close

తాజా వార్తలు

Published : 27/05/2020 09:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ట్రంప్‌ ట్వీట్లకు తొలిసారి ‘ఫ్యాక్ట్‌ చెక్‌’ హెచ్చరిక..!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ట్వీట్లకు తొలిసారి ట్విటర్‌ ‘ఫ్యాక్ట్‌ చెక్‌’ హెచ్చరికను జారీ చేసింది. ఎన్నికల్లో ‘మెయిల్‌-ఇన్‌-బ్యాలెట్‌’ అవలంబించడం ద్వారా మోసం జరిగే అవకాశం ఉందని ట్రంప్‌ చేసిన ఆరోపణల్లో నిజమెంతో తెలుసుకోవాలని ట్విటర్‌ నెటిజన్లకు సూచించింది. ఇలా ఆయన చేసిన రెండు ట్వీట్లలో ‘ఫ్యాక్ట్‌ చెక్‌’ హెచ్చరికను ఉంచింది. ఇలా చేయడం ఇదే తొలిసారి. ఇన్నాళ్లు సాధారణ ఖాతాదారుల విషయంలో పాటించే నిబంధనల్ని అధ్యక్షుడు ట్రంప్‌నకు వర్తింపజేసేందుకు ట్విటర్‌ నిరాకరించింది. తాజాగా అందుకు భిన్నంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ట్విటర్‌ వినియోగం విషయంలో ట్రంప్‌ తన పరిమితుల్ని దాటి ప్రవర్తిస్తున్నారని ఈ హెచ్చరిక ద్వారా పరోక్షంగా తెలియజేసే ప్రయత్నం చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అసలేం జరిగిందంటే...

నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ‘మెయిల్‌-ఇన్‌-బ్యాలెట్‌’ విధానాన్ని అవలంబించాలని కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ న్యూసోమ్‌ నిర్ణయించారు. ఇందు కోసం నమోదు చేసుకున్న ఓటర్లకు ఇప్పటి నుంచే బ్యాలెట్‌ పేపర్లు పంపాలని ఆదేశించారు. దీన్ని ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. ‘మెయిల్‌-ఇన్‌-బ్యాలెల్‌’ విధానంలో మోసం జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. ‘‘మెయిల్‌-ఇన్‌-బ్యాలెట్స్‌ పెద్ద మోసం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ మెయిల్‌ బాక్స్‌లను దొంగిలించొచ్చు. బ్యాలెట్లను ఫోర్జరీ చేయొచ్చు. అక్రమంగా ముంద్రించొచ్చు. దొంగ సంతకాలూ చేయొచ్చు. కాలిఫోర్నియా గవర్నర్‌ లక్షలాది మందికి బ్యాలెట్లను పంపుతున్నారు. వారెవరు.. ఎక్కడి నుంచి వచ్చారో కూడా చూడకుండా అందిరికీ పంచేస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు ఓటు వేయనివారు.. వేస్తామని కూడా అనుకోనివారు.. ఎవరికి వేయాలో కూడా తెలియనివారందరూ ఓటు వేయబోతున్నారు. అలా జరిగితే అది రిగ్గింగే’’ అని ట్విటర్‌లో రాసుకొచ్చారు. అయితే.. మెయిల్-ఇన్‌-బ్యాలెట్‌ విధానంపై ట్రంప్‌ చేసిన ఆరోపణలు ఎంత వరకు నిజమో తెలుసుకోవాలంటూ ట్విటర్‌ ఫ్యాక్ట్‌ చెక్‌ హెచ్చరిక ద్వారా సూచించింది.

మెయిల్‌-ఇన్‌-బ్యాలెట్‌ అంటే..

పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేసే వెసులుబాటు లేనివారు ఈ విధానాన్ని ఎంచుకోవచ్చు. అయితే, దీని కోసం ముందుగానే నమోదు చేసుకోవాలి. ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద గుమిగూడడం ఏమాత్రం సురక్షితం కాదని భావిస్తున్న అనేక మంది ఈ విధానం వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ పద్ధతిలో బ్యాలెట్‌ పేపర్‌ను అత్యంత భద్రతతో ఇంటికి ఓ ఎన్వెలప్‌లో పంపుతారు. నచ్చిన అభ్యర్థి కాలమ్‌ వద్ద మార్క్‌ చేయాలి. తిరిగి అత్యంత భద్రత నడుమ, ప్రమాణాల ప్రకారం ఎన్వెలప్‌లో పెట్టాలి. దాన్ని దగ్గర్లో ఏర్పాటు చేసిన మెయిల్‌ బాక్స్‌లోగానీ, పోలింగ్‌ కేంద్రం వద్ద ఇవ్వాలి. అయితే, ఈ ప్రక్రియలో అత్యంత భద్రతా ప్రమాణాలను పాటిస్తారు. ఫోర్జరీ జరగకుండా ఆన్‌లైన్‌లో నమోదైన సంతకంతో ఎన్వెలప్‌పై చేసిన సంతకం సరిపోలడం, రెండోసారి ఓటు వేసే అవకాశం లేకుండా బార్‌కోడ్‌ విధానాన్ని అవలంబించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని