close

తాజా వార్తలు

Published : 29/06/2020 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డీజిల్‌ కావాలా... పంపిస్తాం!

దేశంలో ఇప్పుడొస్తోన్న అంకురాల్లో ఎక్కువగా ఆహారం, దుస్తులూ, ఎలక్ట్రానిక్‌ పరికరాలు... ఇలాంటి వ్యక్తిగత అవసరాలు తీర్చేవే. అందుకు భిన్నంగా దేశ ప్రగతికి ఉపయోగపడే అంకురాన్ని నెలకొల్పాలనుకున్నారు అతిథి భోస్లే వాలంజ్‌. భర్తతో కలిసి ఆమె ప్రారంభించిన ‘రిపోజ్‌ ఎనర్జీ’ ప్రస్తుతం ఆ దిశగానే దూసుకుపోతోంది. కోరిన చేటుకే, అడిగిన సమయానికి డీజిల్‌ని పంపే సంస్థ ఇది.

తిథి సొంతూరు పుణె. ఆమె భర్త చేతన్‌ వాలంజ్‌.. కుటుంబానికి చెందిన పెట్రోల్‌ బంకు నిర్వహణని చూసుకునేవారు. అది పారిశ్రామిక వాడకు దగ్గర్లో ఉంది. కరెంటు పోయినప్పుడల్లా జనరేటర్ల కోసం అర్జెంటుగా డీజిల్‌ కావాలంటూ పరిశ్రమల నుంచి ఫోన్లు వచ్చేవి. ఓసారి అర్ధరాత్రి తర్వాత ఇలాగే ఫోన్లు వచ్చాయి. యాప్‌లో అతిథి ఆర్డర్‌ ఇచ్చిన పుస్తకం ఆ మర్నాడే ఇంటికి చేరింది. అప్పుడే డీజిల్‌ని కూడా ఇలా పంపించే సంస్థని ప్రారంభిద్దామంది చేతన్‌తో. అతడూ సరేనన్నాడు. ఫోరెన్సిక్స్‌, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌లో డిగ్రీ చేసిన 26ఏళ్ల అతిథికి పెట్రోల్‌ రంగం పూర్తిగా కొత్త. అందుకే మూడు నెలలపాటు రోజూ తమ పెట్రోల్‌ బంకుకి వెళ్లి అన్నీ పరిశీలించింది. నిర్మాణరంగంలో ఉన్నవారూ, హాస్పిటల్స్‌, ఇతర కంపెనీలూ, రైతులూ... పెద్ద మొత్తంలో డీజిల్‌ కావాల్సినపుడు ట్రక్కులూ, ట్రాక్టర్లమీద బ్యారెళ్లలో నింపి తీసుకెళ్లడం చూసింది. ప్రతిసారీ ఇలా డీజిల్‌ తీసుకువెళ్లడం వల్ల సమయం వృథా అవ్వడమే కాకుండా, ఇంధనం ఖర్చు కూడా. పరిష్కారంగా మొబైల్‌ పెట్రోల్‌ పంపుల్ని తేవాలనుకున్నారు అతిథి, చేతన్‌. ‘అది చట్టరీత్యా నేరం’ అని హెచ్చరించారు కొందరు. ఏదేమైనా ఈ సమస్యని పరిష్కరించాల్సిందే అనుకుని ఇంట్లోనూ ఒప్పించారు.

టాటా సాయంతో...

పుణెలోనే సొంత ఆఫీసు తెరిచి మొబైల్‌ పెట్రోల్‌ పంపు డిజైన్‌, యాప్‌ అభివృద్దిపైన దృష్టి పెట్టారు అతిథి, చేతన్‌. ఆ సమయంలో ‘ప్రభుత్వం మొబైల్‌ పెట్రోల్‌ పంపుల గురించి ఆలోచిస్తోంద’ని పెట్రోలియం శాఖ మంత్రి ప్రకటించారు. దాంతో వీరి ఉత్సాహం రెట్టింపైంది. ‘మా దగ్గర ప్రణాళిక సిద్ధంగా ఉంది. అది సరైందా, కాదా అన్న విషయంలో కాస్త సంశయం. ఆ సమయంలో అనుభవజ్ఞుల మార్గనిర్దేశం అవసరమనుకున్నార. అందుకు సరైన వ్యక్తి రతన్‌ టాటా మాత్రమేనని, అతి కష్టంమీద ఆయన్ని కలిసి ప్లాన్‌ని వివరించార. ఆయనకు ఆలోచన నచ్చి మార్గదర్శిగా ఉంటానన్నారు. ఇంధన పంపిణీలో భద్రత, నాణ్యత విషయాల్లో ఇసుమంతైనా రాజీవద్దన్నారు. మొబైల్‌ పెట్రోల్‌ పంపుల తయారీని ఔట్‌సోర్సింగ్‌ ఇవ్వకుండా సొంతంగా తయారుచేయమన్నారు. అవసరమైన తోడ్పాటు టాటా మోటార్స్‌ నుంచి అందిస్తానన్నారు’ అని తన జీవితంలో కీలకమైన రోజుని గుర్తు చేసుకుంటుంది అతిథి. తర్వాత వీరి సంస్థలో రతన్‌ పెట్టుబడి పెట్టారు కూడా.

స్మార్ట్‌ పెట్రోల్‌ బంకు...

రతన్‌ సూచనతో మొబైల్‌ పెట్రోల్‌ పంపుల తయారీకి ఏర్పాట్లు ప్రారంభించారు. 2019 ఫిబ్రవరిలో కేంద్రం మొబైల్‌ పెట్రోల్‌ పంపుల పైలట్‌ ప్రాజెక్టుకి అనుమతించింది. అందులో వీరి సంస్థ ‘రిపోజ్‌ ఎనర్జీ’ కూడా పాల్గొంది. అది విజయవంతమవ్వడంతో కమర్షియల్‌ సేవలకు పచ్చజెండా ఊపింది కేంద్రం. రిపోజ్‌ 2019 జూలై నుంచి సేవల్ని ప్రారంభించింది. వీరి మొబైల్‌ పెట్రోల్‌ పంపు... చాలా స్మార్ట్‌. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో కల్తీనీ, వృథానీ నిరోధిస్తుంది. ధర రూ.25 లక్షలు. వీటిని పెట్రోల్‌ పంపు యజమానులు కొనుక్కోవచ్ఛు యాప్‌ద్వారా వీరిని వినియోగదారులతో కలుపుతారు. కనీసం 100 లీటర్లు ఆర్డర్‌ ఇవ్వాలి. పుణె, హైదరాబాద్‌, విశాఖ సహా 130 నగరాల్లో 300లకుపైగా రిపోజ్‌ మొబైల్‌ పెట్రోల్‌ పంపులు పనిచేస్తున్నాయి. ఒక రూట్లో ఆర్డర్లని ఒకేసారి సరఫరా చేస్తూ ఇంధన వినియోగాన్నీ తగ్గిస్తారు.

‘సీఈఓగా చేతన్‌ వాహనాల తయారీ విభాగాన్ని చూస్తారు. చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌గా మార్కెటింగ్‌, సేల్స్‌, బ్రాండింగ్‌ బాధ్యతల్ని నేను నిర్వహిస్తా. జీవితాన్ని పర్సనల్‌, ప్రొఫెషనల్‌ అని విభజించను. ఆ సమయానికి ఏది ముఖ్యం అనుకుంటే ఆ పనిచేస్తాను. మా సేవల్ని గ్రామాలకూ విస్తరించడమే మా లక్ష్యం’ అంటారు అతిథి.


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని