close
Array ( ) 1

తాజా వార్తలు

ఎందుకూ పనికిరావన్నారు

వైద్యమంటే రోగానికి మందేసే విద్య మాత్రమే కాదు..
వైద్యమంటే ఓ విశ్వాసం..
వైద్యమంటే ఓ నియమం..
వైద్యమంటే ఓ నిశ్చయం..
వైద్యమంటే ఓ బాధ్యత..
వీటన్నింటినీ ఆణువణువునా వంటబట్టించుకున్నారాయన. అందుకే ఆయన వైద్యానికే కాదు మాటకు, మంచి తనానికి అంత పేరుంది.  నాలుగు దశాబ్దాలుగా వైద్యరంగంపై తనదైన ముద్ర వేసిన ఆయన ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ వ్యవస్థాపకులు దువ్వూరు నాగేశ్వరరెడ్డి.  ‘వీడెందుకూ పనికిరాడనుకున్న’ స్థాయి నుంచి... ఎంతో మందికి ప్రాణాలు నిలిపే స్థానానికి ఎదిగిన తీరు, బాల్యంలో చేసిన అల్లరి, యవ్వనంలో నిలుపుకొన్న ప్రేమ, పెద్దరికంతో చేసిన కూతురి పెళ్లి, వైద్యరంగంలో చేసిన సేవ... ఇలా ఎన్నో విషయాలను ఆయన ‘హాయ్‌’తో పంచుకున్నారు.

పరిశోధనలపై దృష్టి
70 ఏళ్ల తర్వాత వైద్యవృత్తి నుంచి విశ్రాంతి తీసుకుంటాను. ప్రధానంగా పరిశోధనలపై దృష్టిపెడతాను. ఇప్పటికే మా సంస్థ ద్వారా అనేక రకాల జబ్బులపై పరిశోధనలు జరుపుతున్నాం. ఒక పెద్ద జన్యు పరిశోధన విభాగాన్ని నెలకొల్పాం. మూలకణాలపైనా, మధుమేహంపైనా పరిశోధనలు కొనసాగుతున్నాయి. 40 మంది పరిశోధకులు పనిచేస్తున్నారు. మరో పదేళ్ల తర్వాత ‘ఆహారంలో విషతుల్యాలు’పై పరిశోధన సంస్థను హైదరాబాద్‌లోనే స్థాపించాలనుకుంటున్నాను. ప్రతి ఆహారంలో ఎంత మోతాదులో విషతుల్యాలున్నాయి? వాటిని ఎలా విడగొట్టాలి? తదితర అంశాలపై పరిశోధన చేస్తాం. విషతుల్యరహిత ఆహారాన్ని ఉత్పత్తి చేయడంపై దృష్టిపెట్టాలి.

 

* లేడీస్‌ ఇన్‌సైట్‌

నాకు సహనం ఎక్కువ. భార్యతో వాదనలో సర్దుకుపోవడమే మేలు. నేనొకసారి సచిన్‌ను అడిగాను.. ‘‘సచిన్‌.. మీ బాస్‌ ఎవరు?’’ అని. మా ఆవిడ అని ఠక్కున సమాధానమిచ్చారు. ఆయనే అందరికీ బాస్‌. ఆయనకు బాస్‌ భార్య. కొన్నిసార్లు వాళ్లు కూడా మన కంటే బాగా ఆలోచిస్తారు. దాన్ని ‘లేడీస్‌ ఇన్‌సైట్‌’ అంటారు. మనం ఎవరినైనా చాలా మంచోడని చేరదీస్తుంటే.. లేదు లేదు మంచోడు కాదు చూడూ అని సలహా ఇస్తారు. నిజంగానే వాళ్లు చెప్పినట్లు అవుతుంది. నేనది అనుసరిస్తుంటాను. మా ఆవిడ సహనానికి పురస్కారాలివ్వాలని సరదాగా అంటుంటాను. నాకొచ్చిన పురస్కారాల్లో ఆవిడ భాగస్వామ్యం కూడా ఉంది.

* కుటుంబ సభ్యులతో గడిపే సమయం చాలా తక్కువ. వారాంతాల్లో ఇంట్లో ఉంటాను. ఇక మా అన్నదమ్ములు, చెల్లెలు కుటుంబాలతోనూ ఎక్కువగా కలుసుకోలేను. ఇటీవలే అందరం కలుసుకున్నాం. చాలా బాగా అనిపించింది. మున్ముందు కూడా కలుసుకోవాలని అనుకున్నాం. వైద్యుల్లో ఎక్కువమందికి స్నేహితులుండరు. వారి జీవితమంతా రోగులతోనే గడుపుతారు. విశ్రాంత జీవితంలోకి వచ్చేసరికి ఒంటరిగా ఉన్నామనే భావన కలుగుతుంది.

ఆనందపడిన సంఘటన : మా పాప పుట్టిన సందర్భం.
బాధపడిందెప్పుడు? : మా అమ్మగారు చనిపోయినప్పుడు.
బలహీనత : చాలా మృదువుగా ఉంటానని మా సహచరులు అంటారు. కానీ అదే నా బలం. మృదువుగా ఉంటాను కానీ నిర్ణయాల్లో కఠినంగానే వ్యవహరిస్తాను.
* నేను హేతువాదిని, ఉదారవాదిని, మానవతావాదిని. కుల, మతాలకు పూర్తిగా వ్యతిరేకిని. దేవున్ని ప్రత్యేకంగా నమ్మను. కానీ ఒక శక్తి ఉండొచ్చనే భావిస్తాను.
రాజకీయాలపై ఆసక్తి. ఎప్పటికప్పుడూ జరిగే పరిణామాలను తెలుసుకుంటుంటాను. రోగుల ద్వారా మాకు ఎక్కువ రాజకీయ అంశాలు తెలుస్తుంటాయి.
ఓటు హక్కును ప్రతిసారి వినియోగించుకుంటాను. నిన్నటి శాసనసభ ఎన్నికల్లో నా ఓటే గల్లంతైంది. దాంతో వేయలేకపోయాను.
మా సొంతూరు చిత్తూరు జిల్లాలోని వీననత్తూరు. మాకక్కడ పొలాలేమీ లేవు. ఇప్పుడది తమిళనాడులో ఉంది.
నేను ఏ పండగలూ జరుపుకోను. ఇంట్లో మా ఆవిడ ఇష్టపడి జరుపుకొంటే నేనేమీ అభ్యంతర పెట్టను. అందరూ కలిసి ఒక్కటిగా జరుపుకొనేందుకు వేదికగా నిలవాల్సిన పండగలిప్పుడు తమ హోదాను, దర్పాన్ని ప్రదర్శించుకునేందుకు వేదికగా మారుతున్నాయి.
* యువవైద్యులకు విలువలుండాలి. రోగులపై సానుభూతి ఉండాలి. సహనం ఉండాలి. మంచి ఆచార్యుడి వద్ద శిక్షణ పొందాలి.

స్వేచ్ఛగా విమర్శించమంటాను
ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు నేను ఒక్కన్నే అస్సలు తీసుకోను. మా బోర్డు సభ్యులతో చర్చించి తీసుకుంటాను. నిర్మాణాత్మక విమర్శలు స్వేచ్ఛగా చేయమని నా ఉద్యోగులతో చెబుతుంటా. నేను ఎవరినైనా నమ్మితే వంద శాతం నమ్ముతాను. ఇక పదేపదే ఆరాతీయను. మనతో పనిచేసే వారిని నమ్మాలి. అవసరమైనప్పుడు ప్రశంసించాలి. తప్పు చేసినప్పుడు నేరుగా తిట్టకూడదు. అందరి ముందు నేను ఎప్పుడూ విమర్శించను.

