close

తాజా వార్తలు

Updated : 14/06/2020 14:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వారి గుప్పిట్లో సియాటెల్‌..!

 ట్రంప్‌నకు కునుకు పట్టనీయని ‘చాజ్‌’..!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: సియాటెల్‌.. అమెరికాలో పెద్ద కంపెనీలకు పుట్టిల్లు.. ఇప్పుడు ఆందోళనలకు కేంద్రం. నగరంలోని కొంత భాగం ఆందోళనకారుల  గుప్పిట్లోకి వెళ్లిపోవడంతో అమెరికాకు మరో కొత్త తలనొప్పి మొదలైంది. ఇప్పటికే బ్లాక్‌లైవ్స్‌ మ్యాటర్‌ ఆందోళనలు తారా స్థాయికి చేరగా.. మరోపక్క వాషింగ్టన్‌ రాష్ట్రంలోని సియాటెల్‌ నగరంలోని కొంత భాగాన్ని ఆందోళనకారులు స్వేచ్ఛాయుత ప్రదేశంగా ప్రకటించారు. జూన్‌8 నుంచి ఇక్కడకు రాకుండా రహదారులను దిగ్బంధించారు. చాలా దిగ్గజ కంపెనీలు ఇక్కడి నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తుంటాయి. ఆందోళనకారులపై ట్రంప్‌ మరోసారి మండిపడ్డారు. ఈ దిగ్బంధాన్ని తొలగించకపోతే తానే రంగంలోకి  దిగి చర్యలు చేపడతానని గవర్నర్‌, మేయర్‌ను హెచ్చరించారు. దీనిని డెమొక్రాటిక్‌‌ పార్టీకి చెందిన మేయర్‌, గవర్నర్‌లు తిప్పికొట్టారు. ఇటువంటి ఘటనలు అమెరికా మొత్తం పాకితే పరిస్థితి మరింత చేజారే అవకాశం ఉంది.

ఏమిటీ ‘చాజ్‌’..?

జార్జిఫ్లాయిడ్‌ మృతిపై ఆందోళనలు మొదలైన తర్వాత సియాటెల్‌లో కూడా పోలీసులు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకొన్నాయి. వీటిల్లో చాలా వరకు హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలో పోలీసులు టియర్‌గ్యాస్‌ వినియోగించరంటూ నగర మేయర్‌ జెన్నా డర్కన్‌ ప్రకటించారు. ఆ తర్వాత ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసు డిపార్ట్‌మెంట్‌ బ్లాస్ట్‌ బాటిల్స్‌, పెప్పర్‌ స్ప్రేలు, ముళ్ల కంచెలు, సిమెంట్‌ బ్లాక్స్‌ను వాడటం మొదలుపెట్టింది. 7వ తేదీన ఓ వ్యక్తి కారును ఆందోళకారులపైకి దూకించారు. అదే సమయంలో డ్రైవరు కాల్పులు జరిపాడు. దీంతో ఆందోళనకారుల సంఖ్య అక్కడ పెరిగిపోతుండటంతో పోలీసులు టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మెల్లిగా ఆ ప్రదేశాన్ని ఆందోళనకారులు అడ్డంకులు పెట్టి బ్లాక్‌ చేస్తూ వచ్చారు. దీంతో పోలీసులు ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లిపోయారు. దీనికి  ‘చాజ్‌’ (కాపిటల్‌ హిల్‌ అటానమస్‌ జోన్‌‌) అనే పేరు పెట్టారు. దీనిని ఫ్రీ క్యాపిటల్‌ హిల్‌ అనికూడా పిలుస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పోలీస్‌ రహిత ప్రదేశంగా పేర్కొన్నారు. సియాటెల్‌ మేయర్‌, గవర్నర్‌లు కూడా ఆందోళనకారుల విషయంలో సానుభూతిగా ఉండటంతో పోలీసులు కూడా వారిని ఏమీ చేయలేదు. 

దీని నాయకుడు ఎవరూ..

ఈ చాజ్‌కు నాయకుడు ఎవరూ లేకపోవడం విశేషం. కానీ, ఈ ఆందోళనల వెనుక ‘యాంటిఫా’ ఉందని బలంగా నమ్ముతున్నారు. ఈ ప్రదేశంలో ప్యూజెట్‌ సౌండ్‌ జాన్‌బ్రౌన్‌ గన్‌ క్లబ్‌ సభ్యులు రైఫిల్స్‌తో పహారా కాస్తున్నారని కొన్ని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.. వారి చేతిలో ఆయుధాలు లేవని మరికొన్ని పత్రికల కథనాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో అక్కడి ఫాక్స్‌ న్యూస్‌ పత్రిక తప్పుడు కథనాలు ప్రచురిస్తోందంటూ ది సియాటెల్‌ టైమ్స్‌ పేర్కొంది. 

ఆందోళనకారుల డిమాండ్లు..

సియాటెల్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ను రద్దు చేయాలి. దానికి నిధులను పూర్తిగా ఆపివేయాలి. వీటిల్లో పోలీసులకు ఇచ్చే పింఛన్లు కూడా ఉన్నాయి. నగరంలో సాయుధ దళాలు పనిచేయడాన్ని నిషేధించాలి.  పోలీసుల దౌర్జన్యాలపై ఫెడరల్‌ ప్రభుత్వం దర్యాప్తు చేపట్టాలి. బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలి. ప్రస్తుత క్రిమినల్‌ చట్టాల్లో మార్పులు చేయాలి. 

ఆందోళనకారులు ఎక్కడి వారు..

అక్కడికి ఆందోళనకారులు ఎక్కడి నుంచి వచ్చారనే అంశంపై పోలీసులు ప్రశ్నలు సంధిస్తున్నారు. దీంతోపాటు ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకొన్న ఆందోళనకారులు స్థానిక వ్యాపారులను, ప్రజలను సొమ్ములు చెల్లించాలని బెదిరిస్తున్నారని అసిస్టెంట్‌ చీఫ్‌ ఆఫ్ పోలీస్‌ డియన్నా నొల్లెట్టే పేర్కొన్నారు. ఇది బలవంతపు వసూళ్ల కిందికి వస్తుందని.. నేరపూరితమైందని పేర్కొన్నారు. 

మీరు చేస్తారా.. నేను చేయాలా..?

అక్కడి గవర్నర్‌, మేయర్‌లు ఆందోళనకారులను ఉపేక్షించడంపై ట్రంప్‌ మండిపడ్డారు. ఆయన 11వ తేదీన ట్వీట్‌ చేస్తూ ఆందోళకారులను ‘దేశీయ ఉగ్రవాదులు’గా అభివర్ణించారు. ఈ పట్టణాన్ని వామపక్ష డెమొక్రాట్లు పాలిస్తున్నారని గవర్నర్‌ జోయి ఇన్సెలీ, మేయర్‌ జెన్నీపై మండిపడ్డారు. దేశంతో ఇలా చెలగాటం ఆడటం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. నగరాన్ని తిరిగి ఆధీనంలోకి తెచ్చుకోవాలని.. లేకపోతే ఆ పని తాను చేస్తానని చెప్పారు. అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలపై సియాటెల్‌ మేయర్‌ జెన్నీ డర్కాన్‌ తీవ్రంగా స్పందించారు. ‘దయచేసి మమ్మల్ని సురక్షితంగా ఉండనివ్వండి. మీరు బంకర్‌లోకి వెళ్లండి’ అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. ఇక వాషింగ్టన్‌ గవర్నర్‌ స్పందిస్తూ..పాలనాధక్షత లేని వ్యక్తి వాషింగ్టన్‌ వ్యవహారాలకు దూరంగా ఉండాలని ట్రంప్‌నకు చురకలంటించారు.

ట్రంప్‌ ఆందోళనకు కారణం ఇదే..

ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ కంపెనీలకు సియాటెల్‌ కీలకమైంది. వాటికి సంబంధించిన అతిముఖ్యమైన కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. బోయింగ్‌, మైక్రోసాఫ్ట్‌,  అమెజాన్‌, వాల్‌మార్ట్‌, స్టార్‌ బక్స్‌ వంటి దిగ్గజాలు ఇక్కడ ఉన్నాయి. అటువంటి చోట ఆందోళనకారులు ఒక ప్రదేశాన్ని ఆక్రమించుకొంటే.. పోలీసులు అచేతనంగా ఉండటం అగ్రరాజ్యం పరువుకు సంబంధించిన సమస్యగా మారింది. దీంతోపాటు ఆయా కార్యాలయాల దినచర్యకు ఆటంకం కలిగితే భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోయే పరిస్థితి తలెత్తుతుంది. దీంతో ఇప్పుడు ట్రంప్‌ ‘చాజ్‌’ సంగతేంటో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు.

ఇదీ చదవండి..

యాంటిఫా ఏమిటీ..ట్రంప్‌కు కోపమెందుకు?

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని