close

తాజా వార్తలు

Updated : 20/05/2020 11:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ 11 నెలల చిన్నారే.. ఇప్పుడు రాక్‌స్టార్‌ హీరో..!

చైల్డ్‌ ఆర్టిస్ట్‌ టు ప్రొడ్యూసర్‌.. మంచు మనోజ్‌ లైఫ్‌ స్టైల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: 11 నెలలకే వెండితెరపై సందడి చేసి.. బాలనటుడిగా మెప్పించిన హీరో మంచు మనోజ్‌. డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు రెండో కుమారుడిగా వెండితెరకు పరిచయమై హీరోగా పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమానే ప్రపంచంగా బతికే ఆయనలో కేవలం నటుడు మాత్రమే కాకుండా పాటల రచయిత కూడా ఉన్నాడు. ఇటీవల నిర్మాతగా మారి ఎంఎంఆర్ట్స్‌ పేరుతో ప్రొడక్షన్‌ హౌస్‌ను ప్రారంభించి.. నూతన టాలెంట్‌కు ఆహ్వానం పలుకుతున్నాడు. బుధవారం మనోజ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు..

11 నెలలకే వెండితెరపై మెరిసి..

నందమూరి తారకరామారావు కథానాయకుడిగా మోహన్‌బాబు ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘మేజర్‌ చంద్రకాంత్‌’. 1993లో విడుదలైన ఈ సినిమాతోనే మనోజ్‌ బాలనటుడిగా వెండితెరపై సందడి చేశారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ అంతకుముందే ఆయన ఓ సినిమాలో కనిపించాడు. మోహన్‌బాబు హీరోగా జయసుధ, రాధిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘గృహలక్ష్మి’. 1984లో విడుదలైన ఈ సినిమాలో మనోజ్‌ చిన్నపిల్లాడిగా కనిపించాడు. అప్పుడు మనోజ్‌ వయసు 11 నెలలు. ‘మేజర్‌ చంద్రకాంత్‌’ తర్వాత ‘పుణ్యభూమి నాదేశం’ చిత్రంతోపాటు మరికొన్ని సినిమాల్లో బాలనటుడిగా రాణించాడు.

యూఎస్‌లో వర్క్‌ చేసి హీరోగా మారి..

బాలనటుడిగా పలు సినిమాల్లో కనిపించిన మనోజ్‌ పైచదువుల నిమిత్తం యూఎస్‌కు వెళ్లాడు. తన కాళ్లపై తాను నిలబడాలనే ఉద్దేశంలో యూఎస్‌లోని పలు స్టోర్స్‌లో వర్క్‌ చేసి డబ్బు సంపాదించాడు. అలా చదువులు పూర్తి చేసుకుని ఇండియాకి వచ్చిన మనోజ్‌ సినిమాపై ఉన్న ఆసక్తితో నటనలో శిక్షణ తీసుకున్నాడు. 2004లో విడుదలైన ‘దొంగా దొంగది’తో హీరోగా తెరంగేట్రం చేశాడు. సదా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సుబ్రహ్మణ్యం శివ దర్శకత్వం వహించారు. మొదటి సినిమాతోనే మనోజ్‌ ఎందరో ప్రశంసలు అందుకున్నాడు.

విభిన్న కథా చిత్రాలు..

సినిమా, సినిమాకీ ఓ విభిన్నమైన కథతో మనోజ్‌ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. అలా ‘దొంగా దొంగది’ తర్వాత ‘శ్రీ’, ‘రాజు బాయ్‌’, ‘నేను మీకు తెలుసా?’, ‘బిందాస్‌’, ‘వేదం’, ఝుమ్మంది నాదం’, ‘ఊ..కొడతారా ఉలిక్కిపడతారా’, ‘కరెంట్‌ తీగ’, ‘గుంటూరోడు’, ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రాల్లో నటించాడు. 2010లో విడుదలైన ‘బిందాస్‌’ చిత్రానికిగాను మొదటిసారి నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డు  అందుకున్నాడు.

హీరోనే కాదు లిరిస్టిస్‌ కూడా..

మనోజ్‌లో మంచి నటుడే కాకుండా సంగీత ప్రియుడు కూడా ఉన్నాడు.  హీరోగా నటించిన పలు సినిమాలకు మనోజ్‌ పాటలు అందించాడు. అలా వచ్చిన పాటల్లో ‘నేను మీకు తెలుసా’ చిత్రంలోని ‘ఎన్నో ఎన్నో’, ‘మిస్టర్‌ నూకయ్యా’ చిత్రంలోని ‘పిస్తా పిస్తా’, ‘పోటుగాడు’ సినిమాలోని ‘బుజ్జి పిల్లా’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గాయకుడిగానూ మెప్పించారు.

లేడీ గెటప్‌లో కనిపించి..

‘పాండవులు పాండవులు తుమ్మెద’ మనోజ్‌కు ఎంతో ప్రత్యేకమైన చిత్రమనే చెప్పాలి. ఎందుకంటే, హీరోగా మారిన తర్వాత మొదటిసారి తన తండ్రి మోహన్‌బాబు, సోదరుడు విష్ణుతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో మనోజ్‌ లేడీ గెటప్‌లో సందడి చేశారు. మోహిని పాత్రలో కనిపించి ఆకర్షించారు.

పాన్‌ ఇండియన్‌ మూవీ..

‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తర్వాత మనోజ్‌ ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉన్నారు. దాదాపు మూడేళ్ల గ్యాప్‌ తర్వాత ఎంఎంఆర్ట్స్‌ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆయన రీఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘అహం బ్రహ్మాస్మి’. పాన్‌ ఇండియన్‌ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమాలో విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

సేవ చేయడంలో ముందుంటూ..

అభిమానులకే కాకుండా ఎవరికీ ఎలాంటి సాయం చేయాలన్నా మనోజ్‌ ముందుంటారు. ఇటీవలే ఆయన ఓ చిన్నారిని దత్తత తీసుకున్నారు. చెన్నై వరదలు, హుద్‌హుద్‌ తుపాను‌ సమయంలో తనవంతు సాయం అందించారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో చాలామందికి తన కుటుంబసభ్యులతో కలిసి నిత్యావసరాలను అందించాడు. అంతేకాకుండా సోషల్‌మీడియా వేదికగా ఎవరైనా సాయం కావాలని సంప్రదిస్తే వెంటనే స్పందించి చేతనైన సాయం చేస్తాడు.

నాన్న సినిమా రీమేక్‌ చేస్తా..

తన తండ్రి మోహన్‌బాబు నటించిన చిత్రాల్లో ‘యమ్‌ ధర్మరాజు ఎంఏ’, ‘అల్లుడుగారు’ అంటే తనకి ఎంతో ఇష్టమని మనోజ్‌ చాలా సందర్భాల్లో చెప్పాడు. వీటిని రీమేక్‌ చేయడానికి ఇష్టపడుతున్నానని అన్నాడు. ఒకవేళ కనుక ‘యమ్‌ ధర్మరాజు ఎంఏ’ చిత్రాన్ని రీమేక్‌ చేయాల్సి వస్తే పూరీ జగన్నాథ్‌ దానికి సరైన దర్శకుడని మనోజ్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.