
తాజా వార్తలు
‘ఆర్ఆర్ఆర్’ షూట్‌కు ముందు ఏం జరిగిందంటే?
హైదరాబాద్: టాలీవుడ్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం)’. తెలుగు సినీ పరిశ్రమలో రెండు అగ్ర కుటుంబాలకు చెందిన ఇద్దరు హీరోలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకు వెళ్లడానికంటే ముందు బ్యాగ్రౌండ్లో ఎన్నో పనులు జరిగాయి. ఈ విషయంపై ఒకానొక సందర్భంలో రాజమౌళి స్పందిస్తూ.. ‘తారక్, చరణ్‌లతో కలిసి ఇప్పటికే నేను కొన్ని భారీ బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించాను. సినీ నేపథ్యం ఉన్న రెండు కుటుంబాలకు చెందిన చరణ్, తారక్‌లను ఈ సినిమా ద్వారా ఒకేసారి కలిసి పనిచేయనున్నారు. నిజజీవితంలో వాళ్లిద్దరూ మంచి స్నేహితులు. అదే నాకు ఉన్న అడ్వాంటేజ్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి నాకు ఉన్న ఆలోచనను వాళ్లతో చెప్పగానే వెంటనే ఓకే చెప్పేశారు. షూటింగ్‌కు వెళ్లడానికికంటే ముందు మేము క్యారెక్టర్ డిజైనింగ్ సెషన్స్‌లో పాల్గొన్నాం. క్యారెక్టరైజేషన్‌కు సంబంధించిన స్కెచ్‌లు గీశాం. వాళ్లిద్దరూ వారి వారి పాత్రల్లో ఎంతగానో ఒదిగిపోయారు’ అని తెలిపారు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమరంభీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. రామ్‌చరణ్‌కు జంటగా బాలీవుడ్ నటి ఆలియాభట్, ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ సందడి చేయనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి సంబంధించిన పనులు వాయిదా పడ్డాయి.