అంబులెన్స్‌లో వచ్చి ఓటేసిన ఎమ్మెల్యే
close

తాజా వార్తలు

Updated : 19/06/2020 19:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంబులెన్స్‌లో వచ్చి ఓటేసిన ఎమ్మెల్యే

కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల పోలింగ్

సాయంత్రం ఫలితాల వెల్లడి

దిల్లీ:  దేశంలోని పలు రాష్ట్రాల్లో  రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకొనేందుకు ఆయా ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం 8 రాష్ట్రాల్లోని 19 స్థానాల్లో ఈ రోజు ఉదయం 9గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 4గంటల వరకు ఈ పోలింగ్‌ కొనసాగనుంది. సాయంత్రం 5గంటలకు లెక్కింపు ప్రారంభమై.. 6గంటలకు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డితో పాటు మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎమ్మెల్యేలు ఓటు  హక్కు వినియోగించుకుంటున్నారు.

ఏ రాష్ట్రంలో ఎన్ని స్థానాలకు?

ఏపీ, గుజరాత్‌లలో చెరో నాలుగు స్థానాల్లో ఈ ఎన్నికలు జరుగుతుండగా.. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో చెరో మూడు, జార్ఖండ్‌లో రెండు, మణిపూర్‌, మిజోరం, మేఘాలయాలలో ఒక్కో స్థానానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో భాజపా, కాంగ్రెస్‌ మధ్య తీవ్రమైన పోటీ కొనసాగుతోంది. 


 

నాలుగు స్థానాలు మావే.. వైకాపా ధీమా

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన నాలుగు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉండటంతో పోలింగ్‌ అనివార్యమైంది. ఈ నాలుగు స్థానాలకు వైకాపా నుంచి నలుగురు తెదేపా నుంచి ఒకరు బరిలో ఉన్నారు. అయితే, మెజార్టీ తమకే ఉందని, నాలుగు స్థానాలనూ తామే కైవసం చేసుకుంటామని వైకాపా నేతలు విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. 

అంబులెన్స్‌లో వచ్చి ఓటేసి..

గుజరాత్‌లోని మతర్‌ నియోజకవర్గానికి చెందిన భాజపా ఎమ్మెల్యే కేసరిసిన్హ జసంగ్‌భాయ్‌ సోలంకి అనారోగ్య కారణాల వల్ల ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నప్పటికీ.. అంబులెన్స్‌లో అసెంబ్లీ వద్దకు వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్‌, భాజపా మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడంతో ఇరు పార్టీలూ తమ ఎమ్మెల్యేలను హోటళ్లలో ఉంచాయి. దీంతో ఈ రోజు ఉదయం భాజపా ఎమ్మెల్యేలు ఓటేసేందుకు బస్సుల్లో వచ్చారు. 

దేశ వ్యాప్తంగా 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 37 స్థానాలకు అభ్యర్థులు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. మిగిలిన రాష్ట్రాల్లోని స్థానాలకు మార్చి 26న ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని