close
Array ( ) 1

తాజా వార్తలు

లవ్వండి తినిపించండి!

నట్టింట్లో కారాలు.. పడకింట్లో మారాలు.. వంటింట్లో గారాలు నూరెయ్‌ బ్రో.. అన్నీ మాయం! చెయ్యి కాల్చుకునే పని లేదు. చెమట్లు చిందించాల్సిన అవసరం రాదు. చిటికెలో సిద్ధమయ్యే వంటకాలు బోలెడు. ఉప్పూకారాలు అటూఇటూ అయినా.. మమకారంతో మాయ చేసేయొచ్చు! లో కెలోరీ పదార్థాలతో కిలోల కొద్దీ లవ్‌ పంచొచ్చు. ప్రేమికుల రోజు సందర్భంగా శ్రీమతి అంటే ప్రేమ ఉన్న శ్రీవారు ఈ అవకాశాన్ని ఎలా వదులుకుంటారు!... ఫలితం ఫ్రస్ట్రేషన్‌ మాయం..  ఫన్‌ ఖాయం!!

ప్పుడూ వండే వంటే అయినా... ప్రియమైన వారికి వడ్డిస్తున్నాం అనగానే వాళ్ల ఆరోగ్యం విషయంలో మరికాస్త జాగ్రత్తపడతాం. కెలొరీలు తక్కువ ఉండేలా, ప్రేమ ఎక్కువ ఉండేలా చూసుకుంటాం. అందుకే రెడీమేడ్‌గా దొరికే చాక్లెట్లు, కేకులు కానుకలుగా ఇవ్వడం కాకుండా సొంతంగా చేసిపెడదాం. ఆరోగ్యానికి మేలుచేసే పండ్లు, చిరుధాన్యాలతోనే మాయచేద్దాం. చాక్లెట్‌ అయినా, చీజ్‌ అయినా మోతాదుకు మించకుండా చేసి ప్రేమనింపిన వంటలతో అద్భుతాలు చేద్దాం.

పండ్ల పాప్స్‌

కావాల్సినవి: పుచ్చకాయ చిన్నది- ఒకటి, అరటిపండు- ఒకటి, హృదయాకారపు కుకీ కట్టర్లు- రెండు(చిన్నది, పెద్దది) 
తయారీ: పుచ్చకాయలపై నున్న మందపాటి చెక్కు తీసేసి రెండు సెంటీమీటర్ల మందం ఉండేట్టుగా పెద్ద కట్టర్‌తో పుచ్చకాయముక్కలని జాగ్రత్తగా కావాల్సినన్ని కత్తిరించి పెట్టుకోవాలి. అలా కోసిన పుచ్చకాయ ముక్కలని మళ్లీ చిన్నకట్టర్‌తో మధ్యలో ఒత్తి మధ్యలో ఉన్న ముక్కలని తొలగించేయాలి. ఇప్పుడు అదే చిన్న కట్టర్‌తో అరటిపండు ముక్కలని కత్తిరించి ఇందాక మనం కోసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కల మధ్యలో అమర్చి
పెట్టాలి. వీటికి లాలీపాప్‌ స్టిక్స్‌ గుచ్చి నాలుగుగంటలపాటు డీప్‌ ఫ్రిజ్‌లో ఉంచి వడ్డించండి.

చిరుధాన్యాలతో...

కావాల్సినవి: ఓట్స్‌- రెండు కప్పులు, ఓట్స్‌పిండి- అరకప్పు(ఓట్స్‌ని మిక్సీలో వేసుకుని బరకగా ఆడించుకుంటే సరి), తేనె- అరకప్పు, ముదురు రంగు పంచదార- మూడు చెంచాలు, బటర్‌- రెండు చెంచాలు, వెనిల్లా పరిమళం- చెంచాన్నర, ఉప్పు- చిటికెడు, చాక్లెట్‌ చిప్స్‌- చెంచా
తయారీ: ఒక పాత్రలో ఓట్స్‌ వేసి దోరగా వేయించుకోవాలి. ఓట్స్‌ పిండిని కూడా దోరగా వేయించుకోవాలి. మరొక గిన్నెలో పంచదార, బటర్‌, తేనె, వెనిల్లా, ఉప్పు వేసి అవన్నీ కరిగి ఒకదానితో ఒకటి కలిసేంతవరకూ వేడిచేసుకోవాలి. దోరగా వేయించుకున్న ఓట్స్‌ మిశ్రమంలో కరిగించిన పంచదార, తేనె మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. పెర్చమెంట్‌ పేపర్‌ లేదా బేకింగ్‌ షీట్‌పై ఈ మిశ్రమాన్ని ఉంచి సమానంగా పరిచి హార్ట్‌షేప్‌ కుకీ కటర్‌తో ఒత్తి గ్రనోలాబార్‌లని కత్తిరించి పెట్టుకోవాలి. వీటిని ఫ్రిజ్‌లో ఉంచి గట్టిపడిన తర్వాత వడ్డించండి.

దానిమ్మ గింజలతో...

కావాల్సినవి: పుచ్చకాయ ముక్కలు- అరకప్పు, గింజలు తీసేసిన కమలాపండు ముత్యాలు- పావుకప్పు, నిమ్మరసం- అరచెంచా, దానిమ్మ గింజలు- పావుకప్పు 
తయారీ: అన్నింటినీ కలిపి మిక్సీలో వేసి చివరిగా నిమ్మరసం కలుపుకొంటే రెడ్‌ వెల్వెట్‌ స్మూథీ రెడీ!

* జర్మనీలో ఈ రోజు ఇష్టమైన వాళ్లకి వరాహాన్ని పోలిన బిస్కెట్లు కానుకగా ఇస్తారట. 

* మధ్య ఆసియా దేశాల్లో ప్రియమైన వారికి ఈ రోజు రోజ్‌వాటర్‌ టీని ఇచ్చి వారి అలసటని తీరుస్తారు. వేడినీళ్లు, రోజ్‌ వాటర్‌ కలిపి ఈ టీని తయారుచేస్తారు.

* ఉత్తరకొరియాలో హృదయాకారంలో ఉన్న ఆమ్లెట్‌ని వండి ప్రియమైనవారికి వడ్డిస్తారట.

స్ట్రాబెర్రీలతో...

కావాల్సినవి: స్ట్రాబెర్రీలు- పావుకిలో, చాక్లెట్‌ చిప్స్‌- కప్పు, డెకరేటింగ్‌ షుగర్‌- పావుకప్పు
తయారీ: వెడల్పాటి పాత్రలో బేకింగ్‌షీట్‌ని సమంగా పరుచుకోవాలి. డెకరేటింగ్‌ షుగర్‌ని ఒక గిన్నెలో వేసుకుని ఉంచాలి. స్ట్రాబెర్రీలను కడిగి తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలి. చాక్లెట్‌ చిప్స్‌ని మైక్రోఅవెన్‌లో అరనిమిషం పాటు ఉంచితే కరిగిపోతాయి. లేదంటే ఒక పాత్రలో నీరుపోసి మరోపాత్రలో చాక్లెట్‌ ఉంచి కరిగించుకోవచ్చు. ఇందులో స్ట్రాబెర్రీలను ముచ్చిక వరకు ముంచి డెకరేటింగ్‌ షుగర్‌లో అద్దాలి. ఇలా అద్దిన స్ట్రాబెర్రీలను బేకింగ్‌ షీట్‌పై ఉంచి అరగంటపాటు ఫ్రిజ్‌లో ఉంచి ప్రియమైన వారికి వడ్డించండి.

చాక్లెట్‌ మగ్‌కేక్‌

కావాల్సినవి: చాక్లెట్‌ పౌడర్‌- నాలుగు చెంచాలు, మైదా- నాలుగు చెంచాలు, గుడ్డు- ఒకటి, పంచదార- రెండు చెంచాలు, పాలు- నాలుగు చెంచాలు, బటర్‌ కరిగించినది- మూడు చెంచాలు, వెనిల్లా- పావు చెంచా
తయారీ: మైక్రోవేవ్‌ సురక్షిత మగ్‌ను తీసుకుని అందులో పైన చెప్పిన అన్నింటిని ఎక్కడా ఉండల్లేకుండా గరిటెతో కలియతిప్పుకోవాలి. ఈ మగ్‌ని నిమిషంన్నర పాటు మైక్రోఅవెన్‌లో ఉంచుకుంటే చాక్లెట్‌ మగ్‌కేక్‌ సిద్ధమవుతుంది. 

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.