close

తాజా వార్తలు

ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..

 రైలు ప్రమాదంలో నాన్న మృతి

అనాథలైన ఇద్దరు ఆడపిల్లలు


పిల్లలను ఓదార్చుతున్న బంధువులు

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: తల్లిదండ్రుల ప్రేమానురాగాలకు ఆ బిడ్డలు ఎంతో అదృష్టవంతులమంటూ పొంగిపోయారు. వారి ఆశయానికి అనుగుణంగా ఉన్నత చదువులు అభ్యసించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడి కుటుంబానికి అండగా ఉండాలనే లక్ష్యంతో కష్టపడి చదువుతున్నారు. విధి మరోలా తలిచింది. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఆ కుటుంబాన్ని ముక్కలు చేసింది. పిల్లలకు చెప్పకుండా అమ్మ ఎక్కడికో వెళ్లిపోయింది. అన్నీ తానై సాకుతున్న తండ్రిని దేవుడు అర్ధాంతరంగా తీసుకుపోవడంతో ఆ పిల్లలు అనాథలయ్యారు. నాన్న రాలేడు.. అమ్మరాదు.. ఇక మాకు దిక్కెవరంటూ విలపిస్తున్న వారిని ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. పార్వతీపురం స్టేషన్‌ సమీపంలో గూడ్స్‌రైలు ఢీకొట్టడంతో క్రైస్తవ మత ప్రచారకుడు బుధవారం అర్ధరాత్రి మృతిచెందిన ఘటన చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు గురువారం అందించిన వివరాల ప్రకారం.. మండలంలోని కోటవానివలస గ్రామానికి చెందిన అర్తాపు జయరాజ్‌(44) స్టేషన్‌ వద్ద ఫుట్‌పాత్‌ దాటుతుండగా గూడ్స్‌రైలు డీకొట్టింది. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆర్‌పీ హెచ్‌సీ ప్రకాశరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కష్టం తెలియకుండా పెంచారు

తల్లిలేని లోటు, కష్టం అంటే ఏమిటో తెలియకుండా పిల్లలను పెంచారు జయరాజ్‌. పెద్దమ్మాయి ఇంటర్‌ బైపీసీ, చిన్నకూతురు ఎనిమిదో తరగతి చదువుతోంది. ఇంటి పనులన్నీ పూర్తిచేసి పిల్లలను చదువుకొనేందుకు పంపించి తను మతప్రచారానికి వెళ్లేవారు. అందరి వద్ద మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తమకోసం దేవుడు నాన్నని అమ్మగా మార్చి ఇచ్చాడని పిల్లలు కుదుట పడుతున్నంతలోనే విధి మరోలా తలిచింది. మృత్యువు రైలు రూపంలో జయరాజ్‌ని పట్టుకుపోయింది. విషయం తెలిశాక పిల్లలు కుప్పకూలిపోయారు. తల్లి లేని కుటుంబంలో అంధకారం చొరబడితే తండ్రి దీపమై వెలుతురు పంచుతున్నాడు...అంతలోనే మళ్లీ కారుచీకట్లలోకి దేవుడు నెట్టేశాడంటూ కన్నీరుమున్నీరు అవుతున్నారు. నా అన్నవారు ఎవరూలేరు. చిన్నప్పుడే నాన్నమ్మ, తాతయ్య తనువు చాలించారు. తల్లి ఉన్నా...లేనట్లే...అన్నీ తానైన తండ్రి దేవుని వద్దకు వెళ్లిపోయాడు. మమ్మల్ని ఎవరు పెంచుతారు, మాకు ఎవరు దిక్కు అంటూ ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక అంతా మౌనంగా రోదిస్తున్నారు.

ఆ మాటలే ఆఖరివి...
బుధవారం రాత్రి భోజనాలు చేశాక అమ్మా ఊరెళ్లి వస్తాను. చెల్లి జాగ్రత్త. త్వరగా నిద్రపోయి త్వరగా లేచి చదువుకోండని చెప్పారు. ఆ రాత్రే ఆఖరని, ఆ మాటలు, చూపులే చివరివి అవుతాయను కోలేదంటూ పిల్లలు తలచుకొని రోదిస్తుంటే ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. పిల్లల భవిష్యత్తు ఏమిటో అర్థం కావడం లేదని బంధువులు, స్నేహితులు కన్నీరు విడుస్తున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.