‘భూములిచ్చిన రైతులకు లాఠీ దెబ్బలా?’
close

తాజా వార్తలు

Updated : 30/05/2020 11:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘భూములిచ్చిన రైతులకు లాఠీ దెబ్బలా?’

తెదేపా అధినేత చంద్రబాబు

అమరావతి: రాజధానికోసం భూములు ఇచ్చిన రైతులు లాఠీ దెబ్బలు తిన్న ఘటన దేశ చరిత్రలోనే లేదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైకాపా ఏడాది పాలనపై ట్విటర్‌ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. అవివేక నిర్ణయాలతో నమ్మిన ప్రజలనే జగన్‌ నట్టేట ముంచారని మండిపడ్డారు. రైతులు, పేదలు, మహిళలు, రైతు కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, యువత... ఇలా అన్ని వర్గాల ప్రజలను రోడ్డెక్కించారని ధ్వజమెత్తారు. కొత్త ప్రభుత్వం, అనుభవం లేని ముఖ్యమంత్రి కాబట్టి ఆరు నెలల వరకు ప్రభుత్వానికి సహకరించాలని అనుకున్నా.. తొలి రోజు నుంచే అరాచకాలు మొదలుపెట్టారని దుయ్యబట్టారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టిన విధ్వంసాన్ని ఏడాది మొత్తం యథేశ్చగా సాగించారని ఆక్షేపించారు. సమాజానికి చెడు చేసే చర్యలను, ప్రజా వ్యతిరేక పాలనను తెలుగుదేశం పార్టీ సహించదని తేల్చిచెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలమయ్యారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది కుటుంబాలు 164 రోజులుగా అమరావతి పరిరక్షణ కోసం చేస్తున్న ఆందోళనలే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. రాజధాని అమరావతి రైతుల పట్ల పోలీసుల దాడులకు సంబంధించిన వీడియోను చంద్రబాబు తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇటు న్యాయం కోసం అమరావతి ప్రజలు, అటు విశాఖలో విషవాయువు బాధితులు, మరో వైపు కరోనాతో కర్నూలు వాసులు, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు లేక రైతులు, ఉపాధి కోల్పోయిన నిర్మాణ కార్మికులు, పెట్టుబడులు  వెనక్కిపోయి ఉద్యోగాలు లేని యువత ఉంటే... ఇన్ని విషాదాల్లో ఏడాది పాలన ఉత్సవాలా? అని చంద్రబాబు మండిపడ్డారు. ఇకనైనా బాధ్యతగా పనిచేయాలని హితవు పలికారు. 

నడి రోడ్డు మీద గోడకట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దుయ్యబట్టారు. అన్నం పెట్టే అన్న క్యాంటీన్‌ మూసేసి.. పేదవాడి కడుపుపై తన్నారని ఆక్షేపించారు. మాట తప్పను, మడమ తిప్పను వంశానికి వారసుడినని చెప్పుకునే జగన్‌... ఏడాదిలో రాష్ట్రానికి వైకాపా రంగులు వెయ్యడం తప్ప ప్రజలకు చేసింది శూన్యమని తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. నవరత్నాల పేరుతో నవమోసాలకు పాల్పడి, ఇచ్చిన ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన ప్రజావేదిక కూల్చివేత నుండి సామాన్యుడిపై కరెంటు బిల్లుల మోత వరకు ఒక్క ఏడాదిలో రాష్ట్రాన్ని కల్లోలం చేసి, విధ్వంసానికి నిర్వచనంగా జగన్‌ నిలిచారని మండిపడ్డారు.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని