close

తాజా వార్తలు

Updated : 10/03/2019 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మధుమేహం ఉంది... పాలసీ ఇస్తారా?

నేను గత మూడేళ్లుగా మిడ్‌ క్యాప్‌ ఫండ్‌లో నెలకు రూ.2,000 చొప్పున మదుపు చేస్తున్నాను. కానీ, ఇందులో నాకు ఏ మాత్రం లాభం వచ్చినట్లు కనిపించడం లేదు. రానున్న రోజుల్లో మిడ్‌ క్యాప్‌ ఫండ్లు బాగుంటాయి అని చెబుతున్నారు. నేను ఈ ఫండ్‌లోనే కొనసాగాలా? కొత్తగా మరో రూ.3,000 మదుపు చేయాలనుకుంటున్నాను. ఏ పథకాలను ఎంచుకోవాలి?

- తిరుమల రావు

 

గత 15 నెలలుగా చాలామటుకు మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు దాదాపు 20శాతంపైనే నష్టపోయాయి. ఇదే విధంగా చాలా మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్లు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. స్మాల్‌ క్యాప్‌ ఫండ్లు 10-15 శాతంపైనే వరకూ నష్టాన్ని చవిచూశాయి. మిడ్‌ క్యాప్‌ ఫండ్లు 5-10శాతంపైగానే నష్టపోయాయి. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో మదుపు చేసేప్పుడు 7-10 ఏళ్ల వ్యవధి వరకూ కొనసాగితేనే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. నష్టం వచ్చింది కదా అని పెట్టుబడులను మధ్యలోనే ఆపేయవద్దు. మీరు పెట్టుబడి పెట్టిన ఫండ్‌ పనితీరు.. అదే విభాగంలోని ఇతర ఫండ్లతో పోల్చి చూసినప్పుడు బాగానే ఉందనిపిస్తే.. అందులో మదుపు కొనసాగించండి. ప్రత్యామ్నాయంగా ఎల్‌అండ్‌టీ మిడ్‌ క్యాప్‌ ఫండ్‌ను పరిశీలించవచ్చు. కొత్తగా మదుపు చేయాలనుకుంటున్న మొత్తంతో యాక్సిస్‌ ఫోకస్డ్‌ 25 ఫండ్‌, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఈక్విటీ ఫండ్‌లను ఎంచుకోండి. 
 

నా వయసు 48 ఏళ్లు. ప్రైవేటు ఉద్యోగిని. రూ.3లక్షల మనీ బ్యాక్‌ పాలసీ తప్ప ఏ పెట్టుబడులూ లేవు. ఇప్పటి నుంచి నెలకు రూ.5,000 వరకూ పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. నేను రూ.20లక్షల  టర్మ్‌ బీమా తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రీమియం అధికంగా ఉంటుందా?

- మాధవ

 

మీ వార్షికాదాయానికి 10-12 రెట్ల వరకూ జీవిత బీమా ఉండాలి. ఈ లెక్క ప్రకారం మీకు రూ.20లక్షలు సరిపోతుందా లేదా చూసుకోండి. మీ వయసు 65 ఏళ్లు వచ్చేదాకా టర్మ్‌ పాలసీ రక్షణ ఉండేలా వ్యవధిని నిర్ణయించుకోండి. టర్మ్‌ ఇన్సూరెన్స్‌లో ప్రీమియం ఎక్కువగా ఉండదు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.5వేలను ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో సిప్‌ చేయండి. దీనికి మీరు ఫ్రాంక్లిన్‌ ఇండియా ఈక్విటీ ఫండ్‌, యూటీఐ ఈక్విటీ ఫండ్‌, ఐడీఎఫ్‌సీ స్టెర్లింగ్‌ వాల్యూ ఫండ్‌లను పరిశీలించండి. 
 

రెండేళ్ల నుంచి మధుమేహంతో బాధ పడుతున్నాను. నా వయసు 34 ఏళ్లు. ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలనుకుంటే సాధ్యమవుతుందా? 35 ఏళ్ల లోపు వారికి ఆరోగ్య పరీక్షలు అవసరం లేకుండానే పాలసీ ఇస్తారంటున్నారు. నిజమేనా?

- కృష్ణ

 

ఆరోగ్య బీమా తీసుకునేప్పుడు.. మీకు ఇప్పటికే ఉన్న వ్యాధుల గురించి తెలియజేయాల్సి ఉంటుంది. మీకు మధుమేహం ఉందంటున్నారు కాబట్టి, కచ్చితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం రావచ్చు. సాధారణంగా 35 ఏళ్ల లోపు వారికి ఆరోగ్య పరీక్షలు అవసరం ఉండవు. కానీ, మీది ప్రత్యేక పరిస్థితి కాబట్టి, ఆరోగ్య పరీక్షలు అవసరం అవుతాయి. ఆ వైద్య పరీక్షల నివేదికల ఆధారంగా మీకు ఎంత ప్రీమియం వసూలు చేయాలన్నది బీమా సంస్థ నిర్ణయిస్తుంది. సాధారణ ఆరోగ్య బీమా పాలసీలు కాకుండా.. ప్రత్యేకంగా మధుమేహానికి సంబంధించిన పాలసీలూ ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి పరిశీలించండి. 
 

నా వయసు 61 ఏళ్లు. గత ఏడాది పదవీ విరమణ చేశాను. నా దగ్గరున్న రూ.5లక్షలను ఇప్పటి వరకూ బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఉంచాను. వీటిని లిక్విడ్‌ ఫండ్లలోకి మారిస్తే అధిక రాబడి వస్తుందా? నెలనెలా ఆదాయం వచ్చే ఏర్పాటు ఉండే మంచి పథకాన్ని సూచించండి?

- మూర్తి

 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. లిక్విడ్‌ ఫండ్లు.. బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు సరిసమానంగానే రాబడినిస్తున్నాయి. మీకు కాస్త అధిక రాబడి రావాలంటే.. పోస్టాఫీసు సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీంలో పెట్టుబడి పెట్టండి. ఇందులో 8.7శాతం వడ్డీ వస్తోంది. మూడు నెలలకోసారి ఆ వడ్డీని చెల్లిస్తారు. రూ.5లక్షలు మదుపు చేస్తే.. మూడు నెలలకోసారి రూ.10,875 వడ్డీ వచ్చే అవకాశం ఉంది. 
 

- తుమ్మ బాల్‌రాజ్‌ 
సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌.

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.