కలకలం రేపిన చిన్నారి అపహరణ
close

తాజా వార్తలు

Published : 18/03/2020 08:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కలకలం రేపిన చిన్నారి అపహరణ

నాలుగు గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్‌ : మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హఫీజ్‌పేటలో చిన్నారి అపహరణ ఘటన సంచలనం రేపింది. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జన్నార్‌ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీస్‌లు 4 గంటల వ్యవధిలోనే చిన్నారిని తల్లి చెంతకు చేర్చారు. మియాపూర్‌ ఏసీపీ కృష్ణప్రసాద్‌, సీఐ వెంకటేష్‌ మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

కోపంతోనే అపహరణ
న్యూహఫీజ్‌పేట ఆదిత్యానగర్‌లో అబ్దుల్‌వాహబ్‌, ఫర్హీన్‌ సుల్తానా దంపతులు నివాసముంటున్నారు. వీరికి రెండు సంవత్సరాల వయసు ఉన్న కుమారుడు మహ్మద్‌ అష్కాన్‌ ఉన్నాడు. వీరింట్లోకి ఆరునెలల కిందట విశాఖజిల్లా గుల్‌గొండ మండలం నాగాపురం గ్రామానికి చెందిన నూకరాజు అద్దెకు దిగాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో అతను మొదటి భార్యతో విడిపోయి మరోర మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే వ్యసనాలకు బానిసయ్యాడు. ఆ కారణంగా సదరు మహిళ అతనికి దూరంగా వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా నెల నెలా అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యాజమాని నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో సామాన్లు సైతం అక్కడే వదిలేసి అడ్డాపై ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

పక్కా ప్రణాళికతో..
తన సహచారిణి తనను విడిచివెళ్లిపోవడానికి ఇంటి యాజమానురాలే కారణమని, తన సామాన్లు సైతం ఇవ్వలేదన్న అక్కసుతో పాటు వ్యసనాలకు నగదు అవసరం పడడంతో చిన్నారి అపహరణకు ప్రణాళిక రూపొందించాడు. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారిని ఎవరికీ కనిపించకుండా వెంట తీసుకెళ్లాడు. అనంతరం బాలుడిని విక్రయించి డబ్బు తీసుకోవాలని ఆలోచించి కొండాపూర్‌ ప్రాంతంలోని తన సమీప బంధువు దగ్గరకు వెళ్లాడు. వారు మందలించడంతో బాలుడిని తీసుకుని నేరుగా మాదాపూర్‌లోని కల్లు కాంపౌడ్‌కి చేరుకున్నాడు.

ఇలా ఛేదించారు
సుమారు మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో స్థానికంగా గాలించినా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో తల్లి మియాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీపీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన మియాపూర్‌ పోలీసులు ఘటనను గోప్యంగా ఉంచి దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్‌ విషయం బయటకు వెల్లడైతే చిన్నారికి ఏదైనా హని తలపెట్టవచ్చన్న అభిప్రాయంతో పోలీసులు సీసీ టీవీ పుటేజ్‌ల ఆధారంగా రాత్రి 8 గంటల ప్రాంతంలో మాదాపూర్‌ కల్లు కాంపౌండ్‌ వద్ద నిందితుడు రాజును గుర్తించి ఆదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలోనూ నిందితుడు రాజు పిల్లవాడి పేరు శ్రీను అని, తన కొడుకు అంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. అప్పటికే సీసీ టీవీ పుటేజ్‌ల ఆధారంగా అతనే నిందితుడిగా గుర్తించడంతో కిడ్నాప్‌ కేసు సుఖాంతమైంది. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. కేసులో కీలకంగా వ్యవహరించిన సీఐ వెంకటేష్‌, ఎస్సైలు రఘురాం, రవికిరణ్‌, సిబ్బంది వెంకట్‌రెడ్డి, యాదగిరి, సుభాష్‌రెడ్డి, షాహేద, విఘ్నేష్‌తో పాటు మాదాపూర్‌ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌, వారి సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. బాలుడి కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు పెద్దఎత్తున పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చి పోలీసులకు అభినందనలు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని