close

తాజా వార్తలు

Updated : 21/05/2020 17:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మానవత్వం చాటిన ‘నాలుగో సింహం’

ఇంటర్నెట్‌ డెస్క్‌: అసలే ఇది కరోనా కాలం.. కంటికి కనిపించని శత్రువైన ఈ వైరస్‌తో యావత్‌ ప్రపంచం గత కొన్ని నెలలుగా పోరాడుతున్న కష్ట సమయం.. దీని కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌లతో ప్రజలంతా ఎక్కడికక్కడ లాక్‌ అయిపోయారు. కోట్లాది మంది జనం ఉపాధి కోల్పోయారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కొందరు పోలీసులు వినూత్నంగా కరోనాపై అవగాహన  కల్పించగా.. మరికొందరైతే తమ దృష్టికి వచ్చిన నిస్సహాయుల కష్టాలను మానవత్వంతో అర్థంచేసుకొని వాటిని తీర్చడం ద్వారా జనంతో ‘జయహో పోలీస్‌’ అనిపించుకున్నారు. కరోనా కష్ట కాలంలో మానవత్వాన్ని పరిమళింపజేసే ఇలాంటి ఘటనల సమాహారమే ఈ కథనం.. 

ఆ పోలీస్‌ పేరే బిడ్డకు పెట్టారు..  
అనుపమ అనే మహిళ నిండు గర్భిణి. తన భర్త విక్రంసింగ్‌తో కలిసి వజీర్‌పుర పారిశ్రామికవాడలో నివాసం ఉంటోంది. లాక్‌డౌన్‌ సమయంలో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌.. ఇతర రవాణా సౌకర్యం కోసం ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో వారు అశోక్‌ విహార్‌లోని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేశారు. వెంటనే స్పందించిన కానిస్టేబుల్‌ దయావీర్‌ సింగ్‌ పోలీస్‌ వాహనంలో ఇంటికి చేరుకొని ఆమెను బారా హిందూరావు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో ఆ మహిళ పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. పోలీసులు చేసిన సాయంపై హర్షం వ్యక్తంచేసిన ఆ దంపతులు తమ బాబుకు దయావీర్‌ అని కానిస్టేబుల్‌ పేరు పెట్టుకొని కృతజ్ఞతను చాటుకున్నారు. 

కారు ఆపి.. వలస కార్మికులకు నీళ్లిచ్చి.. 
రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ వలస కార్మికులకు అండగా నిలిచి మానవత్వం చాటారు. సోమవారం ఆయన యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం రాచకొండ పర్యటనకు చౌటుప్పల్‌ మీదుగా వెళ్తున్న సమయంలో 23 మంది వలస కార్మికులు జాతీయ రహదారిపై ఎర్రని ఎండలో నడుచుకుంటూ వెళ్లటం గమనించారు. కారు ఆపి వారితో మాట్లాడగా.. ఛత్తీస్‌గఢ్‌కు వెళ్తున్నామని, తమ రాష్ట్ర సరిహద్దు వరకు చేర్చితే అక్కడి నుంచి స్వగ్రామాలకు చేరుకుంటామని తెలిపారు. కార్మికులకు అక్కడే నీళ్ల సీసాలను, బిస్కెట్లను సీపీ అందజేశారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద భోజన వసతి ఏర్పాటు చేయించి ప్రత్యేక బస్సులో తరలించాలని యాదాద్రి డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ సత్తయ్యను ఆదేశించారు. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు కార్మికులకు భోజనం పెట్టించి బస్సులో స్వస్థలాలకు పంపించారు.

శెభాష్‌.. అరవింద్‌

ఆయన పేరు అరవింద్‌ కుమార్‌. దిల్లీ పశ్చిమజిల్లాలో మోతీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్సై.  జానక్‌పురిలోని కోచింగ్ సెంటర్‌లో ఉన్న తన కుమార్తెను తీసుకొచ్చేందుకని వెళ్లారు. తన స్నేహితురాలి నిస్సహాయ స్థితి గురించి కుమార్తె చెప్పేసరికి చలించిపోయాడు. కోల్‌కతాకు చెందిన సుష్మితా షా లాక్‌డౌన్‌ కారణంగా దిల్లీలో చిక్కుకుంది. హాస్టల్‌ సైతం మూసివేయడంతో అన్నిదారులూ మూసుకుపోయాయి. దీనికి స్పందించిన కుమార్‌..  రెప్పపాటు కూడా ఆలోచించకుండా ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకొచ్చారు. తన భార్య, కుమార్తెతో కలిసి ఉండాలని, ఎలాంటి ఇబ్బందీ పడొద్దని చెప్పారు. లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఆమె ఆ రెండు గదుల ఇంట్లోనే వారితో ఉంటోంది సుష్మిత. అయితే, ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ దిల్లీ పోలీస్‌ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ విద్యార్థిని తల్లి సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టింది. దీంతో ఆ ఏఎస్సై కుటుంబం గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. దీంతో కుమార్‌ చేసిన పనిని మెచ్చుకున్న పోలీస్‌ కమిషనర్‌ ఆయనకు రూ.10వేలు రివార్డుతో సత్కరించారు.  

వేధింపుల నుంచి కూలీలకు ఉపశమనం 

లాక్‌డౌన్‌ వేళ ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న రోజువారీ కూలీలకు సైతం దిల్లీ పోలీసులు అండగా నిలిచారు. ఇంటి యజమానులు అద్దెలు చెల్లించాలని ఒత్తిడి చేస్తే జోక్యం చేసుకొని అద్దెకు ఉండేవారి ప్రయోజనాలను కాపాడారు. కరోల్‌బాగ్‌లోని ఓ ఇంటి యజమాని కూలీలను ఇబ్బందికి గురిచేయడం డీసీపీ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన ఆ ఇంటి యజమానిని కలిసి మాట్లాడారు. వారిని ఇబ్బందులు పెట్టొద్దనీ.. ఇంటి అద్దెను వాళ్లు కట్టకపోతే పోలీసులే చెల్లిస్తారని హామీ ఇచ్చారు. దీంతో ఆ యజమాని ఒప్పుకోవడంతో ఆ కూలీలకు ఉపశమనం కలిగింది. 

పోలీస్‌ వాహనాలే అంబులెన్స్‌లాయే..

ఆదిలాబాద్‌ జిల్లాలో ఆపదలో ఉన్నవారికి పోలీసులు అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. 108 వాహనాలు అందుబాటులోకి రాకపోవడంతో స్వయంగా వాహనాలను సమకూర్చి ఆసుపత్రులకు తరలించారు. వారి ప్రాణాలను కాపాడారు. తాండూరులో ద్విచక్ర వాహనం టైరు పగిలి అదుపుతప్పి పడిపోవడంతో గాయాలైన ఇద్దరిని పోలీసు వాహనంలో బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చూశారు. మందమర్రి ప్రాణహిత కాలనీలో ఓ నిండు గర్భిణిని మందమర్రి ఎస్సై తన వాహనంలో మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. భీమారంలోని సుంకరిపల్లికి చెందిన కొట రాజేశ్వరి(34) అనే మహిళకు ఛాతిలో నొప్పిరాగా బ్లూకోట్‌ సిబ్బంది మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

గర్భిణికి సాయం.. పోలీస్‌ జీపులోనే ప్రసవం

వజీర్‌పూర్‌లో జరిగిన లాంటిదే ఈ ఘటన కూడా. రఘువీర్‌ నగర్‌లో ఓ కార్మికుడి భార్యకు రాత్రి 9గంటలకు పురిటి నొప్పులు వచ్చాయి. లాక్‌డౌన్‌తో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఇబ్బంది ఏర్పడింది. దీంతో వారు పశ్చిమ్‌ విహార్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హెడ్‌ కానిస్టేబుల్‌ ధర్మవీర్‌, కానిస్టేబుల్‌ కుల్దీప్‌ సాయం చేసేందుకు వచ్చారు. తమ వాహనంలోనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, మార్గమధ్యంలోనే ఆమె పండంటి బిడ్డను ప్రసవించింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి వైద్య సిబ్బందిని తీసుకొచ్చి ఆమె యోగక్షేమాలను చూశారు. అనంతరం ఆమెను సమీపంలోని ఓ నర్సింగ్‌ హోంకు తరలించారు. 

వృద్ధులు, ఒంటరి మహిళలకు ఆసరాగా..

దిల్లీలో పోలీసులు వయో వృద్ధులు, ఒంటరి మహిళలు, దినసరి కూలీలు, గూడులేక నిరాశ్రయులుగా ఉన్న ఎందరికో సేవలందించి అండగా నిలిచారు. నైరుతి దిల్లీలోని ఓ పీజీ వసతి గృహంలో ఏడుగురు కశ్మీరీ అమ్మాయిలు చిక్కుకున్నారు. వాళ్లు ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా.. ఎలా వెళ్లాలో అర్థంకాలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన పోలీసులు వారికి పాసులు ఇవ్వడంతో పాటు రవాణా సదుపాయం కూడా కల్పించారు. అనేక సందర్భాల్లో బీట్‌ కానిస్టేబుళ్లు వృద్ధులు, నీరసంతో బాధపడుతున్నవారికి మందులు సరఫరా చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఒంటరి మహిళలకు భద్రత, పేద కార్మికులకు ఆహారం అందిస్తూ మానవతను చాటుకున్నారు. 

ఈ పోలీస్‌ మానవత్వానికి నెటిజన్లు సెల్యూట్‌ 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారి మానవత్వంతో వ్యవహరించిన తీరు నెటిజన్లను ఫిదా చేసింది. పోలీసు తన సిబ్బందితో కలిసి భోజనం చేయడానికి కూర్చున్నారు. తింటున్న సమయంలో ఓ యాచకుడు అక్కడికి వచ్చి నిల్చున్నాడు. దీన్ని చూసిన పోలీసు అధికారి తన చేతిలో ఉన్న ఆహారం అతడికి పెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘ఈ పోలీసు అధికారి వ్యక్తిత్వం అద్భుతం. ఆకలితో ఉన్న వ్యక్తికి తన భోజనం ఇచ్చేశాడు. ఇది మెచ్చుకోదగ్గ విషయం. సెల్యూట్‌’ అని ట్వీట్‌ చేశారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం చెప్పలేదు. ‘ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల కోసం పనిచేస్తున్న పోలీసులు, వారి తీరును ప్రశంసించాలి, ఎదుటి వ్యక్తి ఆకలి తీర్చడం అన్నింటికన్నా పెద్ద సహాయం, మానవత్వానికి మరో రూపం ఈ పోలీసు..’ అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు. ఈ వీడియో చూసిన దర్శకుడు క్రిష్‌ స్పందించారు. ఆ పోలీసు అధికారికి సెల్యూట్‌ చేస్తున్నానని ట్వీట్‌ చేశారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.