
తాజా వార్తలు
భారీగా పెరిగిన 'అమెజాన్' సీఈఓ సంపద!
విడాకుల సెటిల్మెంట్ అనంతరమూ అపర కుబేరుడిగా బెజోస్!
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 ప్రభావంతో కొందరి కుబేరుల సంపద కరిగిపోతుంటే, మరికొందరివి మాత్రం రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ఆస్థుల విలువ రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. కంపెనీ షేర్ల విలువ ఒక్కసారిగా 4.4శాతం పెరిగిపోవడంతో జెఫ్ బెజోస్ సంపద విలువ 171.6బిలియన్ డాలర్లకు చేరింది. అంతేకాకుండా, గత సంవత్సరం తన మాజీ భార్య విడాకుల సెటిల్మెంట్ అనంతరం కూడా బెజోస్ ఆస్తులు మునుపటికంటే పెరగటం గమనార్హం. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ల జాబితా ప్రకారం, 2018 సెప్టెంబరులో బెజోస్ 167బిలియన్ డాలర్ల సంపదతో తొలి స్థానంలో ఉండగా తాజాగా ఈ రికార్డును దాటి ముందుకెళ్లారు. భార్యతో విడాకుల అనంతరం సెటిల్మెంట్ జరిగితే బెజోస్ సంపద తగ్గుతుందని కొందరు భావించినప్పటికీ ఈ కుబేరుడి ఆస్తి మరింత పెరగడం విశేషం.
అగ్రరాజ్య ఆర్థికవ్యవస్థను అందకారంలోకి నెట్టిన ఈ కరోనా మహమ్మారి ప్రభావంతో ఇప్పటికే అమెరికాలో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ సమయంలోనూ బెజోస్ సంపద 56బిలియన్ డాలర్లు పెరిగింది. ప్రస్తుతం అమెజాన్‌లో బెజోస్ వాటా 11శాతంగా ఉంది. అయితే, ఈ మహమ్మారి విజృంభణ సమయంలో పనిచేస్తున్న తమ ఉద్యోగులకు 500డాలర్ల చొప్పున బోనస్ ఇచ్చేందుకు 50కోట్ల డాలర్లను వెచ్చిస్తామని అమెజాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి ప్రభావంతో కుదేలైన రిటైల్ మార్కెట్‌ను చేజిక్కించుకోవడానికి అమెజాన్ కృషి చేసి విజయం సాధించినట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక జెఫ్ బెజోస్ నుంచి విడిపోయిన అనంతరం అతని మాజీ భార్య మెకంజీ అమెజాన్‌లో 4శాతం వాటాను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వీటి నికర విలువ 56.9 బిలియన్ డాలర్లతో బ్లూమ్‌బర్గ్ సంపన్నుల జాబితాలో 12వ స్థానంలో ఉంది. అంతేకాకుండా ప్రపంచంలోనే రెండో సంపన్న మహిళగా నిలిచింది.
ఇదిలా ఉంటే, ఈ మహమ్మారి విజృంభణతో అపరకుబేరుల సంపద కరిగిపోవడం కనిపిస్తోంది. ఈ కష్టకాలంలో లాభాలు పొందుతున్న బిలియనీర్లలో మాత్రం ఎక్కువగా టెక్నాలజీ రంగానికి చెందినవారే కావడం విశేషం. వీరిలో ముఖ్యంగా టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్, జూమ్ వీడియో సంస్థ వ్యవస్థాపకుడు ఎరిక్ యువాన్లు ఉన్నారు. వీరిలో ఎలోన్ మస్క్ జనవరి 1నుంచి ఇప్పటివరకు దాదాపు 25బిలియన్ డాలర్లు పెరగగా, ఎరిక్ యువాన్ సంపద దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. ఇక ప్రపంచంలో తొలి 500మంది కుబేరుల ఆస్తుల విలువ ఈ సంవత్సరం ప్రారంభంలో 5.91ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, ప్రస్తుతం ఆ విలువ 5.93ట్రిలియన్ డాలర్లకు చేరింది.