అమెరికాకు అదో వ్యసనం: చైనా
close

తాజా వార్తలు

Published : 02/06/2020 02:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెరికాకు అదో వ్యసనం: చైనా

బీజింగ్: ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా బయటకు రావడంపై సోమవారం చైనా విమర్శలు గుప్పించింది. అమెరికాకు నిష్క్రమించడం ఓ వ్యసనమైందని ఎద్దేవా చేసింది. ఇది ఆ దేశ ఏకపక్షవాదానికి నిదర్శనమని మండిపడింది. దీనిపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ మాట్లాడుతూ..‘సంస్థల నుంచి నిష్క్రమించడం, ఒప్పందాలకు స్వస్తి పలకడం అమెరికాకు వ్యసనంగా మారింది’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

చైనా చేతిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక కీలుబొమ్మలా మారిందని, కరోనా వైరస్ గురించి ప్రపంచానికి సరైన సమాచారం అందించడంలో విఫలమైందని ఆరోపిస్తూ, ఆ సంస్థను వీడుతున్నట్లు శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయంపై మరోసారి ఆలోచించాలంటూ ఐరోపా దేశాలు అమెరికాను అభ్యర్థించాయి. కాగా, కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తోన్న తరుణంలో చైనా, అమెరికా సంబంధాల్లో తీవ్ర ఒడుదొడుకులు మొదలయ్యాయి. 

ఇదిలా ఉండగా, అమెరికా ఫస్ట్‌ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్..అప్పటి నుంచి యూఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, యూఎన్‌ కల్చరల్ ఏజెన్సీ యునెస్కో నుంచి బయటకు రావడంతో పాటు,  వాతావరణ మార్పులకు సంబంధించి ప్రపంచ దేశాలు కుదుర్చుకున్న ఒప్పందం, ఇరాన్ అణు ఒప్పందానికి స్వస్తి పలికారు. యూఎన్ వలసల ఒప్పందాన్ని వ్యతిరేకించారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని