
తాజా వార్తలు
‘ఆర్ఆర్ఆర్’లో ఆ మార్పులు చేయబోతున్నారా?
హైదరాబాద్: సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘ఆర్ఆర్ఆర్: రౌద్రం రుధిరం రణం’ ఒకటి. రామ్‌చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రమిది. కరోనా కారణంగా లాక్డౌన్ ప్రకటించడంతో ఎక్కడి షూటింగ్‌లు అక్కడ ఆగిపోయాయి. ఈ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ కూడా చేరింది. లాక్డౌన్ కారణంగా దాదాపు రెండు నెలల కీలక సమయం వృథా అయ్యింది. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో రాజమౌళి ఒక నిర్ణయానికి వచ్చారట.
అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. సరిగ్గా ఇదే సమయంలో కరోనా రావడంతో షూటింగ్ నిలిచిపోయింది. దీంతో చిత్ర బృందంతో చర్చించి కథలో స్వల్ప మార్పులు చేయబోతున్నట్లు సమాచారం. అనుకున్న సమయానికి సినిమా విడుదల చేయాలని జక్కన్న దృఢ నిశ్చయంతో ఉన్నారు. దీనికి తగ్గట్లు ‘ఆర్ఆర్ఆర్’ స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలనుకుంటున్నారట. భారీ యాక్షన్ సీక్వెన్స్, అవుట్ డోర్ షెడ్యూల్ సీన్స్ విషయంలో ఈ మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. వీలైనంత వరకు తక్కువ మందితో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే వేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకునేలా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ ఇప్పటికే 80 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది కాబట్టి.. ఇప్పుడు చేసే మార్పులు కథపై పెద్దగా ప్రభావం చూపవని భావిస్తున్నట్లు సమాచారం.
అయితే, సినిమా చిత్రీకరణలకు తాజాగా తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. త్వరలో అందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయనుంది. దీంతో వీలైనంత త్వరగా సెట్స్‌లోకి అడుగుపెట్టాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారట జక్కన్న. ఈ విషయంలో ఆయనకు కథానాయకులు ఎన్టీఆర్, రామ్‌చరణ్ నుంచి కూడా సపోర్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి అనుకున్న తేదీకి ‘ఆర్ఆర్ఆర్’ వస్తుందా? లేదా? తెలియాలంటే ఇంకొంత కాలంగా ఆగాల్సిందే. సినిమా విషయంలో రాజమౌళి అస్సలు రాజీపడరన్న సంగతి తెలిసిందే. మరి కరోనా తెచ్చిన ఖాళీ కోసం కాంప్రమైజ్ అవుతారా? చూద్దాం!