close
Array ( ) 1

తాజా వార్తలు

నన్నో రాణిలా చూసుకుంటారు

పుట్టినింట అపార సంపద.. మెట్టినింట తరగని ఐశ్వర్యం.. అయినా ఆమెది వాటి కోసం ఆలోచించే తత్వం కాదు. అప్పగించిన బాధ్యతలను నిక్కచ్చిగా నిర్వహిస్తుంది. వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటుంది. నలుగురుకీ పనికొచ్చే విషయాలను అందరితో పంచుకుంటుంది. మనకు నచ్చని సంగతులను మనసులో నుంచి తుడిచేయాలని చెబుతుంది. మెగాస్టార్‌ చిరంజీవి కోడలిగా, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఇల్లాలిగా ఒదిగిపోతూనే.. వాణిజ్యవేత్తగా ఎదిగిపోతోంది ఉపాసన. అపోలో ఆస్పత్రిలో ప్రత్యేక బాధ్యతలు ఒకవైపు.. సామాజిక సేవ మరోవైపు.. అన్నింటినీ సమన్వయం చేస్తూ ఈతరం నారికి ప్రతినిధిగా గుర్తింపు పొందిన ఉపాసన ‘హాయ్‌’తో పంచుకున్న కబుర్లు..
* పెద్ద కుటుంబం నుంచి వచ్చారు కదా..! ఆ ప్రభావం మీపై ఎలా ఉంది?
బాల్యం చెన్నైలో సాగింది. తాతయ్య (ప్రతాప్‌ సి రెడ్డి)గారి దగ్గర పెరిగాను. అమ్మమ్మ, తాతయ్యల ప్రభావం నాపై ఎక్కువ. ప్రతి రోజూ ఏదైనా మంచి పని చేయాలంటారాయన. మా ఇద్దరి తాతయ్యల విజయం వెనుక అమ్మమ్మ, నానమ్మలు ఉన్నారు. కుటుంబ విలువలు, మనుషుల మధ్య అనుబంధాలు వారి నుంచి నేర్చుకున్నా. దయ, ధైర్యం, ఇతరులను ప్రేమించే గుణం, సమస్యలను ఎదుర్కోవడం, బాధ్యతగా వ్యవహరించడం విషయాలన్నింటిలో నన్నెంతో ప్రభావితం చేశారు. ఇలాంటి అద్భుతమైన విషయాలు వారిని చూసే తెలుసుకున్నాను.
* చిన్న వయసులోనే చాలా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీ తాతగారు ఈ బాధ్యతలు అప్పగించినప్పుడు మీకేం అనిపించింది?
ఆయన నాపై ఉంచిన నమ్మకానికి చాలా సంతోషపడ్డా. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదని భావించాను. ఈ ప్రపంచానికి నేనెక్కడ పుట్టానో అని కాకుండా.. ఏం సాధించానో చూపించాలి. ఏదైనా పెద్దగా ఆలోంచాలి. ఇతరులకు చేయగలిగిన సాయం చేయాల’ని చెబుతుంటారు తాతయ్య. ఆ దిశగా నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నా. ఈ ప్రయత్నంలో మా పిన్ని సంగీత ఎంతగానో చేయూతనందిస్తున్నారు.
* పెళ్లి మీ జీవితంలో ఎలాంటి మార్పు తెచ్చింది?
పెళ్లి జీవితంలో అందమైన బాధ్యత. పెళ్లి.. ప్రతి రోజూ ఓ కొత్త పాఠాన్ని నేర్పుతుంది. అలాగే బాధ్యతలనూ పెంచుతుంది. ప్రేమ పెరగొచ్చు, తగ్గొచ్చు. కానీ, వివాహం సహనం నేర్పుతుంది. ఆరోగ్యం కూడా అతి పెద్ద బాధ్యత. మంచి ఆహారం, వ్యాయామం లేకపోతే ఆరోగ్యంగా ఉండలేం. అలాగే, జీవిత భాగస్వామి ప్రేమించలేకపోయినా, వారితో సర్దుబాటు లేకపోయినా.. వైవాహిక జీవితమూ సంతోషంగా ఉండదు. వీటిని సాధించినప్పుడే జీవితం సంతోషంగా, సాఫీగా సాగిపోతుంది.
* ఆరోగ్యం విషయంలో మీరు చాలా పక్కాగా ఉంటారు. ఈ విషయంలో మహిళల్లోనూ అవగాహన కల్పిస్తున్నారు. చిన్నప్పటి నుంచీ ఇలా ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారా?
ఒకప్పుడు నేను చాలా లావుగా ఉండేదాన్ని. కాలేజీలో నా పక్కన కూర్చోవడానికి సహ విద్యార్థులు ఆలోచించేవారు. బస్‌లో కూడా అదే అనుభవం ఎదురయ్యేది. నేను ఇద్దరు కూర్చునే స్థలాన్ని ఆక్రమిస్తానని అనుకునేవారు. చాలా ఇబ్బందిగా, కష్టంగా అనిపించేది. కాలేజీ చదువు పూర్తయిన వెంటనే ‘బీ పాజిటివ్‌ మ్యాగజైన్‌’ను ప్రారంభించా. ఇది ఆరోగ్యానికి, లైఫ్‌స్టైల్‌కు సంబంధించింది. అధిక బరువు తగ్గించుకోవడం, సంతోషంగా ఉండటం వంటి అంశాలపై ఫోకస్‌ చేసేదాన్ని. పన్నెండేళ్ల కిందటి ముచ్చట. ఇప్పుడు కూడా ఆరోగ్య సూత్రాలు పంచుకుంటున్నాను. కాలం మారింది. అందరూ సామాజిక మాధ్యమాలకు అలవాటు పడ్డారు. అందుకే నా వేదిక మార్చాను. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, ఆహార విలువలపై వీడియోలు నేనే రూపొందించి సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేస్తున్నాను. చిన్న చిన్న చిట్కాలు, పనుల ద్వారా ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చో వివరిస్తున్నా.

