టాలీవుడ్‌పై కన్నేసిన ముంబయి బ్యూటీలు

తాజా వార్తలు

Published : 14/03/2020 09:59 IST

టాలీవుడ్‌పై కన్నేసిన ముంబయి బ్యూటీలు

గాలి ఇటు మళ్లింది..

బాలీవుడ్‌ భామలు టాలీవుడ్‌పై కన్నేశారు. అక్కడ సత్తా చాటుకున్న ముద్దుగుమ్మలు ఇక్కడ కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దేశవ్యాప్తంగా తెలుగు సినిమాకు మార్కెట్‌ పెరగడంతో హిందీలో బిజీ ఉన్న భామలు సైతం తెలుగు ప్రాజెక్టులకు సంతకం చేస్తున్నారు. కష్టపడి తెలుగు భాష, యాసను నేర్చుకుంటున్నారు. అంతేకాదు కొందరు సొంతంగా డబ్బింగ్‌ కూడా చెప్పేస్తున్నారు. కథ, పాత్రల డిమాండ్‌ను బట్టి టాలీవుడ్‌ దర్శక, నిర్మాతలు వారివైపు మొగ్గుచూపుతున్నారు. త్వరలో మరికొందరు బ్యూటీలు తెలుగు వారిని పలకరించబోతున్నారు. వారిని ఓసారి చూద్దాం..

కోరి మరీ..

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో బాలీవుడ్‌ భామ ఆలియా భట్‌ నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్‌ చరణ్‌కు జోడీగా సీత పాత్రలో ఆమె కనిపించబోతున్నారు. హిందీలో ఫాంలో ఉన్న ఈ భామ రాజమౌళి నుంచి ఆఫర్‌ రాగానే ఎగిరి గంతేసి మరీ సంతకం చేశారు. ‘బాహుబలి’ చూసిన తర్వాత రాజమౌళితో కలిసి పనిచేయాలని అనిపించిందని ఆలియా ఓసారి చెప్పారు. అనుకోకుండా ఓసారి విమానాశ్రయంలో రాజమౌళిని కలిశానని, తన ఆసక్తి గురించి చెప్పానని అన్నారు. చిన్న పాత్రకైనా ఓకేనని ఆమె చెప్పడంతో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో అవకాశం ఇచ్చారు. ఈ చిత్రం కోసం ఆమె తెలుగు కూడా నేర్చుకుంటున్నారట. ఇదే సినిమాలో ఎన్టీఆర్‌ ప్రియురాలిగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్‌ నటిస్తున్నారు. 2021 జనవరి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

విజయ్‌ ప్రేమ కోసం..

ఏడాది రూపొందుతోన్న మరో క్రేజీ సినిమా ‘ఫైటర్‌’ (పరిశీలనలో ఉన్న టైటిల్‌). పూరీ జగన్నాథ్‌, విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమా కోసం బాలీవుడ్‌ భామలను జల్లెడ పట్టారు. తొలుత జాన్వి కపూర్‌ నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత దిశా పటానీని కలిస్తే, ఆమె నో చెప్పారట. చివరికి అనన్య పాండే ప్రాజెక్టుకు సంతకం చేశారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన 40 రోజుల షూటింగ్‌ ముంబయిలో జరిగింది. అలా ఈ ఏడాది మరో కొత్త మోము తెలుగు తెరపై కనిపించబోతోంది. అనన్య ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’, ‘పతి పత్ని ఔర్‌ ఓ’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.

ప్రభాస్‌ ప్రేయసిగా..

బాలీవుడ్‌లో నటిగా నిలదొక్కుకున్న శ్రద్ధా కపూర్‌ గతేడాది తొలిసారి తెలుగు తెరపై మెరిశారు. ప్రభాస్‌ కథానాయకుడిగా సుజీత్‌ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్‌ సినిమా ‘సాహో’లో నటించారు. ఈ సినిమాలో అమృతగా మెప్పించారు. భారీ అంచనాల మధ్య  విడుదలైన సినిమా యాక్షన్‌ థ్రిల్లర్‌గా పర్వాలేదనిపించింది. శ్రద్ధ నటించిన ‘బాఘి 3’ మార్చి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైగర్‌ ష్రాఫ్‌ కథానాయకుడు. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.120 కోట్ల కంటే ఎక్కువ రాబట్టినట్లు అంచనా వేశారు.

పవన్‌ కోసం..

రెండేళ్ల విరామం తర్వాత పవన్‌ కల్యాణ్‌ మళ్లీ మేకప్‌ వేసుకున్నారు. ఆయన కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది.  పాన్‌ ఇండియా స్థాయిలోనే రూపొందుతున్న ఈ చిత్రం కోసం హిందీ భామ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. అంతేకాదు హిందీ నటుడు అర్జున్‌ రాంపాల్‌ కూడా ఈ సినిమాలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రచారంపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది. ఇప్పటికే ‘సాహో’లోని ప్రత్యేక గీతంలో జాక్వెలిన్‌ తెలుగు వారికి కనిపించారు.

బాక్సర్‌కు జతగా..

‘గద్దలకొండ గణేష్‌’ తర్వాత వరుణ్‌తేజ్‌ బాక్సర్‌ అవతారం ఎత్తారు. ఆయన హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఈ చిత్రం కోసం వరుణ్‌ ముంబయిలోని నిపుణుల వద్ద మూడు నెలలపాటు బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. ఇటీవల మొదటి షెడ్యూల్‌ పూర్తయింది. నవీన్‌ చంద్ర, నదియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్‌ సరసన బాలీవుడ్‌ నటి సయీ మంజ్రేకర్‌ నటించబోతున్నారట. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ‘దబాంగ్‌ 3’తో సయీ పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.

వరుస ఆఫర్లు..

‘భరత్‌ అనే నేను’ సినిమాతో తెలుగు వారిని పలకరించిన కియారా అడ్వాణీ ఆపై ‘వినయ విధేయ రామ’లో కనిపించారు. దీని తర్వాత బాలీవుడ్‌లో బిజీ అయిన ముద్దుగుమ్మ మరోసారి మహేశ్‌బాబు సరసన కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేశ్‌ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్న సినిమాలో నటించనున్నారు. ఇందులో కథానాయికగా కియారాను తీసుకోమని మహేశ్‌ సతీమణి నమ్రత దర్శక, నిర్మాతలకు సిఫార్సు చేశారట.

‘డీజే’ తర్వాత టాలీవుడ్‌లో పూజా హెగ్డే జోరు పెరిగింది. వరుస సినిమాలు, విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల ‘అల వైకుంఠపురములో..’ సందడి చేసిన ఆమె ఇప్పుడు ప్రభాస్‌ సరసన నటిస్తున్నారు. వింటేజ్‌ ప్రేమకథతో రూపొందుతున్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మరోపక్క అక్కినేని అఖిల్‌ హీరోగా నటిస్తున్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’లో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు ఈ భామ తెలుగులో డబ్బింగ్‌ కూడా చెప్పుకొంటున్నారు.

ప్రభాస్‌ ‘ఏక్‌ నిరంజన్‌’లో తెలుగులో మెరిసిన కంగనా రనౌత్‌ ఇప్పుడు దక్షిణాది సినిమాలకు ఓటు వేస్తున్నారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తీస్తున్న ‘తలైవి’లో టైటిల్ రోల్‌ పోషిస్తున్నారు. ఎ.ఎల్‌. విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇటీవల ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో ఎంజీఆర్‌గా అరవింద్‌ స్వామి నటిస్తున్నారు.

సుధీర్‌బాబు ‘సమ్మోహనం’తో తెలుగు వారిని పలకరించిన బాలీవుడ్‌ భామ అదితిరావు హైదరి. తొలి సినిమాతో గుర్తింపు పొందిన ఆమె ‘వి’లో కనిపించనున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్‌బాబు ప్రధాన తారాగణంగా ఈ సినిమా రూపొందుతోంది. మార్చి 25న చిత్రం విడుదల కాబోతోంది. జోరుగా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని