బావిలో ఐదు మృతదేహాలు
close

తాజా వార్తలు

Updated : 22/05/2020 09:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బావిలో ఐదు మృతదేహాలు

 మూడేళ్ల చిన్నారి సహా బావిలో 5 మృతదేహాలు

గీసుకొండ: వరంగల్‌ నగర శివారులోని గొర్రెకుంట ప్రాంతంలో ఉన్న ఒక గన్నీ సంచుల గోదాం వద్ద పాడుబడ్డ బావిలో అనుమానాస్పద స్థితిలో ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. మృతుల్లో మూడేళ్ల బాబు కూడా ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి మృతదేహాలను వెలికి తీశారు. మృతులను ఎండీ మక్సూద్‌(50), ఆయన భార్య నిషా(45), కుమార్తె బుస్ర (20), కుమారుడు, మూడేళ్ల మనవడిగా గుర్తించారు. వీరిది ఆత్మహత్యగా భావించి పోలీసులు కేసు విచారిస్తున్నారు. అదనపు డీసీపీ వెంకటలక్ష్మి కథనం ప్రకారం.. ఎండీ మక్సూద్‌ 20 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం నుంచి బతుకుదెరువు కోసం వరంగల్‌కు కుటుంబంతో సహా వలస వచ్చాడు. తొలుత కరీమాబాద్‌ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉండేవారు. డిసెంబరు నుంచి గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని ఓ గన్నీ సంచుల తయారీ గోదాంలో పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వరంగల్‌ నుంచి రాకపోకలకు ఇబ్బందిగా ఉండటంతో.. నెలన్నర నుంచి గోదాంలోనే ఉన్న రెండు గదుల్లో మక్సూద్‌తోపాటు, ఆయన భార్య, ఇద్దరు కుమారులు ఉంటున్నారు. భర్తతో విడిపోయిన కుమార్తె బుస్ర కూడా తన మూడేళ్ల కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ కుటుంబంతోపాటు బిహార్‌కు చెందిన యువకులు శ్రీరాం, శ్యాం కూడా అదే ఆవరణలోని మరో గదిలో నివసిస్తూ గోదాంలో పనిచేస్తున్నారు. పరిశ్రమ యజమాని సంతోష్‌ రోజూలాగే గురువారం మధ్యాహ్నం గోదాంకు వచ్చే సరికి కార్మికులెవరూ కనిపించలేదు. పరిసరాల్లో అన్వేషించినా జాడ లేకపోవడంతో.. పక్కనే ఉన్న పాడుబడ్డ బావిలో చూడగా నాలుగు మృతదేహాలు నీళ్లలో తేలుతూ కనిపించాయి. గీసుకొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ సిబ్బంది వచ్చి ఆధారాలు సేకరించారు. వరంగల్‌ నగరపాలక సంస్థ సిబ్బంది.. విపత్తు నిర్వహణ బృంద సభ్యులు, పోలీసులు కలిసి మృతదేహాలను తాళ్లతో వెలికి తీశారు. శుక్రవారం ఉదయం మరో మృత దేహాన్ని బయటకు తీశారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఆత్మహత్యగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. బావిలో నీరు మొత్తం బయటకు తోడితే ఇంకా ఏమైనా మృతదేహాలు బయటపడొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో బావిలో నీటిని తోడేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఆ ముగ్గురూ ఎక్కడ?
మక్సూద్‌ సహా ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడడంతో పోలీసులు పలు కోణాల్లో విచారణ ప్రారంభించారు. ఆయన కుమారుడితో పాటు, వారితో కలిసి పనిచేసే మరో ఇద్దరు బిహార్‌ యువకులు కనిపించడంలేదు. దీంతో పోలీసులు వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. వారు దొరికితేనే మక్సూద్‌ కుటుంబీకుల మృతికి కారణాలు తెలుస్తాయని చెబుతున్నారు.

బాధాకరం: మంత్రి దయాకర్‌
 హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని గన్నీ సంచుల గోదాం వద్ద బావిలో పడి నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం రాత్రి ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ఈ సంఘటన బాధాకరమన్నారు. ఈ ఘటనను ఇప్పటికే సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇలా ఎందుకు జరిగిందో విచారణ జరిపిస్తున్నామని చెప్పారు. ఎక్కడా ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని జిల్లా కలెక్టర్లను, అధికారులను ఆదేశించామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని