close

తాజా వార్తలు

Updated : 27/05/2020 03:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సెన్సెక్స్‌ కంపెనీల ఆదాయాలు 8% తగ్గొచ్చు

బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ ఇండియా ఈక్విటీ వ్యూహకర్త అమీశ్‌ షా అంచనా

ముంబయి: బీఎస్‌ఈ సెన్సెక్స్‌ కంపెనీల ఆదాయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో (2020-21) 8 శాతం మేర తగ్గిపోయే అవకాశం ఉందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ ఇండియా ఈక్విటీ వ్యూహకర్త అమీశ్‌ షా అంచనా వేస్తున్నారు. విస్తృత ఆర్థిక ఇబ్బందులకు తోడు కరోనా వైరస్‌ సంక్షోభం వల్ల కంపెనీల ఆదాయాల్లో క్షీణత నమోదు కావొచ్చని షా అభిప్రాయపడ్డారు. సింగపూర్‌, అమెరికా వంటి ప్రపంచంలోని చాలా దేశాలు భారీ ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీల్ని ఇప్పటికే ప్రకటించాయని, భారత్‌ ఇంకా ప్రకటించాల్సి ఉందని ఆయన పేర్కొనడం గమనార్హం. ఇటీవలే భారత్‌ సుమారు రూ.21 లక్షల కోట్ల (దేశ జీడీపీలో సుమారు 10 శాతం) భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. బహుశా ఉద్దీపనకు ముందే ఈ విశ్లేషణ రూపొందించి ఉంటారని భావిస్తున్నారు.
‘ఈ ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్‌ కంపెనీల ఆదాయాలు 7-8 శాతం మేర కుంచించుకుపోవచ్చని మేము అంచనా వేస్తున్నాం. 2021-22లో మాత్రం ఆదాయాలు 17 శాతం పెరుగుతాయనుకుంటున్నాం. అయితే కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుదలతో పాటు ఉత్ప్రేరకం కావాలి’ అని షా పేర్కొన్నారు.

రక్షణాత్మక షేర్లకు గిరాకీ
‘ఒకవేళ కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు పెరుగుతుంటే, మదుపర్లు ఎక్కువగా రక్షణాత్మక రంగ షేర్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రధానంగా ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎమ్‌సీజీ, టెలికాం షేర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ప్రదర్శించవచ్చ’ని షా తెలిపారు. ప్రపంచంలోని ఇతర దేశాల స్టాక్‌ మార్కెట్లతో పోలిస్తే భారతీయ మార్కెట్లు తక్కువ స్థాయిలో ట్రేడవుతున్నాయని షా పేర్కొన్నారు.  ‘కరోనా వైరస్‌ మహమ్మారి నుంచి కోలుకొని సాధారణ జీవితానికి రావడం అంత సులభమేమీ కాదు. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి నిర్మాణాత్మక మార్పులు చాలా జరగాల్సి ఉంటుంద’ని షా అభిప్రాయపడ్డారు.
రెండో సవాలు
‘పెద్ద నోట్ల రద్దు, వస్తు-సేవల పన్ను అమలుతో వివిధ రంగాల్లోని కంపెనీలు తొలి సవాలును ఎదుర్కొన్నాయి. ఇప్పుడు కరోనా వైరస్‌ రూపంలో వాటికి మరో పెద్ద సవాలు ఎదురైంది. టోకు వ్యాపారులు, దళారులకు వినియోగించే వ్యయంతోనే సరఫరా గొలుసులను ఆన్‌లైన్‌ మాధ్యమానికి విజయవంతంగా మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింద’ని షా అభిప్రాయపడ్డారు.
భారతీయ ఆస్తుల్లో పెట్టుబడులు
‘దీర్ఘకాలానికి అధిక ప్రతిఫలాలు అందించే భారతీయ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టేందుకు చాలా వరకు సార్వభౌమ సంపద ఫండ్లు ముందుకు రావొచ్చు. ఉద్యోగాల క్రమబద్ధీకరణలో కూడా ప్రభుత్వ జోక్యం మరింతగా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఉత్పత్తిలో ప్రాథమిక అంశాలైన భూ, కార్మిక చట్టాల సంస్కరణలపై కూడా దృష్టి సారించవచ్చు. భూసేకరణ చట్టాలు మరింత ప్రభావవంతగా ఉండొచ్చు. భెల్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థల వద్ద ఉన్న భూమిని ఆయా సంస్థలకే అప్పగించే అవకాశం ఉంద’ని షా వెల్లడించారు.
పౌరులపై నిఘా పెంచొచ్చు
‘భారతీయ పౌరులపై భవిష్యత్తులో నిఘా మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇది ఈ రంగంలో ఉన్న ప్రైవేటు వ్యాపారులకు మంచి అవకాశంగా ఉండనుంది. కొవిడ్‌-19 సంక్షోభం నుంచి చైనా బయటపడటానికి ప్రధానంగా వివాదాస్పద నిఘా వ్యవస్థలను భారీగా మోహరించడం సహాయపడింద’ని షా వివరించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.