10 నిమిషాలు ఆలస్యమైతే చంపేసేవారే
close

తాజా వార్తలు

Updated : 29/10/2020 08:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

10 నిమిషాలు ఆలస్యమైతే చంపేసేవారే

బండ్లగూడ జాగీర్‌లో వైద్యుడి కిడ్నాప్‌ కేసు సుఖాంతం

ఈనాడు, హైదరాబాద్‌, అనంత నేరవార్తలు, రాప్తాడు

గోర్లను లాగేయడానికి యత్నించారని చూపుతున్న హుస్సేన్‌

పోలీసులు పట్టేస్తారని కిడ్నాపర్లు ఊహించలేదు. బెంగళూరు వైపు వెళ్తుండగా అనంతపురంలో పోలీసు వాహనాలు వెంటాడడం చూసి కంగుతిన్నారు. బాధితుడు తమతో ఉంటే ప్రమాదమని భావించి పది నిమిషాల్లో చంపేస్తామంటూ బెదిరించారు. కళ్లకు గంతలు కట్టి చిత్రహింసలు పెట్టారు. అప్పుడే సినీ ఫక్కీలో ఛేజింగ్‌ చేసి అనంతపురం జిల్లా పోలీసుల సహకారంతో సైబరాబాద్‌ పోలీసులు కిడ్నాపర్ల ఆట కట్టించారు. దంత వైద్యుణ్ని కాపాడగలిగారు. దగ్గరి బంధువే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. 13 మంది నిందితుల్లో ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. వివరాలను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ బుధవారం వెల్లడించారు. రాజేంద్రనగర్‌లోని కిస్మత్‌పూర్‌కు చెందిన దంత వైద్యుడు బెహ్‌జాత్‌ హుస్సేన్‌(56) బండ్లగూడ జాగీర్‌లో క్లినిక్‌లో ఉండగా మంగళవారం మ.1.15 ప్రాంతంలో కిడ్నాప్‌ చేసిన విషయం తెలిసిందే. రూ.10 కోట్లను బిట్‌కాయిన్‌ రూపంలో ఇవ్వకుంటే చంపేస్తామంటూ వైద్యుడి భార్యకు వాట్సాప్‌లో మెసేజ్‌ వచ్చింది. సైబరాబాద్‌ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు అర్ధరాత్రి శంషాబాద్‌ ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌ఛేంజ్‌ దగ్గర దిగి బెంగళూరు వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. అనంతపురం జిల్లా ఎస్పీ సత్యఏసుబాబును అప్రమత్తం చేశారు. వారు ఛేజ్‌ చేసి రాప్తాడులో నిందితుల కారును పట్టుకున్నారు. నలుగురు నిందితుల్లో ముగ్గురు పరారయ్యారు. సంజయ్‌(19) చిక్కాడు. రెండు సీట్ల మధ్య చేతులు, కాళ్లు కట్టేసి బెడ్‌షీట్‌లో చుట్టిన వైద్యుణ్ని బయటకు తీసి ప్రాథమిక చికిత్స అందించారు. సంజయ్‌ సమాచారం మేరకు.. కూకట్‌పల్లి, రెడ్‌హిల్స్‌లో పుణేకు చెందిన సుమిత్‌ చంద్రకాంత్‌ భోంస్లే, అక్షయ్‌ బాలు(24), విక్కీ దత్త షిండే(20), ఫలక్‌నుమా నివాసి మహ్మద్‌ రహీం(18), బీదర్‌కు చెందిన మహ్మద్‌ ఇమ్రాన్‌(21), మహ్మద్‌ ఇర్ఫాన్‌(25)లను అరెస్ట్‌ చేశారు.

 

వ్యాపారంలో నష్టాలు.. ఫ్లాట్‌ అద్దెకు తీసుకుని...

కిడ్నాప్‌కు ప్రధాన సూత్రధారి ముస్తఫా, డాక్టర్‌ హుస్సేన్‌ భార్యకు దగ్గరి బంధువు. వ్యాపారాలు చేసి దివాళా తీశాడు. ముబషీర్‌ అహ్మద్‌ను భాగస్వామిగా చేసుకుని హైదరాబాద్‌, పుణేలో స్థిరాస్తి, హోటల్స్‌ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాడు. కలిసి రాలేదు. డా.హుస్సేన్‌ను కిడ్నాప్‌ చేసి ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నాడు. హుస్సేన్‌ క్లినిక్‌పై ఉన్న ఫ్లాట్లలో ఒకదాన్ని ముస్తఫా దగ్గరుండి తన వ్యాపార భాగస్వామి ఖలీద్‌కు ఇప్పించాడు. రహీంను అందులో ఉంచాడు. కిడ్నాప్‌కు సహకరించాలని పుణేకు చెందిన గణేష్‌, సుమిత్‌, అక్షయ్‌ బాలు, విక్కీ దత్తాను కోరాడు. కూకట్‌పల్లికి చెందిన ఇమ్రాన్‌, అతని సోదరుడు ఇర్ఫాన్‌ వీరితో జత కలిశారు. రహీం ఇచ్చిన సమాచారం మేరకు సుమిత్‌, అక్షయ్‌, విక్కీ, సల్మాన్‌ డాక్టర్‌ను కిడ్నాప్‌ చేశారు. రాత్రి 11 గంటల వరకు కూకట్‌పల్లి ఎల్లమ్మబండలోనే ఉంచారు. తర్వాత బెంగళూరుకు తీసుకెళ్లేందుకు కర్ణాటకలోని ఉడిపికి చెందిన పుణీత్‌, సంజయ్‌, సిరి, పృథ్వీకి అప్పగించారు. వీరిలో ముస్తఫా, గణేష్‌, ఖాలెద్‌, పుణీత్‌, పృథ్వీ, సిరి పరారయ్యారు.

మాటు వేసి... బుధవారం తెల్లవారుజామున 4 నుంచి అనంతపురం పోలీసులు అప్రమత్తం అయ్యారు. జాతీయ రహదారి తపోవనం కూడలిలో ఓ లారీని అడ్డుగా ఉంచారు. ఓ బొలెరో వావానాన్ని ఆపేందుకు యత్నించగా తప్పించుకుపోయింది పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించారు. 2 కి.మీ. తర్వాత కనిపించలేదు. రాప్తాడులో బుక్కచెర్ల గ్రామీణ రోడ్డు వైపు వెళ్లిందని తెలిసి మండల పరిధిలోని అన్ని రోడ్లపై నిఘా వేశారు. బుక్కచెర్ల సమీపంలో వాహనాన్ని గుర్తించారు. పోలీసులను చూసి నలుగురిలో ముగ్గురు కిడ్నాపర్లు వాహనాన్ని వదిలేసి పారిపోగా, ఒకరిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఒక తుపాకీ, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ అనంతపురంలో పోలీసులను చూసి కిడ్నాపర్లు నన్ను చంపేద్దామనుకున్నారు. పది నిమిషాల్లో చచ్చిపోతావంటూ బెదిరించారని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని