close

తాజా వార్తలు

Published : 30/06/2020 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ట్రంప్‌ పార్టీలో విచిత్రం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎవరైనా చట్టసభ అభ్యర్థిగా ఎంపికైతే కుటుంబ సభ్యులంతా కలిసి వారిని గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఒకే కుటుంబంలో వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. ఎవరికి వారు ప్రచారం చేసుకుంటారే తప్ప.. ఎదుటివారికి ఓటు వేయకండని చెప్పరు. కానీ అమెరికాలో ఓ కూతురు.. చట్టసభ అభ్యర్థిగా ఎంపికైన తన తండ్రికి ఓటు వేయొద్దని ప్రచారం చేస్తోంది. అది కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పార్టీ అయిన రిపబ్లికన్‌లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పదవీకాలం మరికొన్ని నెలల్లో పూర్తవుతుంది. దీంతో ఎన్నికల నగారా మోగనుంది. అయితే కరోనా నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలు ఏ విధంగా జరగబోతున్నాయో తెలియదు. కానీ రాష్ట్రాల వారీగా చట్టసభలకు అభ్యర్థుల ఎంపిక.. ప్రచారాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో మిచిగాన్‌ చట్టసభకు 73వ డిస్ట్రిక్ట్‌ నుంచి రిపబ్లికన్‌ పార్టీ తరఫు అభ్యర్థిగా రాబర్ట్‌ రెగన్‌ ఎంపికయ్యారు. దీంతో ఆయన తన ప్రచారం మొదలుపెట్టారు. అయితే తన తండ్రికి ఓటు వేయొద్దంటూ ఆయన కూతురు స్టెఫనీ రెగన్‌ ట్విటర్‌ వేదికగా స్థానిక ప్రజలను అభ్యర్థిస్తోంది. ఇటీవల ట్విటర్‌లో ‘‘మీరు మిచిగాన్‌లో ఉండి 18 ఏళ్లు నిండిన వారైతే.. దేవుడి ప్రేమను కోరుకుంటే.. మా తండ్రికి ఓటు వేయకండి. ఈ విషయం అందరికి చెప్పండి’’అని ట్వీట్‌ చేసింది. దీంతో ఆ ట్వీట్‌ కాస్త వైరల్‌గా మారింది. లక్షా 90వేల మంది ట్వీట్‌ను లైక్‌ చేయగా.. 47వేలకు పైగా నెటిజన్లు రీట్వీట్‌ చేశారు. అయితే ఎందుకు తండ్రికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని మీడియా ఆమెను వివరణ కోరగా.. ఇంతకు మించి తానేమీ చెప్పలేనని, చెబితే తనకు హానీ జరగొచ్చని తెలిపింది.

స్టెఫనీ రెగన్‌ ట్వీట్‌ వైరల్‌ కావడంతో ఆమె తండ్రి రాబర్ట్‌ రెగన్‌ ఫేస్‌బుక్‌ వేదికగా స్పందించాడు. ‘‘తండ్రీకూతుళ్లమైనా.. నాకు వ్యతిరేకంగా తన అభిప్రాయాలను బహిరంగంగా చెబుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’అని పేర్కొన్నారు. తనే కాదు.. ఎవరైనా తమ అభిప్రాయాలను చెప్పవచ్చన్నారు. అలాగే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబర్ట్‌ మాట్లాడుతూ ‘‘నా కూతురు మాటలు నన్ను ఆశ్చర్యపర్చలేదు. జాత్యంహకారం, శ్వేతజాతీయుల హక్కులు, నల్లజాతీయుల జీవితాలపై మా మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయి. జాత్యంహకారం దేశమంతా ఉందని తను భావిస్తోంది. నా దృష్టిలో అలా కాదు. దేశ అధ్యక్షుడు ట్రంప్‌ నల్ల జాతీయుల కోసం చాలా చేశారు’’అని చెప్పుకొచ్చాడు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని