళ్ల వ్యవధితో పదో తరగతి విద్యార్హతతో బీఎఫ్‌ఏలో పెయింటింగ్‌, మ్యూరల్‌, స్కల్ప్‌చర్‌, గ్రాఫిక్‌ ఆర్ట్‌, డిజైన్‌ (టెక్స్‌టైల్‌/ సిరామిక్‌) కోర్సులను అందిస్తోంది. ఇవే కోర్సులను సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా డిగ్రీ పూర్తిచేసుకున్నవారి కోసం రెండేళ్ల వ్యవధితో అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా పేరుతో నిర్వహిస్తోంది. ఇంటర్‌ విద్యార్హతతో బీఎఫ్‌ఏలో భాగంగా హిస్టరీ ఆఫ్‌ ఆర్ట్‌ కోర్సు చదువుకోవచ్ఛు

ఎంఐటీ ఏడీటీ యూనివర్సిటీ, పుణె: ఈ సంస్థ బీఎఫ్‌ఏలో అప్లయిడ్‌ ఆర్ట్‌, పెయింటింగ్‌, స్కల్ప్‌చర్‌, సిరామిక్స్‌, మెటల్‌ వర్క్స్‌ కోర్సులను నిర్వహిస్తోంది. వీటిలో పెయింటింగ్‌ మూడేళ్లు, మిగిలినవి నాలుగేళ్ల వ్యవధి కోర్సులు. వాటినే పీజీలోనూ చదువుకోవచ్ఛు

జామియా మిల్లియా ఇస్లామియా: ఈ కేంద్రీయ విద్యా సంస్థ అప్లయిడ్‌ ఆర్ట్‌, ఆర్ట్‌ ఎడ్యుకేషన్‌, పెయింటింగ్‌, స్కల్ప్‌చర్‌ కోర్సులను యూజీ, పీజీ స్థాయుల్లో అందిస్తోంది.

జేజే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఆర్ట్స్‌: ఇక్కడ నాలుగేళ్ల అప్లయిడ్‌ ఆర్ట్స్‌ కోర్సు అందుబాటులో ఉంది.

గోవా కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్‌: అప్లయిడ్‌ ఆర్ట్స్‌, పెయింటింగ్‌ కోర్సులు ఉన్నాయి.

లక్నో, అలహాబాద్‌, పట్నా యూనివర్సిటీలు, సావిత్రీ భాయి ఫూలే పుణె యూనివర్సిటీ ఫైన్‌ ఆర్ట్స్‌ డిగ్రీలను అందిస్తున్నాయి.


 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.