
తాజా వార్తలు
ఆ హీరోలా ఉండలేకపోతున్నా: బన్నీ
విజయ్ దేవరకొండ అంటే ఇష్టం..!
హైదరాబాద్: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ కథానాయకుడు రణ్వీర్ సింగ్ను మెచ్చుకున్నారు. దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బన్నీ తాజాగా ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు. దుస్తుల ఎంపిక, ట్రెండ్, స్టైల్ గురించి ముచ్చటించారు. విజయ్ దేవరకొండ, రణ్వీర్కు మంచి స్టైల్ సెన్స్ ఉందని అభిప్రాయపడ్డారు. ‘నాకు విజయ్ దేవరకొండ నచ్చుతాడు. అతడికి దుస్తుల బ్రాండ్ ఉంది. దాని కోసం చాలా కష్టపడుతున్నాడు. నాకు అతడి స్టైల్ నచ్చుతుంది. ఇక బాలీవుడ్ హీరోల్లో రణ్వీర్ సింగ్ ఇష్టం. ఆయన దుస్తుల ఎంపికను కచ్చితంగా ప్రశంసించాలి. వ్యక్తిగతంగా అతడిలా ప్రత్యేకమైన దుస్తుల్ని ధరించాలని చాలా ప్రయత్నించా, కానీ నా వల్ల కాలేదు. అలాంటి డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలంటే దానికి తగ్గ యాటిట్యూడ్ కూడా ఉండాలి’.
‘నా విషయానికి వస్తే స్టైల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటా. టాలీవుడ్లో స్టైలిస్ట్లు ఉన్నప్పటికీ.. నేను వ్యక్తిగతంగా ఓ హెయిర్ స్లైలిస్ట్ను నియమించుకున్నాను. ఎన్నో ఫొటోల్ని పరిశీలించి.. చివరికి ఓ నిర్ణయానికి వస్తాం. మీరు సినిమాలో చూసే నా లుక్ ఎంతో ప్లాన్ చేస్తే వచ్చే అవుట్పుట్. లుక్ పరంగా ఇన్నేళ్లు మేం చేసిన ప్రయత్నాలన్నీ సక్సెస్ కావడం సంతోషకరమైన విషయం’ అని ఆయన చెప్పారు.