
తాజా వార్తలు
అమెరికా, ఐరోపా దేశాల్లో విక్రయానికి కొత్త ఔషధాల అభివృద్ధి
అరబిందో ఫార్మా కసరత్తు
చైనా మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి
ఈనాడు, హైదరాబాద్: అమెరికా, ఐరోపా మార్కెట్ల కోసం అరబిందో ఫార్మా పలు రకాలైన కొత్త ఔషధాలు అభివృద్ధి చేస్తోంది. ఇందులో 14 బయోసిమిలర్ ఔషధాలు కూడా ఉన్నాయి. అరబిందో ఫార్మా ఎండీ ఎన్.గోవిందరాజన్ స్టాక్‌మార్కెట్ నిపుణులు, మదుపరులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆరు రకాలైన నాసల్ స్ప్రేలు, ఎనిమిది ఇన్హేలర్లు అభివృద్ధి చేస్తున్నాం, ఇందులో రెండింటి అభివృద్ధి ప్రక్రియ పూర్తికావటంతో పాటు అనుమతి కోసం ఔషధ నియంత్రణ సంస్థల వద్ద దరఖాస్తులు దాఖలు చేస్తున్నాం- అని ఆయన వివరించారు. మొత్తం 37 ఔషధాలపై పనిచేస్తున్నట్లు, అవి వేరువేరు దశల్లో ఉన్నట్లు వెల్లడించారు. యూఎస్ మార్కెట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50- 60 కొత్త ఔషధాలు విడుదల చేయాలనే ఆలోచన ఉన్నట్లు, ఇందులో 25 ఔషధాలకు ఇప్పటికే అనుమతులు వచ్చాయిని చెప్పారు.
అరబిందో ఫార్మా ఇప్పటి వరకూ అమెరికాలో విక్రయించే నిమిత్తం యూఎస్ఎఫ్డిఏ (అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ) అనుమతి కోసం 586 ఏఎన్‌డీఏ (అబ్రీవియేటెడ్ న్యూడ్రగ్ అప్లికేషన్)
దరఖాస్తులు దాఖలు చేసింది. ఇందులో 397 ఔషధాలకు తుది అనుమతులు వచ్చాయి. తాత్కాలిక అనుమతులు 28 ఔషధాలకు లభించింది.
చైనా మార్కెట్‌పై స్పందిస్తూ, చైనాలో కొన్ని ఔషధాలను విక్రయించటానికి అనుమతుల కోసం దరఖాస్తులు దాఖలు చేస్తున్నట్లు, అంతేగాక అక్కడ తుది ఔషధాల (ఫార్ములేషన్లు) తయారీ యూనిట్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభం కావచ్చనే సంకేతాలు ఇచ్చారు. చైనాలో కేవలం ప్రభుత్వ ఔషధ టెండర్లలో పాల్గొనటానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రైవేటు ఔషధ మార్కెట్లోనూ క్రియాశీలకమైన పాత్ర పోషించాలని యోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.