close
Array ( ) 1

తాజా వార్తలు

కరుణ ధారే కనకధార

శుక్రవారం వరలక్ష్మీ వ్రతం

పసి వయసు...  మలినాలు లేని ఆ మనస్సు... ఓ పేదరాలి దీనావస్థ చూసి తల్లడిల్లింది... అమ్మా! నీవే దిక్కని ఆశ్రయించింది... నీవో అద్భుతమని కొనియాడింది. ఆ బిడ్డ ఆర్తికి అమ్మ కరిగిపోయింది... కరుణించింది... ఆ ఇంటి ముందు బంగారాన్ని వర్షించింది. ఆ బాలుడు ప్రవచించిన స్తోత్రమే భక్తులపాలిట కల్పవృక్షమైంది. మహిమను చాటిన ఆ తల్లి మహాలక్ష్మి కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైంది. అనిర్వచనీయమైన కథ ఇది.

శ్రీ వెరంబదూరు...
కేరళలోని కాలడి సమీపంలో, పూర్ణానదీ తీరంలో శ్రోత్రియులు ఎక్కువగా నివసించే చిన్న గ్రామం...!

కార్తీకమాసం, శుక్లపక్ష ద్వాదశి, మధ్యాహ్న సమయం...

ఓ ఇంటి ముందు నిల్చుని ‘భవతీ భిక్షాందేహి...’ అడిగాడు ఎనిమిదేళ్ల బాలుడు...

ఈ మాట వినిపిస్తూనే బయటకు వచ్చి తొంగిచూసిందా ఇల్లాలు...

బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతున్న ఆ పిల్లాడి ముఖం చూసి ఇంట్లోకి వెళ్లిందామె.

మధ్యాహ్నం... భోజన సమయం... అందులోనూ ద్వాదశినాడు అతిథి వచ్చాడు.

తన చీర చిరుగులు కనబడకుండా దాచుకునే ప్రయత్నం చేస్తూ..!

ఏమీ ఇవ్వలేని తన దురదృష్టానికి, పేదరికానికి దుఃఖిస్తూ.. ఇంట్లో ఉన్న ఒక ఎండిపోయిన ఉసిరికాయను తెచ్చి ఆ పిల్లవాడికి భిక్షగా సమర్పించిందా ఇల్లాలు..

తనకు భిక్ష వేసిన ఆ ఇల్లాలి ముఖం చూస్తూనే ఆమె దుఃఖం, పేదరికం ఆ పిల్లవాడికి అర్థమయ్యాయి.

అంతే... ఆ ఇంటి ముందే నిల్చుని

‘అంగం హరేః పులక భూషణ మాశ్రయంతే
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం
అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా
మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః’

‘మొగ్గలతో నిండి ఉన్న చీకటి చెట్టుకు ఆడ తుమ్మెదలు ఆభరణాలైనట్లుగా, పులకాంకురాలతో శ్రీహరి శరీరాన్ని ఆశ్రయించి ఉన్న సకల శుభాలకు స్థానమైన లక్ష్మీదేవి చల్లని చూపు శుభాలను ప్రసాదించుగాక..’ అంటూ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఆశువుగా శ్లోకాలు గానం చేశాడు. అంతే... ఆ ఇంటి ముందు బంగారు ఉసిరికల వర్షం కురిసింది!  ఆ ఇల్లాలి పేదరికం తొలగిపోయి సకల శుభాలు కలిగాయి. ఇలా జాతికి లక్ష్మీ దయను వర్షింపజేసిన ఆ బాలుడే అద్వైత సిద్ధాంతకర్తగా, జగద్గురువుగా అవతరించిన ఆది శంకరాచార్యులు. ఆయన చేసిన స్తోత్రమే కనకధారా స్తోత్రం. ఆది శంకరులు అనేక స్తోత్రాలు రచించి జాతికి అందించారు. వాటి ద్వారా జీవన మార్గాన్నీ నిర్దేశించారు. వాటిలో కనకధారా స్తోత్రం ఒకటి. మిగిలిన వాటికంటే ఇది భిన్నమైంది. జగద్గురు ప్రవచించిన వాటిలో ఇది మొదటి స్తోత్రంగా చెబుతారు.

ఇందులో మొత్తం 21 శ్లోకాలు ఉన్నాయి. ఒక్కోటి ఒక్కో సన్నివేశం. వీటిలో దేన్ని తీసుకున్నా అది ప్రత్యేకంగా అనిపిస్తుంది.

కాలాంబుదాళి లలితోరసి కైటభారేః
ధారాధరే స్ఫురతి యా తట్పిదంగనేవ
మాతాస్సమస్త జగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః’

ఇక్కడ మహావిష్ణువును కారుమబ్బులతో పోల్చారు. ఆకాశంలో మబ్బులు కమ్మిన సమయంలో వచ్చే మెరుపు ఎలా కాంతిమంతంగా కనిపిస్తుందో... అలా విష్ణు వక్ష స్థలంలో లక్ష్మీదేవి ప్రకాశిస్తుంది.

‘గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి
శాకంబరీతి శశిశేఖర వల్లభేతి
సృష్టిస్థితి ప్రళయ కేళిఘ సంస్థితాయై
తస్మై నమస్త్రిభువనైన గురోస్తరుణ్యై’

ముల్లోకాలకూ గురువైన విష్ణువు పట్టమహిషి...వాగ్దేవి, గరుడ ధ్వజసుందరి, శాకంబరి, శశిశేఖర వల్లభ అనే పేర్లతో పూజలందుకుంటున్న లక్ష్మీదేవికి నమస్కారం. మరో శ్లోకంలో వక్షస్థలాన్ని అలంకరించిన మాలలోని ఇంద్రనీలపతకం మెరుస్తున్నట్లుగా లక్ష్మీదేవి ఉందని చెబుతారు. ఇలా ఏ శ్లోకానికా శ్లోకం ప్రత్యేకంగా ఉండడంతో పాటు అమ్మరూపాన్ని, దయను ఒక దృశ్యంగా కళ్లముందు ఉంచుతుంది.

ఆ పేరు ఎందుకు?

ఆది శంకరులు ఆ పేదరాలి ఇంటి ముందు నిలబడి ఆశువుగా స్తోత్రం చేశాడు కానీ అందులో ఎక్కడా కనకధార అనే మాట వినిపించదు. అయితే అందులోని

‘దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా
మస్మిన్నకించన విహంగశిశే విషణ్ణే!
దుష్కర్మఘర్మ మపనీయ చిరాయదూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః!’

శ్రీమన్నారాయణుని దేవేరి అయిన లక్ష్మీదేవి దృష్టి అనే మేఘం దయావాయు ప్రేరితమై, నాలో చాలాకాలం నుంచి ఉన్న దుష్కర్మ తాపాలను తొలగించి, పేదవాడిని అనే విచారంలో ఉన్న చాతక పక్షి వంటి నాపై ధనవర్ష ధారను కురిసేలా చేయును గాక’ అనే శ్లోకాన్ని బట్టి కనకధార అనే పేరు ఈ స్తోత్రానికి వచ్చినట్లు చెబుతారు. ఇందులోని ‘ద్రవిణాంబుధార’ అనే పద భాగమే కనకధార అనే పేరుకు కారణంగా భావించాలి. తనను నమ్మి నిరంతరం స్తోత్రం చేసేవారిపై లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో తన దయను వర్షింపజేస్తుంది.  ఈ విషయాన్ని నిరూపించేదే కనకధారా స్తోత్రం.

అభేదం.. వారి బంధం!

శ్రీమహాలక్ష్మి సంపదల తల్లి. ధనధాన్యాలకు అధినేత. శ్రీహరి హృదయ రాణి. తన భర్తను గురించి గొప్పగా చెబితే ఏ స్త్రీ మాత్రం సంతోషించదు? జగన్మాతైనా అంతే. అలాగే కనకధారా స్తోత్రంలో కూడా విష్ణువును ప్రార్థించడం, విష్ణువుతో లక్ష్మీదేవిని అనుసంధానం చేస్తూ స్తోత్రం చేయడం కనిపిస్తుంది.

‘నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్దోదధి జన్మభూమ్మై్య
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై’

పద్మాలను పోలిన ముఖంతో వర్ధిల్లే దేవికి నమస్కారం. క్షీర సముద్రం నుంచి జన్మించిన తల్లికి నమస్కారం, అమృతం, చంద్రుడుల సోదరికి నమస్కారం. నారాయణుని వల్లభ అయిన లక్ష్మీదేవికి నమస్కారం... ఇలా ప్రతి శ్లోకంలో విష్ణువు, లక్ష్మీదేవిల అనుసంధానం కనిపిస్తుంది.

- ఐ.ఎల్‌.ఎన్‌.చంద్రశేఖరరావు

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.