‘చోక్‌హోల్డ్‌’ విధానానికి స్వస్తి పలకాలి: ట్రంప్‌
close

తాజా వార్తలు

Published : 13/06/2020 09:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘చోక్‌హోల్డ్‌’ విధానానికి స్వస్తి పలకాలి: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికాలో నిందితులు లేదా నిరసనకారులను నియంత్రించేందుకు పోలీసులు అవలంబించే ‘చోక్‌హోల్డ్‌’ అనే కఠిన పద్ధతికి స్వస్తి పలకాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇలాంటి విధానాన్ని ఉపయోగించొద్దని సూచించారు. ఇటీవల పోలీసుల కర్కశత్వానికి బలైన ఆఫ్రో-అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌పై అక్కడి అధికారి చోక్‌హోల్డ్‌ పద్దతిలోనే మెడపై కాలు పెట్టి నేలకేసి నొక్కిన విషయం తెలిసిందే. దీంతో అతను ఊపిరాడక విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఈ విధానంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే పలు ప్రముఖ నగరాల్లో దీనిపై నిషేధం విధించారు. 2014లో మరణించిన మరో నల్లజాతీయుడు ఎరిక్‌ గార్నర్‌పై కూడా నాటి పోలీసులు చోక్‌హోల్డ్‌నే ప్రయోగించారు.

 

ఓవైపు చోక్‌హోల్డ్‌ విధానానికి స్వస్తి పలకాలన్న ట్రంప్‌ మరోవైపు.. ప్రత్యేక పరిస్థితుల్లో నిందితులతో ఒంటరిగా తలపడాల్సి వచ్చినప్పుడు పోలీసులు ఈ విధానాన్ని అవలంబించాల్సి వస్తుందంటూ వత్తాసు పలికారు. మరోవైపు ఇటీవలి భారీ నిరసనలు, పోలీసు వ్యవస్థపై విమర్శలను వైట్‌ హౌస్‌ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. త్వరలోనే పోలీసు వ్యవస్థను ప్రక్షాళించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే కార్యనిర్వాహక ఆదేశాలు కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీంట్లో చోక్‌హోల్డ్‌ నిషేధం అంశాన్ని చేరుస్తారా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని