ఇల్లు కట్టించాలని పిలిచి.. అపహరించి..
close

తాజా వార్తలు

Updated : 18/02/2020 09:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇల్లు కట్టించాలని పిలిచి.. అపహరించి..

గుత్తేదారును బెదిరించిన ముగ్గురు నిందితుల అరెస్టు

జవహర్‌నగర్‌: భార్య హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న నేరస్థుడికి.. అపహరణ ఇతర నేరాలపై జైలుకెళ్లిన వ్యక్తి పరిచయమ్యాడు. ఇద్దరు విడుదలయ్యాక మరో వ్యక్తితో కలిసి మళ్లీ నేరాలు ప్రారంభించారు. ఇంటిని కొనుగోలు చేస్తామని బిల్డర్‌ను ఆశ్రయించి అతడినే అపహరించి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలో వెలుగుచూసింది. నిందితులను అరెస్టు చేసిన జవహర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ బిక్షపతిరావు సోమవారం వివరాలు వెల్లడించారు. యాదాద్రి-భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్లకు చెందిన ఎంపీటీసీ బొల్ల నర్సింహులు(32) అలియాస్‌ దామన్న గతంలో మాజీ నక్సలైట్లతో కలిసి బెదిరింపులు, అపహరణలకు పాల్పడ్డాడు. ఓ ఆసుపత్రి యాజమాన్యాన్ని డబ్బు కోసం బెదిరించాడు. ఇతడిపై జవహర్‌నగర్‌ ఠాణాలో 4, కుషాయిగూడ, నాచారం ఠాణాలో 1, సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ ఠాణాలో 3 కేసులున్నాయి. 2017లో పీడీ చట్టం అమలుతో జైలుకెళ్లాడు. అక్కడ భార్య హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న చిప్పమల్లేష్‌(40) పరిచయమ్యాడు. 2018 డిసెంబరులో మల్లేష్‌ జైలు నుంచి విడుదలయ్యాక శంషాబాద్‌లోని ఓ దాబాలో వంటవాడిగా చేరాడు.

జైలుకెళ్లినా మారని తీరు..
జైలుకెళ్లినా మారని నర్సింహులు మల్లేష్‌ను సంప్రదించి అపహరణ ప్రణాళికలను తెలిపాడు. మల్లేష్‌ కాకినాడకు చెందిన స్నేహితుడు మహ్మద్‌ రోషన్‌ అలీ(38)ని పరిచయం చేశాడు. ఈ నేపథ్యంలో కీసర మండలం నాగారానికి చెందిన బిల్డర్‌ తన్నీరు రాంబాబు దమ్మాయిగూడలో ఇంటిని విక్రయిస్తానని తన ఫోన్‌ నెంబర్‌తో ఓ బోర్డు ఏర్పాటు చేశారు. ఆ ఇల్లు కావాలని ఈ ముగ్గురిలో ఒకరు రాంబాబుకు ఫోన్‌చేశారు. అప్పటికే విక్రయించేశానని రాంబాబు చెప్పగా, మరెక్కడైనా ఖాళీ ప్లాటు ఉంటే తమకు కావాల్సిన రీతిలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. శామీర్‌పేట సమీపంలో తన మిత్రుడి ఇల్లు ఉందని, అలా కట్టించి ఇవ్వాలని రాంబాబును మరో వ్యక్తితో కలిసి కారులో తీసుకెళ్లారు. కొంతదూరం వెళ్లాక వారు ఎయిర్‌గన్‌ చూపించి రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డారు. అతడు భయపడి వెంటనే స్నేహితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఫోన్‌చేసి డబ్బు సమకూర్చమన్నాడు. అతడు నగదు లేదు.. చెక్కు ఇస్తానని చెప్పడంతో నిందితులు డబ్బు లేదా ప్లాటు కాగితాలు ఇవ్వాలని బెదిరించారు. అనంతరం నిందితులు రాంబాబు జేబులో ఉన్న రూ.7 వేల నగదును తీసుకుని ఈనెల 10న ఘట్‌కేసర్‌ బస్‌స్టాండులో వదిలేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదుచేయగా దర్యాప్తు చేపట్టి నిందితులను సోమవారం అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని