
తాజా వార్తలు
‘ఆర్ఆర్ఆర్’ ట్రయల్ షూట్ లేదా?
ఇంటర్నెట్‌డెస్క్: లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో ఇప్పుడిప్పుడే అన్నీ రంగాలు నెమ్మెదిగా తిరిగి కోలుకుంటున్నాయి. అయితే, అదే స్థాయిలో కరోనా కేసుల విజృంభణ కూడా భారీగా ఉంది. మరోవైపు అనేక జాగ్రత్తలతో సినిమా/టెలివిజన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ముఖ్యంగా సీరియళ్లు, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అగ్ర నటుల చిత్రాలు కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లాలని దర్శక-నిర్మాతలు భావిస్తున్నారు. అయితే, భారీ తారాగణంతో కూడిన ఇటువంటి చిత్రాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఈ నేపథ్యంలో అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి సంబంధించి రెండు రోజులపాటు ట్రయల్‌షూట్ నిర్వహించాలని చిత్ర బృందం భావించిందటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ట్రయల్ షూట్‌ను కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది.
రామ్‌చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రమిది ‘ఆర్ఆర్ఆర్’. అత్యధిక భాగం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా కూడా కరోనా కారణంగా తాత్కాలికంగా వాయిదా పడింది. చిత్రీకరణలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రెండు రోజుల పాటు ట్రయల్‌షూట్ చేయాలని జక్కన్న భావించారట. గండిపేట సమీపంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సాబు శిరిల్ నేతృత్వంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో ఈ షూటింగ్ చేద్దామని అనుకున్నారు. అయితే హైదరాబాద్‌లో కరోనా కేసులు నానాటికీ పెరుగుతుండటంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు సమాచారం. దీనిపై చిత్ర బృందం నుంచి ఎటువంటి స్పందనా లేదు. మరి ‘ఆర్ఆర్ఆర్’ షూట్‌ను తిరిగి ఎలా మొదలు పెడతారో వేచి చూడాలి.
రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రను పరిచయం చేస్తూ, విడుదల చేసిన టీజర్ ఆ అంచనాలను పెంచింది. ఇక కొమరం భీంగా ఎన్టీఆర్ దర్శనమివ్వనున్నారు. అలియాభట్, ఓలివియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 8, 2021న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.