close
Array ( ) 1

తాజా వార్తలు

భార్యాభర్తలుగా నటించాల్సి వచ్చింది

చదువు విషయంలో ఒత్తిడి చేయలేదు.. సినిమాల్లోకి వస్తానంటే కాదనలేదు.. నచ్చిన చిన్నదాన్ని పెళ్లిచేసుకుంటానంటే వద్దనలేదు.. కోరుకున్నవి సొంతమైతే అంతకన్నా అదృష్టం ఏముంటుంది! అలాంటి జీవితాన్నే ఆస్వాదిస్తున్నాడు యంగ్‌హీరో అక్కినేని నాగచైతన్య. అయితే, మలుపుల్లేకుండా ‘మజిలీ’ చేరుకుంటే మజా ఏముంటుంది. ప్రతి మలుపూ గెలుపు తీరానికి తీసుకుపోతుందన్న నియమం లేదు. సక్సెస్‌ కోసం హండ్రెడ్‌ పర్సెంట్‌ కష్టపడాలని చెబుతున్న చై.. ‘హాయ్‌’తో పంచుకున్న అనుభవాలు..

* పెళ్లయ్యాక సమంతతో చేసిన ‘మజిలీ’ త్వరలోనే రాబోతోంది. ఇందులో భార్యాభర్తలుగా కనిపిస్తున్నారు కదా! ఇద్దరికీ తెరపై నటించే పని తప్పినట్టుంది?
(నవ్వుతూ) ఆ బోనస్‌ ఏమీ దక్కలేదు. నిజజీవితంలో భార్యాభర్తలమే అయినా.. ఈ పాత్రలకూ మా జీవితాలకూ ఏ సంబంధం లేదు. భార్యాభర్తల మధ్య ఉండే గ్యాప్‌ నేపథ్యంలో సాగే సినిమా ఇది. అలాంటి సందర్భాలు మా జీవితంలో రాలేదు.. కాబట్టి నటించాల్సి వచ్చింది.
*ఓ వైపు ఎన్నికలు.. ఇంకోవైపు ఐపీఎల్‌.. ఈ సమయంలో సినిమా విడుదల సరైన నిర్ణయమేనా?
ఓ రకంగా ఇదే సరైన సమయం. వేసవి సెలవులు వచ్చేశాయి. పైగా ఉగాది వచ్చేస్తోంది. జనాలు సినిమాకి వెళ్లే మూడ్‌లో ఉన్నారు. ఏప్రిల్‌ నుంచి వారానికి ఒకట్రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి. ఎన్నికల హడావుడి అడ్డంకి కాదనే అనిపిస్తోంది. ఇక ఐపీఎల్‌ అంటారా? ఇప్పుడే కదా మొదలైంది.. సెమీఫైనల్స్‌లో ఉండే వేడి ఇప్పుడు ఉండదని మా నమ్మకం.
* మజిలీలో బ్యాట్‌ పట్టుకున్నట్టున్నారు.. చిన్నప్పడు బాగా ఆడేవారా?
చిన్నప్పుడా.. ఏదో సరదాగా బ్యాట్‌ పట్టుకోవడం మినహాయిస్తే.. సీరియస్‌గా ఆడిందేం లేదు. మిగతా ఆటలూ అంతే..! ఏడాది క్రితం వరకు బ్యాట్‌ పట్టుకోవడం కూడా సరిగా రాదు. ఈ సినిమా కోసం క్రికెట్‌ నేర్చుకున్నా. రంజీ క్రికెటర్ల దగ్గర ట్రైనింగ్‌ తీసుకున్నా. మామూలుగా అయితే సినిమా షూటింగ్‌ అయిపోగానే జిమ్‌కి వెళ్లేవాడ్ని. ఈసారి మాత్రం క్రికెట్‌ క్లాసులకు వెళ్లాను. అఖిల్‌ ఉండనే ఉన్నాడు కదా! తన సలహాలు బాగా ఉపయోగపడ్డాయి. ఓ ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ ఆలోచనా విధానం ఎలా ఉంటుంది? మైదానంలో తన హావభావాలు ఎలా ఉంటాయి? అనేవి అఖిల్‌ పూసగుచ్చినట్టు చెప్పాడు.

 

ఇద్దరం స్నేహితుల్లా..

తాతయ్య దూరమయ్యారన్న ఫీలింగ్‌ నాకే కాదు.. మా కుటుంబంలో ఎవ్వరికీ లేదు. ఆయన జ్ఞాపకాలు ఇంకా తాజాగానే ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు తాతగా.. ఫ్రెండ్‌గా ఆయన్ని చాలా మిస్‌ అవుతుంటా. తాతయ్య మైండ్‌ సెట్‌ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతీ విషయంపైనా అవగాహన ఉంది. ఏ వయసు వాళ్లయినా సరే, వాళ్లతో సులభంగా కలసిపోతారు. సినిమాల్లోకి రావాలని ఆయనెప్పుడూ ఒత్తిడి చేయలేదు. ‘డబ్బు పేరు గురించి ఎప్పుడూ ఆలోచించకు. వాటి గురించి పని చేయకు. నీ మనసు ఏం చెబుతుందో అది చెయ్‌. అప్పుడు సంతోషంగా ఉంటావ్‌’ అనేవారు. ఆ మాటల్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. మేం ఎప్పుడు కలసినా సినిమాల గురించి అస్సలు మాట్లాడుకునేవాళ్లం కాదు. ఇద్దరు స్నేహితులు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉండేది.

 

తానేంటో నిరూపించుకోగలడు

అఖిల్‌ టాలెంట్‌ గురించి ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు లేవు. డాన్సులు, ఫైటింగ్‌లు చాలా బాగా చేస్తాడు. చాలా కష్టపడతాడు. సరైన స్క్రిప్ట్‌ వస్తే తనేమిటో నిరూపించుకోగలడు. చేసింది మూడు సినిమాలే కదా! వాడి ప్రయాణం ఇంకా ఎంతో ఉంది. ఒడిదొడుకులు పలకరించినా.. మున్ముందు లైఫ్‌ చాలా బాగుంటుంది. ఆ నమ్మకం నాకుంది.

* స్కూల్‌డేస్‌లో వేసవి సెలవులు ఎలా గడిపేవారు?
సమ్మర్‌ హాలిడేస్‌ వస్తున్నాయంటే పండగే! నాన్న మాల్దీవులు తీసుకెళ్లేవారు. అమ్మ కొడైకెనాల్‌ తీసుకెళ్లేది. ఓ ఏడాది మాల్దీవులు వెళ్తే.. ఇంకో ఏడాది కొడైకెనాల్‌కు. పదేళ్లు ఇలానే గడిచిపోయాయి. సాధారణంగా పిల్లలకు సమ్మర్‌లో పరీక్షలు పాసవుతామా? తరువాతి సంవత్సరం ఏం చదవాలి? వంటి భయాలు ఉంటాయి. నాకు మాత్రం అవేం ఉండేవి కావు. ఎందుకంటే చదువు విషయంలో నాన్నగారు ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు.‘నువ్వు పాస్‌ అవ్వాల్సిందే’ అని భయపెట్టలేదు. ‘నీకు ఏది ఇష్టమో అదే చేయ్‌’ అనేవారు. అమ్మ మాత్రం చదువు విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పేది. ‘కనీస విద్యార్హత అవసరం. చదువు ఉద్యోగం కోసం మాత్రమే కాదు. మన వికాసానికి చాలా అవసరం’ అని చెప్పేది.
* మరి మీరు శ్రద్దగానే చదివేవారా?
చదువు విషయంలో నిర్లక్ష్యం చేయలేదు. లెక్కలు, సైన్స్‌ పెద్దగా వచ్చేవి కావు. ఎకనామిక్స్‌, పాలిటిక్స్‌ అంటే ఆసక్తి ఉండేది. అకౌంట్స్‌ కూడా బాగా చేసేవాడ్ని. అందుకే డిగ్రీలో బీకాం తీసుకున్నా. స్కూల్‌ చదువు అయిపోయాకే ‘నా మైండ్‌ నాకు చెప్పేసింది.. నేనిక సినిమావాడ్ని’ అని ఫిక్సయ్యా. కానీ, అమ్మ కోసం బీకాం పూర్తి చేసి సినిమాల్లోకి వచ్చా.
* మజిలీ.. ఓ మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి కథ. మీది ఏ క్లాస్‌ స్వభావం..?
నా స్కూలింగ్‌ అంతా చెన్నైలోనే. అక్కడ నా జీవితం మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిలాగే సాగింది. సింపుల్‌ లైఫ్‌స్టైల్‌. అమ్మ నన్ను పెద్దగా గారాబం చేయలేదు. గిఫ్ట్‌లు, బర్త్‌డే పార్టీలు ఉండేవి కావు. మెటిరియలిస్ట్‌ ప్రపంచానికి దూరంగా ఉంచేది. నేనో స్టార్‌ కొడుకునని నా స్కూల్‌లో ఎవరికీ తెలియదు. నేనూ అలా ప్రవర్తించలేదు.

 

ఇల్లు.. ఇల్లాలు.. పిల్లలంటే ఇష్టం

భర్త పోస్ట్‌ కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూశా! వచ్చినందుకు హ్యాపీ. నిజానికి నాకు బాధ్యతలంటే ఇష్టం. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు... ఈ సిస్టమ్‌ అంటే చాలా ఇష్టం. జీవితంలో ఎలాంటి బాధ్యతలు లేకుండా, ఎంజాయ్‌ చేసిన సందర్భాలు ఎన్నో! ఆ వయసు దాటి వచ్చాను. ఇప్పుడు జీవితంలో స్థిరపడాల్సిన సమయం వచ్చింది. అందుకే సమంతని పెళ్లి చేసుకున్నా.
ఇద్దరం ఒకరికోసం కోసం మరొకరం మారాం. పెళ్లంటేనే సర్దుబాట్లు. ఎవరైనా సరే మారక తప్పదు. మా ఇద్దరి వ్యక్తిత్వాలు వేరు. ఏదో ఓ కామన్‌ పాయింట్‌ మమ్మల్ని కలిపింది. మిగిలిన విషయాలన్నీ మార్చుకోవాల్సిందే. ప్రేమ ఉంటే.. ఆ మార్పు పెద్ద కష్టం కాదు. ప్రేమే మనల్ని మారుస్తుంది.
సమంతది సర్దుకుపోయే మనస్తత్వం. మా ఇంట్లో కూడా ఫార్మాలిటీస్‌ ఉండవు. కాబట్టి నాకు భయాల్లేవు. పైగా.. సమంతని డైరెక్ట్‌గా తీసుకెళ్లి ‘మీ కోడలు’ అనేయలేదు. లంచ్‌కీ, ఇంట్లో జరిగే పార్టీలకీ తీసుకెళ్లి.. అలా మా ఇంటినీ, ఇంట్లో వాతావరణాన్ని, మనుషుల్నీ సమంతకు మెల్లమెల్లగా పరిచయం చేశా. సమంత మధ్యతరగతి నుంచి వచ్చిన అమ్మాయి. తన మైండ్‌సెట్‌ బాగుంటుంది. చాలా కష్టపడి పైకొచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇమిడిపోతుంది.
సమంతను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పడానికి భయమేసింది. కానీ, చెప్పగానే అర్థం చేసుకున్నారు. విషయం చెప్పగానే నాన్న అడిగిన ప్రశ్న ఒక్కటే... ‘సమంతనే ఎందుకు చేసుకుంటావ్‌? చేసుకుంటే మీ ఇద్దరూ హ్యాపీగా ఉండగలరా?’ అన్నారు. దానికి సమాధానం చెప్పగలిగాను. అలా నన్ను ప్రశ్నించడం కూడా అవసరమే. అది అమ్మానాన్నల బాధ్యత కూడా. వాళ్లకూ కొన్ని భయాలు ఉంటాయి. పైగా నాపై నాకు క్లారిటీ వస్తుంది కదా? నన్ను నేను సమాధాన పరచుకోవడానికీ, భవిష్యత్తుపై నమ్మకం కలగడానికి నాన్న అడిగిన ప్రశ్న చాలా ఉపయోగపడింది.
*  మీకు కోపం ఎక్కువ అని విన్నాం.. నిజమేనా?
టైమ్‌కి జరగాల్సిన పనులు జరక్కపోతే కోపం వస్తుంది. ఉదయం సెట్‌కి వెళ్లాననుకోండి. అంతా రెడీగా ఉన్నా... షూటింగ్‌ జరగడం లేదనిపిస్తే నాలో ఉన్న నిర్మాత బయటకు వస్తాడు. అప్పుడు కోపం వస్తుంది. ఉదయాన్నే మనలో బోలెడంత ఎనర్జీ ఉంటుంది. దాన్ని వాడుకోవాలి కదా అనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో తప్ప నాకు కోపం రాదు. వచ్చినా అది అందరిమీదా చూపించను.
* చదువుకునేటప్పుడు పాకెట్‌ మనీ ఎంత ఇచ్చేవారు?
గుర్తు లేదు. కానీ చాలా తక్కువే. ఎంత అడగినా.. ‘అన్ని డబ్బులు ఎందుకు?’ అని నాన్న ప్రశ్నించేవారు. ఆ ప్రశ్నకు సమాధానం చెబితే డబ్బులు ఇచ్చేవారు. అది రావాలి, ఇది కావాలి అని పేచీ పెట్టిన సందర్భాలు కూడా లేవు. ఒకవేళ ‘నాన్నా ఆ బైక్‌ కొనండి’ అని అడిగితే.. ‘అదెందుకు? అసలు అవసరమా కాదా?’ లాంటి ప్రశ్నలు వేసేవారు. చాలాసార్లు నన్ను కన్విన్స్‌ చేసేవారు. అడిగింది ఇవ్వలేదన్న బాధ ఉన్నా, ఓ గంట ఆగి ఆలోచిస్తే, నాన్న చెప్పింది నిజమే కదా? అనిపించేది.
*  షూటింగ్‌ లేనప్పుడు మీ వ్యాపకాలు ఎలా ఉంటాయి?
నాకు ట్రావెలింగ్‌ ఇష్టం. బైక్‌, కార్‌.. ఏదైనా తీసుకుని రోడ్‌ జర్నీ చేయాలనుకుంటాను. నా దగ్గర బైక్‌ కలక్షన్‌ ఉంది. ఏదైనా ఓ కొత్త బైక్‌ వస్తే దాని డిజైన్‌ ఎలా ఉంది? ఇంజినీరింగ్‌ వర్క్‌ ఎలా ఉంది? అనేది పరిశీలిస్తాను. నచ్చితే కొంటాను. పుస్తకాలు మాత్రం చదవను. ఏదైనా చదవడం కంటే, విజువల్‌గా చూసినప్పుడే నా మైండ్‌కి ఎక్కుతుంది.
- మహమ్మద్‌ అన్వర్‌

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.