దొడ్డిదారిన ఆ చీకటి ఆర్డినెన్స్‌ తెచ్చారు:యనమల
close

తాజా వార్తలు

Published : 10/03/2020 19:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దొడ్డిదారిన ఆ చీకటి ఆర్డినెన్స్‌ తెచ్చారు:యనమల

అమరావతి: ఎన్నికల ప్రక్రియకు, ప్రభుత్వానికి సంబంధం ఏంటని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియ ఈసీ పరిధిలోని అంశమని అన్నారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చీకటి పాలనలో అన్నీ నల్లచట్టాలు, నల్ల జీవోలు, బ్లాక్ డేలేనని వ్యాఖ్యానించారు. ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 211, 212కు చేసిన సవరణలే జగన్ చీకటి పాలనకు నిదర్శనమన్నారు. ఏదో వంకచూపి గెలిచిన అభ్యర్థులపై కక్ష సాధించడానికే ఈ సవరణ చేశారని యనమల ఆరోపించారు. ఎన్నికల పిటిషన్లపై చర్యలు తీసుకోవాల్సింది కోర్టులేనన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేవాళ్లను భయపెట్టడం, ప్రతిపక్షాల అభ్యర్థులను పోటీకి రాకుండా చేసేందుకే ఈ చీకటి ఆర్డినెన్స్ దొడ్డిదారిన తెచ్చారని యనమల దుయ్యబట్టారు. 

వైకాపా ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆర్డినెన్స్ చెల్లదని యనమల అన్నారు. దీనిపై న్యాయస్థానాల్లో తెదేపా సవాల్ చేస్తుందని, ప్రజాక్షేత్రంలోనూ పోరాటం చేస్తుందని తెలిపారు. ఇటువంటి దుర్మార్గ చర్యలకు ప్రజలే బుద్ధి చెప్పాలని, ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను అన్నిచోట్లా ఓడించాలని ప్రజలకు యనమల పిలుపునిచ్చారు. ఈసీ షెడ్యూల్ ప్రకటించాక ఎన్నికలను వాయిదా వేసే అధికారం కలెక్టర్లకు లేదన్నారు. 8 జడ్పీటీసీ, 345 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు ఎలా నిలిపివేస్తారని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవలేమనే ఉద్దేశంతోనే వైకాపా నేతలు వాయిదా వేయించారని ఆక్షేపించారు. ప్రభుత్వం చేతిలో కలెక్టర్లు పావులుగా మారారని వ్యాఖ్యానించారు. 66 మండలాల్లో బీసీలకు ప్రాతినిధ్యం లేకుండా చేశారని మండిపడ్డారు. ఇలాంటి అరాచక పాలన రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేదని.. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని యనమల విజ్ఞప్తి చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని