
తాజా వార్తలు
మంత్రి జగదీశ్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ లేఖ
హైదరాబాద్: కరోనా వైరస్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రభుత్వాసుపత్రుల్లో పడకల సామర్థ్యాన్ని పెంచాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆయన లేఖ రాశారు. కోదాడలోని 30 పడకల ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా మార్చాలని.. హుజూర్‌నగర్‌లోని 100 పడకల ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా మార్పు చేయాలని విజ్ఞప్తి చేశారు.
నాగార్జునసాగర్‌లో 30 పడకల ప్రభుత్వాసుపత్రిని 100 పడకలు చేయాలని కోరారు. దేవరకొండలో 100 పడకల ఆస్పత్రికి అనుమతులు మంజూరైనప్పటికీ రెండంతస్తులే నిర్మాణమైందని.. మరో అంతస్తును పూర్తి చేయాలని మంత్రికి ఉత్తమ్ వివరించారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, దేవరకొండ ప్రభుత్వాసుపత్రులకు ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు.