‘భారత్‌కు ట్రంప్‌ మద్దతా.. నమ్మకం లేదు’
close

తాజా వార్తలు

Published : 12/07/2020 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘భారత్‌కు ట్రంప్‌ మద్దతా.. నమ్మకం లేదు’

అమెరికా మాజీ భద్రతా సలహాదారు బోల్టన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: భారత్‌-చైనా మధ్య ఘర్షణలు పెరిగితే.. అగ్ర దేశాలైన అమెరికా, రష్యా ఎవరి పక్షాన నిలుస్తాయనే అంశంపై ఇటీవల పెద్దఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో అమెరికా  మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌-చైనా మధ్య సరిహద్దు వివాదాలు మరింత ముదిరితే.. అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌కు అండగా ఉంటారన్న నమ్మకం లేదని అభిప్రాయపడ్డారు. జపాన్‌, భారత్‌ వంటి పొరుగు దేశాలతో చైనా గిల్లీకజ్జాలు పెట్టుకుంటోదని డ్రాగన్‌ దుశ్చర్యలను ఎండగట్టారు. తాజాగా వియాన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

చైనా విషయంలో భారత్‌కు ట్రంప్‌ అండగా నిలిచే విషయంలో ఆయన ఎలా వ్యవహరిస్తారని అడిగిన ప్రశ్నకు బోల్టన్‌ బదులిస్తూ..‘‘ఈ విషయంలో ఆయన (ట్రంప్‌) ఏమార్గంలో వెళతారన్న విషయం నాకు తెలియదు. నాకు తెలిసీ ఆయనకు కూడా దీనిపై అవగాహన ఉందనుకోను. చైనాతో సంబంధాల విషయంలో ఆయన వాణిజ్యం వంటి భౌగోళిక వ్యూహాత్మక అంశాల్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. నవంబరు ఎన్నికల తర్వాత ఆయన ఏం చేస్తారన్నది చెప్పలేం. చైనాతో మళ్లీ ఓ భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ భారత్‌-చైనా మధ్య వివాదం ముదిరితే ఆయన ఎటువైపు మొగ్గుచూపుతారన్నది నేను కచ్చితంగా చెప్పలేను’’ అని అభిప్రాయపడ్డారు.  

అంటే భారత్‌-చైనా మధ్య ఘర్షణలు పెరిగితే, ట్రంప్‌ భారత్‌కు మద్దతిస్తారన్న నమ్మకం మీకు లేదా? అని వ్యాఖ్యాత ప్రశ్నించగా.. బోల్టన్‌ ‘‘అవును.. అది నిజం’’ అని బదులిచ్చారు. భారత్‌-చైనా దశాబ్దాల సరిహద్దు వివాదాలపై ట్రంప్‌కు అవగాహన ఉండదని తాను భావిస్తున్నట్లు బోల్టన్‌ అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తనకు అడ్డంకిగా మారే ప్రతి అంశాన్ని పక్కన పెట్టడమే రాబోయే నాలుగు నెలల్లో ట్రంప్‌ చేయబోయే పని అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో భారత్‌-చైనా మధ్య ఎలాంటి ఘర్షణలూ తలెత్తొద్దనే ట్రంప్‌ కోరుకుంటారని బోల్టన్‌ అన్నారు.

ఓవైపు సరిహద్దుల్లో భారత్‌- చైనా తమ బలగాల్ని ఉపసంహరించుకుంటున్నాయి. మరోవైపు ఈ విషయంలో ప్రపంచ దేశాలు భారత్‌కే మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ తరుణంలో బోల్టన్‌ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని