
తాజా వార్తలు
చిరంజీవికి నాకూ ఎలాంటి గొడవలేదు: రాజశేఖర్
హైదరాబాద్: చిరంజీవికి, తనకూ మధ్య ఎలాంటి గొడవలు, అపోహలు లేవని సినీ నటుడు రాజశేఖర్ అన్నారు.నూతన సంవత్సర సందర్భంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాస అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వేదికపై ఉన్న అందరి కాళ్లకూ మొక్కుతూ, రాజశేఖర్ ఆవేశంతో ప్రసంగించారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు చిరంజీవితో సహా అందరూ అసహనం వ్యక్తం చేశారు. కాగా, గురువారం ఉదయం జరిగిన పరిణామాలపై రాజశేఖర్ ట్విటర్ వేదికగా స్పందించారు.
‘‘ఈరోజు ఏం జరిగినా అది నాకూ, నరేశ్‌కు, ‘మా’కు మధ్య మాత్రమే జరిగింది. ఏ ఒక్క పనీ సరిగ్గా జరగడం లేదు. అందుకే నేను మాట్లాడకుండా ఉండలేకపోయా. నాకూ చిరంజీవిగారికి, మోహన్‌బాబుగారికి మధ్య ఎలాంటి అపోహలు, గొడవలు లేవు. నా వల్ల ఉదయం జరిగిన దానికి క్షమాపణలు చెబుతున్నా. ‘మా’ కార్యనిర్వాహక ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశా. చిత్ర పరిశ్రమకు నా వల్ల ఏం సాయం కావాలన్నా చేస్తా. ఈరోజు జరిగిన దానిని దయ చేసి పెద్దదిగా చూపించకండి. ముఖ్యంగా చిరంజీవిగారికీ, మోహన్బాబుగారికీ నాకూ మధ్య జరిగిన గొడవగా దీన్ని సృష్టించవద్దు. వారిద్దరి పైనా నాకు అమిత గౌరవం ఉంది. ‘మా’కు వారి సేవలు అవసరం. దయ చేసి దీన్ని మరోలా అర్థం చేసుకోవద్దు’’ -ట్విటర్లో రాజశేఖర్
అంతకుముందు ‘మా’ కార్య నిర్వాహక ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ లేఖను విడుదల చేశారు.
టు,
మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)
డియర్ ఆల్..
‘‘ఈ లేఖ ద్వారా నా మనస్సులో ఉన్నదంతా మీతో పంచుకోవాలని అనుకుంటున్నా. నేను ‘మా’ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి అసోసియేషన్ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తూ, ఉత్తమంగా పనిచేస్తున్నా. అయితే, ‘మా’లో సమస్యలను పరిష్కరించడానికి బదులు అధ్యక్షుడు నరేశ్ కమిటీ సభ్యులను ఉద్దేశించి కించపరిచేలా, అవమానకరంగా మాట్లాడుతున్నారు. పారదర్శకతకు నీళ్లొదిలి, పదే పదే తప్పులు మీద తప్పులు చేస్తూ, మెజార్టీ సభ్యులు ఆమోదించిన నిర్ణయాలను పక్కన పెడుతున్నారు. అదే సమయంలో ఆయనకు నచ్చినట్లు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు జరిగిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా ఆయన మాట్లాడిన ఏ విషయాన్ని మాతో చర్చించలేదు. జీవితకు వాట్సాప్ సందేశం మాత్రమే పంపారు. మేము ‘మా’ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇదే జరుగుతోంది. అధ్యక్షుడు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల గురించి ఇండస్ట్రీలోని పెద్దలకు, మా సభ్యులకు స్నేహపూర్వక సమావేశం పెట్టి వివరించాం. అయినా, ఆయన చర్యల్లో ఎలాంటి మార్పూ రాలేదు. దీంతో ఈరోజు డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యా. నేను భావోద్వేగాలను నియత్రించుకోలేను. అదే సమయంలో ఉన్నది ఉన్నట్లు మాట్లాడతా. అది మీకు నచ్చవచ్చు. నచ్చలేకపోవచ్చు. మీ అందరికీ ఈ విషయాన్నేచెప్పాలనుకుంటున్నా. అదే సమయంలో ‘మా’ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నా. ఎందుకంటే మిస్టర్ నరేశ్ వ్యవహారశైలి నాకు ఏమాత్రం నచ్చడం లేదు. నా ఆవేదనను అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా’’
ధన్యవాదాలతో,
మీ రాజశేఖర్.
ఇవీ చదవండి..!