* నలభై ఏళ్ల వైద్యవృత్తిని ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే.. రోజూ ఇదే రోగులను చూడ్డం.. చికిత్సలివ్వడం.. బోర్‌ కొట్టడం లేదా?
ఏ ఉద్యోగమైనా ఒకే తీరుగా చేస్తుంటే బోర్‌ కొడుతుంది. కానీ వైద్యం అలా కాదు. ఏ రోజుకారోజు రోగులు మారుతుంటారు. ఒక్కో రోగి ఒక్కో సమస్యతో వస్తుంటారు. ప్రతి రోగీ ప్రత్యేకమే. ఒక రోగికి క్యాన్సర్‌ ఉండొచ్చు. ఇంకేముంది నేను చనిపోతానని అనుకుంటారు. ఇంకొకరికి అసిడిటీ ఉండొచ్చు. దానికే చాలా బాధపడిపోతుంటారు. వైద్యులుగా మేం వారిని అర్థం చేసుకోవాలి. క్యాన్సర్‌తో చనిపోతానని అనుకుంటున్న రోగి మనస్తత్వాన్ని అర్థం చేసుకొని.. అది చికిత్సకు తగ్గిపోయే క్యాన్సర్‌ అయితే అదే విషయాన్ని వివరించి.. ధైర్యాన్నివ్వాలి. ఒకవేళ క్యాన్సర్‌తో చనిపోయే పరిస్థితే ఉంటే ఏం చెప్పాలి? ఇంకా మూణ్నెళ్లే బతుకుతావనేది రోగికి, కుటుంబ సభ్యులకు ఎలా తెలియజెప్పుతామనేది ముఖ్యం. ఇవన్నీ ఒక సవాల్‌. కాబట్టి బోర్‌ అనేది ఉండదు. బోర్‌ కొట్టిందంటే మనం అలసిపోయామని అర్థం.
* వైద్య వృత్తిలో ఎందరో ప్రముఖులను చూశారు. అలాగే సామాన్యులకూ చికిత్స అందించారు. రెండు భిన్న వర్గాల ప్రజలకు వైద్యం అందించే క్రమంలో మీకేం అనిపిస్తోంది?
వైద్యం విషయంలో అందరికీ ఒక రకమైన చికిత్సే అందిస్తాం. అయితే ప్రముఖులకు చికిత్స అందించే క్రమంలో వారి నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. సుప్రసిద్ధ చిత్రకారులూ, ప్రముఖ క్రీడాకారులు, సినిమా నటులు, రాజకీయ వేత్తలు, బడా పారిశ్రామికవేత్తలు.. వీరందరూ అంతెత్తుకు ఎదిగినా ఒదిగి ఉంటారు. వారిలో వినయం నన్ను ఆకట్టుకుంది. ఈమధ్యనే మా కొత్త ఆసుపత్రిని చూడ్డానికి ముఖేశ్‌ అంబానీ వచ్చారు. ఆయనెంత వినయంగా ఉన్నారంటే.. వాచ్‌మ్యాన్‌ను కూడా పేరు పెట్టే గౌరవంగా పిలుస్తారు. అలాగే ఎంఎఫ్‌ హుస్సేన్‌ అయితే అంతపెద్ద చిత్రకారున్ననే భావనలోనే ఉండరు. అమితాబ్‌బచ్చన్‌లోనూ ఇలాంటి వినయభావమే నన్ను ఆకట్టుకుంది. అలాగే పేదల్లో.. ఒకరోజు బిల్లింగ్‌ సెక్షన్‌లో రోగి డబ్బులు కడుతున్న విధానాన్ని సీసీ కెమెరాలో చూస్తున్నా. పైసలు పైసలుగా లెక్కగట్టి చెల్లిస్తున్నాడు. ఏమిటి ఇలా కడుతున్నాడని అతన్ని పిలిపించాను. ఆయనకు కాలేయ జబ్బు వల్ల రక్తస్రావం జరుగుతుంటే చికిత్సలో భాగంగా ఇంజెక్షన్లు ఇస్తున్నాం. నెలకోసారి చొప్పున ఏడాది పాటు చేయాల్సి ఉంటుంది. ఆ ఇంజెక్షన్‌ ఖరీదు రూ.3వేలు అవుతుంది. తను బేగంపేటలో క్షౌరవృత్తిలో ఉన్నాడు. తన నెల సంపాదనంతా తీసుకొచ్చి ఇలా పైసలుగా కట్టగట్టి ఇస్తున్నాడని అర్థమైంది. ఆ డబ్బులు కట్టిన తర్వాత తను దుకాణానికి నడుచుకుంటూ వెళ్లాలి. ఇంకా డబ్బులేం ఉండవు. అయినా తను ఎలాంటి మినహాయింపులు కోరకుండా చెల్లించి వెళ్తున్నాడు. అది తెలుసుకున్నాక ఆయనకయ్యే మొత్తం చికిత్సను పూర్తి ఉచితంగా అందించాం. మన ప్రజలు అంత అమాయకులు. మంచోళ్లు.
* ఇప్పటికీ గ్రామీణ వైద్యంలో లోటుపాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని ఎలా అధిగమించొచ్చు?
గతంతో పోల్చితే గ్రామీణ వైద్యంలో కొంత అభివృద్ధి ఉంది. అధునాతన వైద్యమనేది చాలా కష్టం. ఇంత సాంకేతిక వ్యవస్థను గ్రామీణ ప్రాంతాల్లోకి పూర్తిగా తీసుకెళ్లలేం. ప్రతి మండలంలో, నియోజకవర్గంలో క్యాన్సర్‌ ఆసుపత్రి పెట్టడమనేది సాధ్యం కాదు. పల్లెల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చాలి. శుద్ధమైన తాగునీటిని అందించాలి. తగిన పౌష్ఠికాహారాన్ని సమకూర్చాలి.
* వైద్యుడికి, రోగికి మధ్య సంబంధం దశాబ్ద కాలంలో బాగా దెబ్బతింది. ఈ విషయంలో మీ పరిశీలన?
అప్పటికీ ఇప్పటికీ రోగుల ప్రవర్తనలో మార్పు గమనించాను. గతంలో వైద్యుల వద్దకు వచ్చినప్పుడు ఓపికగా వేచిచూసేవాళ్లు. ఇప్పుడు అరగంట ఆలస్యమైతేనే అరుస్తున్నారు. గొడవకు దిగుతున్నారు. సహనం తగ్గిపోయింది. రోగికి, వైద్యునికి మధ్య వ్యాపార ధోరణి పెరిగిపోవడంతో వారి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. డబ్బు చెల్లిస్తున్నాం కనుక చూడాలనే భావన రోగుల్లోనూ ఏర్పడింది. ఇంతకుముందు వైద్యుడంటే దేవుడు అనేవారు. ఇప్పుడా విశ్వాసం సన్నగిల్లింది. దీనికి వేర్వేరు కారణాలున్నాయి.
* వైద్యులపై విశ్వాసం పెరగాలంటే..?
వైద్యులు చాలా కష్టపడాలి. కన్సల్టెన్సీ విధానం పోయి, వేతనాల విధానం అమలవ్వాలి. రూ.500 ఫీజు ఇస్తానంటే బాగా చూడడం, రూ.50 అయితే సరిగా చూడకపోవడం వంటివి పోవాలి. మన ఆరోగ్య విధానంలోనే మార్పులు రావాలి. కెనడియన్‌, యూకే తరహా వైద్యవిధానాలు అమలు కావాలి. రోగితో కూర్చొని మాట్లాడడం, రోగి సమస్యలేమిటో సావధానంగా వినడం తగ్గిపోయింది. అందులో మార్పు రావాలి. మున్ముందు మన దగ్గర ఏమి జరుగుతుందంటే.. బీమా విధానం ఎక్కువగా అందుబాటులోకి వస్తుంది. అప్పుడు డబ్బు ప్రమేయం తక్కువగా ఉంటుంది కాబట్టి వైద్యుడు, రోగి మధ్య సంబంధాలు కొంత మెరుగుపడొచ్చు.
* మీరు, మీ ఆవిడ, మీ నాన్న, మీ తాతగారూ.. అందరూ వైద్యులే.. మీ అమ్మాయిని ఇటువైపు తీసుకురాలేదే?
పాప చిన్నప్పట్నించి నా పని విధానాన్ని చూసింది. వైద్యవృత్తిని నీ అంత అంకితభావంతో నేను చేయలేను అనేది. తనది కష్టపడే మనస్తత్వమే కానీ నా తరహాలో కాదు. అందుకే ఇంజినీరింగ్‌ వైపు వెళ్లింది. వైద్యవృత్తిలో.. రోగులతో సానుభూతితో వ్యవహరించాలి.. అదే సమయంలో వారితో మానసిక బాంధవ్యాన్ని పెంచుకోకూడదు. ఒక్కసారి మానసికంగా దగ్గరైతే వారి చికిత్స విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేం.
* మీది ప్రేమ వివాహం. చాలామంది ప్రేమికులు పెద్దలు ఒప్పుకోకపోతే ఎదిరిస్తారు. మీరు ఆ కాలంలో వేచిచూసి ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఎలా?
మాది మతాంతర వివాహం. 40 ఏళ్ల కిందట చాలా అడ్డంకులుండేవి. కులమతాలు, పరువు ప్రతిష్ఠల పట్టింపులెక్కువగా ఉండేవి. వాళ్లింట్లో క్రైస్తవ సంప్రదాయం. మా ఇంట్లో హిందూ ఆచారాలు. మా ఆవిడ మద్రాస్‌ వైద్య కళాశాలలో హౌజ్‌సర్జన్‌గా చేస్తుండేది. నేను అక్కడే పీజీ చదువుతున్నాను. ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు ఒక్కటిగా ఉండడంతో మా ప్రేమ అక్కడే మొదలైంది. అయితే మా పెద్దలు ఒప్పుకొన్నాకే పెళ్లి చేసుకోవాలని ముందు అనుకున్నాం. పెద్దలు మా నిర్ణయాన్ని పరిశీలించి ఒప్పుకోవడానికి నాలుగేళ్లు పట్టింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో రిజిస్టర్డ్‌ మ్యారేజ్‌ చేసుకున్నాం. తల్లిదండ్రుల కోణంలో వారు చేసిందే సబబు. అది మనకు ఎప్పుడు తెలుస్తుందంటే మనం తల్లిదండ్రులమయ్యాకే. మన తల్లిదండ్రులు మన కోసం చాలా త్యాగాలు చేస్తారు. అది మనం మర్చిపోకూడదు. కొన్ని సినిమాల్లో తల్లిదండ్రులతో గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయినట్లుగా చూపిస్తుంటారు.. అది నాకు సరైన సందేశంగా అనిపించదు. మరీ మూర్ఖంగా ఉంటే తప్ప.. తల్లిదండ్రులు చాలావరకూ ఏదో ఒక దశలో మనం చెప్పేదానికి ఒప్పుకొంటారు. మా పాపకు తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకోమని చెప్పా. ఏ కులం మతంతో సంబంధం లేదు. నీకిష్టమైతే చాలు అని చెప్పా. తను అలాగే ఎంపిక చేసుకున్నవాడికిచ్చి పెళ్లి చేశాం.
* మీరు చిన్నప్పట్నించి తెలివైన విద్యార్థా?
లేదు. నేను మూడో తరగతిలో ఫెయిలయ్యాను. మా నాన్నగారు డాక్టర్‌ దువ్వూరు భాస్కరరెడ్డి పాథాలజీ ఆచార్యులు. మూడొందల వైద్యశాస్త్ర పరిశోధక పత్రాలు రాశారు. మా తాత(అమ్మగారి నాన్న) డాక్టర్‌ గోవిందరెడ్డి కూడా పాథాలజీ ఆచార్యులే. నోబెల్‌ బహుమతి గ్రహీత అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌కు సహచరుడు ఆయన. అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ మద్రాస్‌కు వస్తే మా తాతగారి ఇంట్లో ఉండేవారు. అలాంటి కుటుంబంలో నేను చిన్నప్పుడు సరిగ్గా చదవలేదు.
* చిన్నప్పుడు మీరు రాముడు మంచి బాలుడు మాదిరిగానా?
అస్సలు కాదు. బాగా అల్లరి చేసేవాడిని. ఒకసారి పెట్రోల్‌ ఎలా పనిచేస్తుందో చూద్దామని కార్లో అగ్గిపుల్ల వేశాను. కాలి పోయింది. ఒకసారి ఎండాకాలంలో బాగా వేడి ఎక్కువగా ఉందని చెప్పి మా తమ్మున్ని ఫ్రిడ్జ్‌లో పెట్టాను. మరోసారి కారు బ్రేక్‌ తీసేస్తే.. అది ముందుకెళ్లి పడిపోయింది. బాగా దెబ్బతింది. ఇవన్నీ చూసి మానాన్న నన్ను హాస్టల్‌లో పెట్టారు. మా నాన్న, తాతగారు కలిసి ఓ నిర్ణయానికొచ్చారు.. ‘‘వీడు దేనికి పనికి రాడు. ఒక ఆటో షెడ్డు పెట్టిస్తే మెకానిక్‌ అవుతాడని’’. అక్కడ్నించి హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో చేర్పించారు. అక్కడ కూడా 9వ తరగతి వరకూ నేను అంతే.

 

వీఐపీ సిండ్రోమ్‌ ఉండొద్దు

ఒకసారి అమెరికాలో జీర్ణకోశ వ్యాధుల చికిత్సలకు సంబంధించిన సదస్సులో పాల్గొన్నాను. ఒక రోగికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయమన్నారు. ఆ రోగికి అప్పటికే అందరూ చికిత్స ప్రయత్నించి విఫలమయ్యారు. నేను చేశాను. విజయమంతమైంది. అది సదస్సులో జరిగే చికిత్స కాబట్టి నాకు ఆ రోగి ఎవరో తెలియదు. అనంతరం నర్సులందరూ ఆ రోగి చుట్టూ గుమిగూడి ఫొటోలు దిగుతుంటే అడిగాను ఎవరీయనా అని. తర్వాత తెలిసింది.. ఆయన హాలీవుడ్‌కు చెందిన ఒక పెద్ద సినిమా నటుడని. కొన్నిసార్లు రోగి ఎవరో తెలియకపోవడమే మంచిది. అప్పుడు సాధారణ రోగి మాదిరిగానే చికిత్స అందిస్తాం. పెద్దనటుడని తెలిస్తే  ప్రభావం చికిత్సపై పడే అవకాశమూ ఉంటుంది. దీన్నే ‘వీఐపీ సిండ్రోమ్‌’ అంటుంటారు. అందుకే రోగిని చూడాల్సి వచ్చినప్పుడు సాధారణ రోగి మాదిరిగానే చూడాలని నేను నా పాఠాల్లోనూ చెబుతుంటాను. నేనూ అలాగే చేస్తాను.

ఆహారమే అసలు సమస్య

మనం తినే ఆహారంలోనే పురుగుమందుల అవశేషాలున్నాయి. మన భూసారమంతా పురుగుమందులతో నిండిపోయింది. గత్యంతరం లేక అందరం విషతుల్య ఆహారాలనే  తింటున్నాం. వేర్వేరు రూపాల్లో మన శరీరంలోకి చేరుతున్న విషతుల్యాల కారణంగా ఎక్కువగా జీర్ణకోశ వ్యాధులు ప్రబలుతున్నాయి.

* జీర్ణవ్యవస్థ కోసమే ఆసుపత్రి పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది?
అమెరికాలోని హార్వర్డ్‌లో 1989-90లో మంచి ఉద్యోగం వచ్చింది. ఆ కాలంలోనే మన కరెన్సీ విలువలో నెలకు రూ.కోటి వేతనమిస్తామన్నారు. అయితే నేను భారత్‌లోనే నా సేవలందిస్తానని చెప్పి వచ్చాను. భారత్‌ వెళ్లి ఏం చేస్తావంటూ నిరుత్సాహపర్చారు. ఇప్పుడు కొన్నేళ్లుగా అక్కడి నుంచి నా దగ్గరకు శిక్షణ కోసం పంపిస్తున్నారు. మన దగ్గర జీర్ణకోశ వ్యాధులెక్కువ. గుండెపోటు వస్తే ఠక్కున మనిషి చనిపోతారు. కానీ జీర్ణకోశ వ్యాధులొస్తే దీర్ఘకాలం బాధపడుతుంటారు. జీర్ణ వ్యవస్థ అనేది అతి ముఖ్యమైన అవయవం. దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే వచ్చే జబ్బులన్నీ దీర్ఘకాలం బాధపెట్టేవే. అందుకే దీని కోసం ప్రత్యేకంగా వైద్యసంస్థను స్థాపించాలని అనుకున్నాను. స్నేహితులు, తెలిసినవారి నుంచి ఆర్థిక సాయం పొంది ‘ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ’ని స్థాపించాను.

మా పాప అలా కాదు

సాధారణంగా అందరూ చేసేదేంటంటే.. పిల్లల్ని క్రమశిక్షణతో పెంచుతున్నామనుకుంటూ ఒత్తిడి చేస్తుంటారు. అది సరికాదు. వాళ్లేం చేయగలుగుతారో వారికి చేసే అవకాశమివ్వాలి. మా బంధువుల అబ్బాయి ఒకతను ఏమీ తినేవాడు కాదు. చాలా సన్నగా ఉండేవాడు. తినమని ఒకటే తిట్టేవాళ్ళు. ఆ అబ్బాయికి ఆటలంటే చాలా ఇష్టం. నేను ఆ అబ్బాయికి ఒకటే చెప్పాను. ‘‘బాబూ.. నువ్వు ఆటల్లో రాణించాలంటే శారీరక దారుఢ్యం పెరగాలి. అలా పెరగాలంటే బాగా తినాలి’’ అన్నాను. ఆ అబ్బాయి అనుసరించాడు. మనం సంవత్సరం పొడుగునా తిట్టినా చేయని వాడు.. వాడికి నచ్చిన విధానంలో వెళ్లాలంటే ఏం చేయాలో చెబితే ఆచరించాడు.
* అదృష్టవశాత్తు మా పాప చాలా క్రమశిక్షణతో ఉంటుంది. తన కోసం నేనెక్కువగా సమయం కేటాయించలేకపోయాను. వారాంతాల్లోనే మా పాపతో గడపడానికి సమయం దొరికేది. అందుకే నన్ను ‘వీకెండ్స్‌ ఫాదర్‌’ అనే వాళ్లు. మా ఆవిడ చర్మవ్యాధి నిపుణులు. పిల్లల కోసం తను వృత్తిని త్యాగం చేశారు.

మధ్య తరగతి విలువలు నేర్పాలి

కుటుంబ విలువల ప్రాధాన్యం పిల్లలకు నేర్పించాలి. మధ్యతరగతి కుటుంబాల్లోని విలువల ప్రాధాన్యం చాలా గొప్పది. పెద్దలను గౌరవించాలి. ఇతరులను అగౌరవపర్చకూడదు. అవసరానికి మించి ఖర్చుపెట్టకూడదు. అనవసర హోదా ప్రదర్శనలు చేయకూడదు. ఇలా కొన్ని ప్రొటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలి. ఈ విలువలతో పెంచడం చాలా ముఖ్యం. అదృష్టవశాత్తు మమ్మల్ని చిన్నప్పట్నించి అలాగే పెంచారు. మా అమ్మ చాలా మృధుస్వభావి. మంచితనానికి మా అమ్మే నిర్వచనం. మా నాన్న ముందు మేం కూర్చునేవాళ్లం కాదు. ఆ గౌరవం ఇవ్వాలి కూడా. బాల్యంలో మన అవసరం తల్లిదండ్రులకు లేదు. మనకే తల్లిదండ్రుల అవసరం. తల్లిదండ్రులు పెద్దాయ్యాక వారికి మన అవసరం ఉంటుంది. ఈ సమయంలో తల్లిదండ్రులతో సాన్నిహిత్యంగా ఉండాలి. ఈ విషయంలో మన భారతీయ సంప్రదాయం, విలువలు చాలా గొప్పవి. ఇవన్నీ తెలియజెప్పాలి.

నాలో మార్పు తెచ్చిన ఆ రెండు ఘటనలు
నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు నా సహ విద్యార్థుల్లో ఐదుగురం నిలబడి ఉన్నాం. అందులో ఒకరు స్కూల్‌ ఫస్ట్‌ వచ్చేవాడు. ఒకాయన క్రికెట్లో, మరొకరు ఈతలో, ఇంకోయాన అన్నింటిలోనూ ప్రావీణ్యం.. ఇలా అందరినీ చూపించుకుంటూ.. నా దగ్గరికొచ్చేసరికి ‘‘వీడొక పనికిరాని వాడు’’ అని అన్నారు. అప్పుడు నేను పొట్టిగా, పెద్ద కళ్లజోడుతో ఉండేవాడిని. ఆత్మన్యూనత ఎక్కువ నాలో. ఆ రోజే నా జీవితాన్ని మలుపు తిప్పింది. తర్వాత చాలా కష్టపడి పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ చూపాను.
ఆటోమెకానిక్‌ అవ్వాల్సిన వాడిని వైద్యుడిగా స్థిరపడ్డాను. గ్యాస్ట్రోఎంటరాలజిస్టుగా గుర్తింపు పొందాను. అయినా నన్ను ఎందుకు విమర్శిస్తున్నారని నాన్నను అడిగాను. ‘‘ఇవన్నీ ఎవరి కోసం చేశావు? ఈ సమాజం కోసం ఏం చేశావు? నీకు బతుకుదెరువునిస్తున్న గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం కోసం ఏం చేశావు?’’ అని ఆయనన్న మాటలు నన్ను ఆలోచింపజేశాయి. అప్పుడు నా నిర్ణయాన్ని మార్చుకొని, కన్సల్టెన్సీ విధానానికి స్వస్తి పలికి వేతన విధానంలోకి మారిపోయాను. పరిశోధనల్లోకి అడుగుపెట్టాను. ఇది 1994లో జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత పరీక్షలు, చికిత్సలు ప్రారంభించి దాదాపు కోటి మందికి చికిత్స అందించాం. మొదటి మలుపు నాలోని బద్ధకాన్ని వదిలించి పరిజ్ఞానం వైపు పరుగులు పెట్టించగా.. రెండో మలుపు నేను సమాజానికి తిరిగి ఇవ్వాలనే దిశగా నడిపించింది. మా సంస్థలో 30 శాతం మంది పేదలకు ఉచిత వైద్యం, మరో 30 శాతం మధ్యతరగతికి అందుబాటులో ధరల్లో, మిగిలిన 40 శాతం ఉన్నత వర్గాలకు చికిత్సలు అందిస్తున్నాం.

- అయితరాజు రంగారావు


 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.