* అలా కన్పిస్తే భరించలేను
అన్ని సినిమాలూ ఇష్టమే. ఆయన సినిమాలు చూస్తూ గర్వంగా ఫీలవుతా. తెరపై తను కనిపిస్తుంటే సంతోషంగా ఉంటుంది. ఆయన్ని ఎవరైనా పొగుడుతుంటే అత్యుత్సాహానికి గురై.. కళ్లలో నీళ్లు తిరుగుతాయి. తెరపై గాయాలతో, రక్తంతో కనిపిస్తే మాత్రం భరించలేను. సినిమా అని తెలిసినా తీవ్ర ఆవేదనకు గురవుతాను.
* ప్రతిరోజూ ఛాలెంజే
ప్రతిరోజూ ఛాలెంజ్‌లు ఎదురవుతుంటాయి. ఇతరుల నుంచి నన్ను ప్రత్యేకంగా నిలబెట్టేలా వాటిని డీల్‌ చేస్తాను. అదే నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఏదైనా సాధించే శక్తినిస్తుంది.
* పౌరాణిక, ఆధ్యాత్మికతకు సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా చదువుతాను.
* గృహిణిగా, ఉద్యోగిగా ఇంటా బయటా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేటి మహిళకు మీరిచ్చే సలహా!
గృహిణి అయినా, ఉద్యోగిని అయినా అందరూ సమానంగా కష్టపడేవారే. రెండు బాధ్యతలనూ సమర్థంగా నిర్వర్తిస్తున్న మహిళలు ఎందరో. ఇంటి పనులు, పిల్లల విషయాలు, ఉద్యోగ బాధ్యతలు అన్నింటినీ చక్కగా సమన్వయం చేసుకోగలరు. భర్త చేయూతనందిస్తే మరీ మంచిది. ఇన్ని బాధ్యతల మధ్య ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు మహిళలు. దీనిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వృథాగా ఉండేవాటిని ఎప్పటికప్పుడు తొలగించాలి. అలాగే వృథా ఆలోచనలనూ ఎప్పటికప్పుడు తుడిచేయాలి. క్రమశిక్షణతో ప్రణాళిక మేర అడుగులు వేయాలి. మీకు మీరే ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. అది సాధించడానికి ప్రయత్నిస్తుండాలి. దానిని నెరవేర్చిన రోజు మీకు మీరే బహుమతి ఇచ్చుకోండి. మీ విజయానికి ఈ విధానం దోహదం చేస్తుంది.

ఆయనది ప్రేమించే గుణం

ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. దయగల మనిషి. ఇతరులను ప్రేమించే గుణం ఉంది. చరణ్‌ను పెళ్లి చేసుకోవడం నా జీవితంలో ఎంతో ఆనందకరమైన విషయం. ఆయన ఉత్సాహంగా, సంతోషంగా ఉండటమే కాదు.. నన్నూ అనుక్షణం ఆనందంగా ఉంచుతారు. నన్ను ఒక రాణిలా చూసుకుంటారు.

పదిలంగా దాచుకుంటా

వివాహబంధంతో ఒక్కటై ఏడేళ్లుగా కలిసి ఉంటున్నాం. చాలా విషయాలు, అభిరుచులు ఇద్దరివీ ఒకేలా ఉంటాయి. మా వైవాహిక జీవితంలో ఎదురయ్యే తీయని అనుభవాలన్నింటినీ పదిలంగా దాచుకుంటాం.

 ఫ్యామిలీకి అది షాక్‌

నేను చరణ్‌ కలిసి మొదటిసారి వెళ్లిన ప్రాంతం గురించి చెప్పలేను. అది ఓ ఫన్నీ స్టోరీ. తెలిస్తే నా ఫ్యామిలీ షాక్‌ అవుతుంది.

ఆయనకెంతో గౌరవం

మామయ్య చిరంజీవి గారు చాలా ఉత్సాహంగా ఉంటారు. జీవితంలో సంతోషకరమైన సందర్భాలను బాగా ఎంజాయ్‌ చేస్తారు. చాలామంది కెరీర్‌లో విజయం సాధించడానికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి. అంతే కాదు, ఉద్యోగం చేసే మహిళలను ఎంతో మర్యాదగా చూస్తారు. కుటుంబం కోసం నిత్యం శ్రమించే మహిళలంటే ఆయనకు గౌరవం. అలాంటి వారిని ప్రోత్సహిస్తారు.

అదే నా స్వర్గం

నాకు చిన్నప్పటి నుంచీ జంతువులంటే చాలా ఇష్టం. పిల్లి పిల్లలంటే మరీ ఇష్టం. పులులు, సింహాలు, చిరుతలంటే ప్రాణం. మా ఫామ్‌లో గుర్రాలు, ఆవులు, మేకలు, గాడిదలు ఉన్నాయి. ఇవన్నీ బ్లూక్రాస్‌ రక్షించినవే. వాటిని దత్తత తీసుకొని ప్రేమగా పెంచుతున్నాను. ఈ ఫామ్‌ నాకు స్వర్గంగా కనిపిస్తుంది. ఈ జంతువులు రోజూ నాకు కొండంత సంతోషాన్నిస్తాయి. ఈ సేవా గుణం అమలానాగార్జున గారి నుంచి పొందిన స్ఫూర్తి.

అక్కడ కొత్త ప్రపంచం

లండన్‌ నా సొంతూరులా అనిపిస్తుంది. అక్కడి వాతావరణం, ఆహారం, పార్క్‌లు ప్రత్యేకమైనవి. అక్కడికి వెళ్లినప్పుడు నా మనసు చాలా ఆనందంగా ఉంటుంది. ప్రొఫెషనల్‌గా శాన్‌ఫ్రాన్‌సిస్కో ఇష్టం. అక్కడికి వెళ్లిన ప్రతిసారీ నాకో కొత్త ప్రపంచంలా కనిపిస్తుంది. అది నాలో కొత్త శక్తిని నింపుతుంది.

అమ్మే స్ఫూర్తి

మా అమ్మ నాకు స్ఫూర్తి. మా పిన్ని, అత్త, అమ్మమ్మ, నానమ్మ, సునీతా కృష్ణన్‌.. వీరంతా నాకు స్ఫూర్తిప్రదాతలే. సొంతకాళ్లపై నిలబడి... సమాజ సేవ చేసే ప్రతి మహిళా నాకు ఆదర్శమే.

మెచ్చే ఆహారం

ఒవెన్‌ చికెన్‌. అది మా అమ్మమ్మ వండే చికెన్‌ లా ఉంటుంది. 

ఫ్యాషన్‌ సౌకర్యం

ఫ్యాషన్‌గా ఉండటం సౌకర్యంగా భావిస్తా. ప్రత్యేక సందర్భాల్లో మెరిసే దుస్తులు ధరిస్తా. అలాగే నేను వెళ్లే ప్రాంతం, వాతావరణం, సందర్భాన్ని బట్టి ఎంపిక చేసుకోవడం అలవాటు. ఇదే మన వ్యక్తిత్వాన్ని  ప్రతిబింబిస్తుంది.

అనుకోని అదృష్టం

దివ్యాంగ చిన్నారులకు సేవలందించే   అదృష్టం సాచి, సాహి సంస్థల ద్వారా దక్కింది. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఈ సేవ నేర్పుతోంది. చిన్నారులకు ఆరోగ్యం చక్కబడినప్పుడు కలిగే భావోద్వేగాన్ని   మాటల్లో చెప్పలేను.

అత్యంత శక్తిమంతురాలు..

మహిళంటే గౌరవానికి ప్రతీక. ఇతరుల జాలిని ఆశించదు, అలాగే తనపై తాను జాలిపడేటంత బలహీనురాలు కాదు. ఎటువంటి ప్రశంసల కోసం ఎదురుచూడకుండా ఒకేసారి చాలా పనులను, బాధ్యతలను చేపట్టగలిగే ధైర్యశాలి. తనకెదురైన ఆటంకాలను తొలగించుకోవడమే కాదు, అవసరమైతే వాటిని తన మనుగడలో వినియోగించగలిగే సామర్థ్యం ఆమెకుంది. 
- సి.హెచ్‌. వసుంధరాదేవి

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.