close

తాజా వార్తలు

Updated : 05/08/2020 06:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లక్ష్యం ఐఏఎస్‌... అయ్యారు సక్సెస్‌!

ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకోలేదు వాళ్లు... కొడితే ఐఏఎస్సే కొట్టాలనుకున్నారు... పొరపాట్లను దిద్దుకుంటూ పక్కా ప్రణాళిక వేసుకున్నారు.. ప్రతిభావర్మ మూడోర్యాంకులో నిలిచి శెభాష్‌ అనిపించుకుంటే... ధాత్రిరెడ్డి తెలుగురాష్ట్రాల్లో టాపర్‌గా గెలిచి  అందరి ప్రశంసలు అందుకుంటున్నారు...

ఆలోచన ఎప్పుడు పుట్టిందన్నది కాదు... దాన్ని మనం ఎంత పక్కాగా ఆచరణలో పెట్టామన్నదే ముఖ్యం అంటారు పెద్దిటి ధాత్రిరెడ్డి సివిల్స్‌ ఫలితాల్లో తెలుగురాష్ట్రాల నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 46వ ర్యాంక్‌ సాధించిన ధాత్రి వసుంధరతో మాట్లాడారు...

అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి ఎంతైనా కష్టపడే మనస్తత్వం నాది. అందుకే మొదటిసారి యూపీఎస్సీలో 233 ర్యాంకు వచ్చినా నేను కోరుకున్నట్టుగా ఐఏఎస్‌, ఐపీఎస్‌లు వస్తాయో లేదో అన్న అనుమానంతో మరోసారి సివిల్స్‌ రాయాలని నిర్ణయించుకున్నాను. ఇంతలో నేను ఐపీఎస్‌కు ఎంపికయ్యానని తెలిసింది. నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో మొదటి దశ ట్రైనింగ్‌ కూడా పూర్తయ్యింది. అయినా సరే నేననుకున్నట్టుగా మళ్లీ సివిల్స్‌ రాయాలనే నిర్ణయానికి కట్టుబడి రెండో సారి కూడా రాశాను. ఇదిగో ఇప్పుడు 46వ ర్యాంక్‌ సాధించడంతో ఐఏఎస్‌ వస్తుందని భావిస్తున్నా. మాది చౌటుప్పల్‌ దగ్గర్లోని ఓ పల్లెటూరు. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాన్న కృష్ణారెడ్డి వ్యాపారం చేస్తారు. అమ్మ గృహిణి. అన్నయ్య గ్రీష్మన్‌ రెడ్డి ఐఐటీ ముంబయి గ్రాడ్యుయేట్‌. తన స్ఫూర్తితోనే ఖరగ్‌పూర్‌ ఐఐటీలో సీటు సాధించా. కొన్నాళ్లు అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌లో పనిచేశా. మా ఇంట్లో అమ్మ, అమ్మమ్మ చాలా ధైర్యంగా ఉంటారు. వాళ్లు ఆడపిల్లలు శక్తిమంతులుగా ఉండాలని కోరుకుంటారు. దాంతో నాకు ఏదైనా సాధించాలనే తపన ఏర్పడింది. ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఉన్నప్పుడు ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశాను. దానిపేరు ఫీడ్‌ ఇండియా. క్యాంటీన్లు, పెళ్లిళ్లు... ఇతరత్రా వేడుకల్లో మిగిలిపోయిన ఆహారాన్ని పంచేందుకు వీలుగా ఓ యాప్‌నీ తయారు చేశా. ఆ క్రమంలో మాకు నిధుల సేకరణ, ఇతరత్రా అనుమతులు విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటిని అధిగమించే క్రమంలో... ఐఏఎస్‌ అయితే ప్రజలకు సేవ చేయొచ్చన్న ఆలోచన వచ్చింది. దాంతో సివిల్స్‌కి సన్నద్ధమవ్వడం మొదలుపెట్టా. ప్రణాళికాబద్ధంగా చదివితే ఏదైనా సాధించొచ్చనే నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకమే నన్ను గెలిపించింది.


ప్రతిభావర్మ... పేరులోనే ప్రతిభ ఉంది. యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్‌ సర్వీసెస్‌-2019 పరీక్షా ఫలితాల్లో మూడో స్థానంలో నిలిచారీమె. మహిళల్లో మొదటి స్థానాన్ని దక్కించుకుని ఐఏఎస్‌కు ఎంపికయ్యారు..

మధ్యతరగతి కుటుంబం మాది. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్‌ మా సొంతూరు. నాన్న సుభాన్ష్‌ వర్మ, అమ్మ ఉషా... ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. అక్క ప్రియాంక డాక్టర్‌. అన్నయ్య ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా, తమ్ముడు చదువుతున్నాడు. కలెక్టరు కావాలనేది నా చిన్ననాటి కల. సుల్తాన్‌పుర్‌లోని రాజ్‌ సరస్వతి బాల్‌ విద్యామందిర్‌లో పదోతరగతి వరకు చదివిన తర్వాత ‘కమలా నెహ్రూ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఛైల్డ్‌ ఎడ్యుకేషన్‌’ నుంచి ఇంటర్‌ చదివాను. ఆ తరువాత ఐఐటీ-దిల్లీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశాను. ఐఐటీలో నా ప్రాజెక్టులో భాగంగా కోల్‌కతాలోని ‘సత్యేంద్రనాథ్‌ బోస్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బేసిక్‌ సైన్స్‌’లో ఇంటర్న్‌షిప్‌ చేశాను. 2014లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన తరవాత ఉద్యోగ అనుభవం కోసం ‘వొడాఫోన్‌ ఇండియా’లో చేరాను. అక్కడ వ్యాపార, సాంకేతికతకు సంబంధించిన బాధ్యతల్ని నిర్వర్తించేదాన్ని. రెండేళ్లలో డిప్యూటీ మేనేజర్‌ స్థాయికి చేరుకున్నా. నా జీవిత లక్ష్యమైన సివిల్స్‌కు సిద్ధమవ్వడానికి 2016లో ఉద్యోగానికి రాజీనామా చేసి... దిల్లీ వెళ్లి సివిల్స్‌కు శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాను. కాస్త కష్టమే అయినా ఇష్టమైన ఫిజిక్స్‌ను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకుని పరీక్షలకు సిద్ధమయ్యాను. 2018లో మొదటి ప్రయత్నంలోనే 489వ ర్యాంకు సాధించాను... ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌లో ఉద్యోగం వచ్చింది. కానీ ఏదో ఒక సర్వీసు అని కాకుండా ఐఏఎస్‌ సాధించాలనే తపన నాలో పెరిగిపోయింది. దాంతో ఉద్యోగానికి సెలవు పెట్టి మరింత పట్టుదలగా రెండోసారి పరీక్షలకు సిద్ధమయ్యాను. మొదటి ప్రయత్నంలో చేసిన పొరపాట్లు నాకు అర్థమయ్యాయి. నా బలహీనతలమీద దృష్టి పెట్టాను. మంచి ర్యాంకు వస్తుందనుకున్నా. కానీ మూడో ర్యాంకు అనగానే నన్ను నేను నమ్మలేకపోయాను.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.