భర్త శవంతో 3 రోజులు ఇంట్లోనే
close

తాజా వార్తలు

Updated : 14/05/2020 07:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భర్త శవంతో 3 రోజులు ఇంట్లోనే

 మృతి చెందినా గుర్తించలేని మానసిక స్థితిలో వృద్ధురాలు

నిజామాబాద్‌ నేరవార్తలు, నిజామాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: ఏడడుగుల బంధాన్ని మృత్యువు అకస్మాత్తుగా తెంచేస్తే ఎంత బాధ! జీవిత భాగస్వామి దూరమైతే ఎంతటి మనోవేదన! కానీ ఆ వృద్ధురాలికి అలాంటి వేదన తెలియని స్థితి. ఇంట్లోనే భర్త మృతి చెందినా తెలుసుకోలేని మానసిక స్థితి ఆమెది. మూడు రోజుల తర్వాత బయటి వ్యక్తులు గుర్తించాక, ఆయన మృతి విషయం వెలుగు చూసింది. నిజామాబాద్‌లో బుధవారం ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విశ్రాంత వీఆర్వో నోముల లింబారెడ్డి (70) తన భార్య శకుంతలతో కలిసి కంఠేశ్వర్‌ న్యూహౌసింగ్‌ బోర్డు కాలనీలో నివసిస్తున్నారు. వీరి కుమారుడు సంతోష్‌ రెడ్డి హైదరాబాద్‌లో, కుమార్తె ఇంగ్లాండులో స్థిరపడ్డారు. కొన్నేళ్లుగా శకుంతల మానసిక పరిస్థితి బాగా లేదు. కరోనా కారణంగా ఎవరి ఇళ్లకు వారు పరిమితమయ్యారు. రోజూ వీరింట్లో పాలు పోసే వ్యక్తి బుధవారం ఉదయం రాగా శకుంతల తలుపులు తీసి బయటకు వచ్చారు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో అతడు ప్రశ్నించినా, ఆమె సరైన సమాధానమివ్వలేదు. పక్కింటి వారు కూడా వెళ్లి అడిగినా స్పష్టత రాలేదు. చివరకు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి, లింబారెడ్డి మృతి చెందినట్లు గుర్తించారు. ఆయన మూడు రోజుల కిందటే అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహంపై గాయాలు లేవని, పోస్టుమార్టం నివేదికలోనూ ఎలాంటి అనుమానాలు వ్యక్తం కాలేదని వారు చెబుతున్నారు. లింబారెడ్డి కుమారుడిచ్చిన ఫిర్యాదులో... తన తండ్రి అనారోగ్యంతో మృతి చెందారని, ఈ విషయంలో ఎవరిపైనా అనుమానాలు లేవని పేర్కొన్నారు. స్థానికులు సమాచారమివ్వడంతో తాను హైదరాబాద్‌ నుంచి వచ్చానని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు రూరల్‌ ఎస్సై ప్రభాకర్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని