close

తాజా వార్తలు

Published : 19/01/2020 06:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మూడో కన్ను

- గండ్రకోట సూర్యనారాయణ శర్మ

శంకరయ్య మాట్లాడలేదు. కదలకుండా అలాగే మౌనంగా చాలాసేపు కూర్చుండి పోయాడు. ‘తండ్రి ఏం సమాధానమిస్తాడా?’ అని కొద్దిసేపు ఎదురుచూసిన కొడుకు ‘‘ఏంటి నాన్నా, మాట్లాడవు... ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తావు చెప్పు? అక్కడికొస్తే నీ బాగోగులు చూడటానికి నేనూ మీకోడలూ ఉంటాం. మనవడూ మనవరాళ్లతో నీకూ కాలక్షేపమౌతుంది. ఇక్కడ ఒంటరిగా ఉండటమెందుకు?’’ అన్నాడు.
పక్కింటి పెద్దరామయ్య, ఎదురింటి రంగయ్య, అదే వీధిలో ఉండే కాంతమ్మ, పనిమనిషి లచ్చిందేవి అక్కడే వసారాలో ఓ పక్కగా కూర్చుని ఉన్నారు.
పెద్దరామయ్య కల్పించుకుని ‘‘నిజమే శంకరయ్యా, నీ కొడుకు చెప్పింది నాకైతే సబబుగానే అనిపిస్తోంది. ఇక్కడ మేమంతా ఉన్నా, భార్య పోయిన ఇలాంటి సమయంలో నీ వాళ్లతో ఉండటమే సరైన పని’’ అన్నాడు.
‘‘అది కాదు బాబాయ్‌...’’ అంటూ శంకరయ్య ఆయనతో ఏదో చెప్పబోతుండగా రంగయ్య కల్పించుకుని ‘‘బావా, తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా విదేశాలకు చెక్కేసే కొడుకులున్న ఈ రోజుల్లో ఇంత ప్రేమ చూపించే ఇలాంటి కొడుకు ఉండటం నీ అదృష్టం’’ అన్నాడు.
‘‘అవును శంకరం. ఇక ఏమీ ఆలోచించకు. నీ కొడుకు చెప్పినట్లు చెయ్యి’’ అంది కాంతమ్మ.
‘‘అట్లా చెప్పండత్తా. మీరంతా చెపితేగానీ మాట వినేట్లు లేడు నాన్న’’ అన్నాడు శంకరయ్య కొడుకు.
అందరి మాటలూ విన్నాక ఒక దీర్ఘశ్వాస వదిలి ‘‘సరే. అందరూ ఇంతలా చెప్తున్నారు కాబట్టి వెళ్తాను.
కానీ నాకేమాత్రం నచ్చకపోయినా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండను’’ అన్నాడు శంకరం.
‘‘అట్టాగేలే అయ్యా. ముందైతే నువు బయలెల్లు’’ అంది లచ్చిందేవి.
ఆ రాత్రే శంకరయ్య కొడుకు వెంట పట్నానికి బయల్దేరాడు.
*            *
శంకరయ్య మొదట్లో నగరంలోనే ఉండేవాడు. ఆ రోజుల్లో ఆ నగరంలో ఒకే ఒక పెద్ద ప్రభుత్వాసుపత్రి ఉండేది. అది కాకుండా ఆ ఊర్లో చిన్నాచితకా డాక్టర్లు ఉన్నా ఆ పెద్దాసుపత్రికే అందరూ వచ్చేవాళ్ళు.
అంత పెద్ద ఆసుపత్రిని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నది ఒక డాక్టరమ్మ. ఆవిడ పేరుమోసిన గైనకాలజిస్టు. ఆవిడ హస్తవాసి మంచిదని పేరు ఉండటంతో చాలామంది ఆవిడ దగ్గరికే వచ్చేవాళ్ళు. అయితే ఉచితంగా వైద్యం చెయ్యాల్సిన ఆవిడ... ఎంతో కొంత సమర్పించుకోనిదే పేషెంట్‌ నాడి పట్టేది కాదు. అవసరం ఉన్నా లేకున్నా సిజేరియన్‌ ఆపరేషన్లు చేసేది. నలభై దాటిన వాళ్ళు ఏదైనా సమస్యతో వస్తే, వారిని లేనిపోని భయాలకు గురిచేసి, వారి గర్భసంచి తొలగించేసి డబ్బు గుంజేది. దాంతో ఆవిడ పర్సు ఎప్పుడూ రాణిగారి అంతఃపురంలా కళకళలాడుతుండేది.
ఆ ఆసుపత్రి మార్చురీ దగ్గర అటెండర్‌ శంకరయ్య. డబ్బుల్లేక వైద్యం సరిగ్గా అందని పేషెంట్‌ బక్కెట్‌ తన్నేస్తే సదరు శవాన్ని చూడాలన్నా, దాన్ని వారి బంధువులకి అప్పగించాలన్నా శంకరయ్య చెయ్యి తడపనిదే పనయ్యేదికాదు. లేకుంటే రోగుల తాలూకువారి రోగం కుదిరిందే. అందుకని ఎంత కష్టమైనా సరే, ప్రతి ఒక్కరూ తమ మనసుల్లో శాపనార్ధాలు పెడుతూనే శంకరయ్య అడిగినంత అతడి చేతిలో పోసేవారు. ఒకసారి ఆ డాక్టరమ్మ కబురు చెయ్యటంతో వెళ్ళి ఆమెను కలిశాడు. ఆ సమయంలో ఆమె దగ్గర ఒక ఆగంతకుడున్నాడు. ఇతడు లోపలికి రాగానే ఆ డాక్టరమ్మ ‘‘చూడు శంకరయ్యా, ఇతను నాకు బాగా కావలిసినవాడు. ఇతనికేం కావాలో చూడు’’ అని చెప్పి, ఆ వ్యక్తితో ‘‘మా శంకరయ్యతో మాట్లాడు’’ అని పంపింది.
బయటికొచ్చాక అతడు శంకరయ్యతో ‘‘మార్చురీకొచ్చే వాటిలో అనాథశవాల్ని నాకు ఇస్తే శవానికి ఇంత అని నీకు కొంత డబ్బు ముట్టజెపుతా’’ అనటంతో అతడికి ఆశ పుట్టింది. అతడు చెప్పిన మొత్తం దాదాపు తన జీతమంత ఉండటంతో ఆలోచనలో పడ్డాడు.
కానీ అంతలోనే అనుమానం వచ్చి ‘‘నువ్వేం చేసుకుంటావ్‌ శవాన్ని? అయినా శవాలకు ఒక లెక్క ఉంటుంది. ఎవరైనా పెద్దాఫీసర్లు వచ్చి అడిగితే లెక్క చెప్పాలి’’ అనడిగాడు.
‘‘అదంతా మీ డాక్టరమ్మా నేనూ చూసుకుంటాం. శవాన్ని నేనేం చేసుకుంటే నీకెందుకు? నీకు డబ్బు కావాలంటే మీ డాక్టరమ్మ చెప్పినట్లు చెయ్యి’’ అని అనటంతో సరేనని ఒప్పుకున్నాడు. దాంతో అనాథ శవాలు వచ్చినప్పుడు వాటిని మాయం చేసేవాడు. ఎవరైనా అడిగితే ఎవరో వచ్చి తీసికెళ్ళినట్లు రికార్డుల్లో చూపించేవాడు. ఆ రోజుల్లో ఈ విషయాన్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోకపోవటం అతనిపాలిట వరమయింది. అలా తన జీతంకన్నా శవాల అమ్మకంలోనే శంకరయ్య బాగా డబ్బు సంపాదించాడు. అతని అదృష్టంకొద్దీ అందమూ అణకువా రెండూ కలిగిన భార్య వచ్చింది. ఆమె నవ్వు చూస్తే చాలు పరవశించిపోయేవాడు. ఏనాడూ ఒక్కమాట కూడా అతనికి ఎదురు చెప్పలేదామె. ఒకవేళ చికాకులో అతడు విసుక్కున్నా ఆమె చిరునవ్వే సమాధానమయ్యేది. దాంతో అతడామెను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు.
పెళ్ళైన సంవత్సరంలోపే పండంటి బిడ్డను ఆమె అతడికి కానుకగా ఇచ్చింది. తండ్రి తలలోంచి ఊడిపడ్డాడా అన్నట్లుండే ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యేకొద్దీ తల్లి లక్షణాలను పుణికిపుచ్చుకున్నాడు. అందుకే ఆసుపత్రి దాటి బయటికొచ్చాడంటే అతడికి తన ఇల్లే లోకమయ్యేది. భార్య ఎప్పుడు ఏదడిగినా తీర్చేవాడు. కానీ తనతో ఏదైనా గుడికి రమ్మని ఆమె అడిగితే మాత్రం ‘గుడికా? నువ్వెళ్ళు. నాకు ఈ దేవుళ్ళూ, దయ్యాలూ అంటే ఆట్టే నమ్మకం లేదు’ అనేవాడు. ఆమె నొచ్చుకున్నట్లు కనిపించినా ఏమీ మాట్లాడకుండా తన కొడుకుని తీసుకుని వెళ్ళిపోయేది.
చేసింది అటెండర్‌ ఉద్యోగమైనా పై సంపాదన బాగా ఆర్జించి, డబ్బు బాగానే వెనకేశాడు. తను అమితంగా ప్రేమించే తన భార్యాబిడ్డలకోసం లేదనకుండా డబ్బు ఖర్చు చేసేవాడు. పట్నంలో ఖరీదైన ఇల్లు కొనుకున్నాడు. కొడుకుని బాగా చదివించాడు.
తాను రిటైరయ్యాక కాలుమీద కాలేసుకుని బతికేలా తను పుట్టి పెరిగిన ఊరిలో పదెకరాల పొలం కొని దాన్ని కౌలుకిచ్చేశాడు. కొడుక్కి మంచి సంబంధం చూసి పెళ్ళి చేశాడు. కొడుకు ఉద్యోగంలో చేరే సమయానికి అతడు రిటైరైపోయాడు.
ముందుగా అనుకున్నట్లుగానే భార్యతో కలిసి తన ఊరికి చేరుకున్నాడు. కావటానికి ఊరు చిన్నదే అయినా ఇరుగూ పొరుగు ఒకర్నొకరు మామయ్యా, బాబాయ్‌, బావా, అత్తా అంటూ వరసలు కలుపుకుంటూ అపురూపంగా పలకరించుకునే పల్లెటూరు. తనకొచ్చే పెన్షన్‌ తక్కువే అయినా తను వెనకేసిన డబ్బుతో తన భార్యతో హాయిగా కాలం వెళ్లబుచ్చసాగాడు.
ఒకరోజు ఉన్నట్లుండి భార్యకి గుండెనొప్పి రావటంతో ఆమెను పట్నానికి తీసుకెళ్లాల్సి వచ్చింది. కానీ పట్నం నుంచి అంబులెన్స్‌ చాలా ఆలస్యంగా రావటంతో, హాస్పిటల్‌కి చేరేలోపే ఆమె తుదిశ్వాస విడవటంతో జీవితంలో మొట్టమొదటిసారిగా కోలుకోలేని దెబ్బ తగిలింది శంకరయ్యకి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య పోవటంతో అతడు చాలా కుంగిపోయాడు. తన దగ్గర కావాల్సినంత డబ్బుండీ ఆమెను దక్కించుకోలేకపోయినందుకు కుమిలిపోయాడు. ఒక్కసారి ఉన్నట్లుండి పాతికేళ్ళ వయసు పెరిగిపోయినట్లుగా డీలా పడిపోయాడు. అడవిలో తిరిగే క్రూరమైన పులిలాంటి మనిషి అమాంతంగా స్తబ్దుగా ముసలి సర్కస్‌ పులిలా మారిపోయాడు.
తల్లి అంత్యక్రియలయ్యాక తండ్రిని తీసుకుని పట్నానికి బయల్దేరదీశాడతని కొడుకు. కొద్దిరోజుల తర్వాత శంకరయ్య ఆ ఊళ్ళో తన పేరున ఉన్న ఇంటినీ, పొలాన్నీ అమ్మేసి, ఆ డబ్బుని తన బ్యాంక్‌ ఖాతాలో వేసుకున్నాడు.


* * *

రోజూ ఉదయం కొడుకుతో కలిసి గంటసేపు పార్కులో వాకింగ్‌ చేసేవాడు శంకరయ్య.
ఆ తర్వాత కొద్దిసేపు అక్కడే ఒక చప్టామీద కూర్చుని ఏదో ఒకటి మాట్లాడేవాడు.
కోడలు మామగారికి ఏ లోటూ లేకుండా అన్నీ ఏర్పాట్లూ చేసి ఆఫీసుకెళ్ళేది.
స్కూలునుంచి వచ్చిన పిల్లలు, సాయంత్రం పూట దగ్గర్లో ఉన్న పార్కుకు తీసుకెళ్ళేదాకా తాతని వదిలిపెట్టేవారు కారు.
వాకింగు నుంచి వస్తూ వస్తూ పాల ప్యాకెట్‌ తీసుకొచ్చేవాడు శంకరయ్య. ఆ సమయానికల్లా అతని కోడలు స్నానాదికాలు పూర్తి చేసుకుని, తన మామగారికి టీ ఇచ్చేసి, వంటకు ఉపక్రమించేది. తొమ్మిదయ్యేసరికల్లా పిల్లల స్కూల్‌ బస్సు వచ్చేది. వాళ్ళటు వెళ్లగానే కొడుకూ కోడలూ ఆఫీసులకి బయల్దేరేవారు. ఇక అప్పటినుంచీ శంకరయ్యకి ఏమీ తోచేది కాదు. అలా రెండ్రోజులపాటు ఇంట్లో ఒంటరిగా గడిపాడు. మూడోరోజు అందరూ వెళ్ళిపోగానే కొద్దిసేపు టీవీ చూసి, పది నిమిషాలు గడిచేసరికి విసుగుపుట్టి, దాన్ని కట్టేసి ఇల్లు తాళమేసి బయటికొచ్చాడు.
అతడి కాళ్ళు ఆటోమాటిగ్గా అతడ్ని అతడు పనిచేసిన ఆసుపత్రివైపు తీసుకెళ్ళినాయి. ప్రభుత్వాసుపత్రుల ప్రభ తగ్గి కార్పొరేట్‌ ఆసుపత్రుల హవా నడుస్తుండటం చూసి ‘హుఁ! అంతా కలికాలం’ అనుకున్నాడు. అక్కడ ఒక వార్డుబాయ్‌ మాటల్లో తాను పనిచేసినప్పటి డాక్టరమ్మ ఇల్లు ఆ దగ్గర్లోనే ఉందని తెలిసింది. ఒకసారి ఆవిడని కలుద్దామని, ఆమె ఇంటి అడ్రసు తీసుకుని, ఆ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు.
గేటుదగ్గర అతన్ని చూసిన ఆరడుగుల అల్సేషియన్‌ కుక్క ‘భౌ’మంటూ ఒక్కసారిగా అతని మీదకు ఎగబడింది. అంతలోనే లోపల్నుంచి ‘సుల్తాన్‌’ అంటూ ఎవరో పిలవటంతో ఆగిపోయింది. ఒక పాతికేళ్ల అమ్మాయి వచ్చి ‘‘ఎవరు కావాలి?’’ అని అడిగింది.
శంకరయ్య తనని పరిచయం చేసుకుని, డాక్టర్‌గారిని చూద్దామని వచ్చానని చెప్పటంతో ఆవిడ ‘‘ఓ... అమ్మా, తను ఇప్పుడు హాస్పిటల్లో ఉంది’’ అని చెప్పింది.
‘‘ఏ హాస్పిటలండీ?’’ అడిగాడు.
ఆమె ఒక కార్పొరేట్‌ హాస్పిటల్‌ పేరు చెప్పటంతో ‘‘సరేనండీ. నేను వారిని అక్కడే కలుస్తాను’’ అన్నాడు.
‘‘ఇప్పుడు చూడనివ్వరు. సాయంత్రం ఐదింటికి వెళ్ళు’’ అందామె.
‘‘ఓహో... ఇప్పుడు వెళితే మేడం పేషెంట్లతో బిజీగా ఉంటారా?’’ అనడిగాడు.
‘‘అమ్మ ఇప్పుడక్కడ డాక్టర్‌ కాదు.
పేషెంట్‌. ఐసీయూలో ఉంటుంది. సాయంత్రం ఐదింటికెళ్ళు’’ అని చెప్పి లోపలికెళ్ళిపోయిందా అమ్మాయి.
ఒక్క క్షణం ఆమె మాటలు అతనికి అర్ధం కాలేదు. అర్ధమయ్యి ‘ఆమెకేమైంద’ని అడిగేలోపే ఆమె లోపలికెళ్ళిపోయింది.
ఆ సాయంత్రం అతడు డాక్టర్‌గారి అమ్మాయి చెప్పిన ఆసుపత్రికి వెళ్ళాడు. శంకరయ్యని చూడగానే ఆవిడ కళ్ళు ఎందుకో తెలీదుగానీ వింతగా మెరిశాయి. నిజానికి అప్పట్లో వాళ్ళిద్దరి మధ్య అంత అనుబంధమేమీ లేకపోయినా ఆ సమయంలో శంకరయ్యని చూడటం ఆమెకెంతో ఆనందాన్నిచ్చింది.
‘‘నువ్వూ... శంకరయ్యవి కదూ... రారా... ఎట్లా ఉన్నావ్‌? ఏంచేస్తున్నావ్‌?’’ అంటూ ఆవిడ ఆత్మీయంగా పిలిచేసరికి శంకరయ్య పొంగిపోయాడు. ఐదున్నర అడుగుల ఎత్తు, గులాబిరంగు దేహంతో అచ్చు సినిమా హీరోయిన్‌లా ఉండే ఆమె... ఇప్పుడు ముఖమంతా పీక్కుపోయి, బెడ్‌కు అతుక్కుపోయి శవంలా ఉండటం చూసి అతడి గుండె తరుక్కుపోయింది.
‘‘ఏంటి మేడమ్‌, ఇలా అయిపోయారు?’’ అన్నాడు గద్గద కంఠంతో.
ఆమె బలహీనంగా నవ్విందే కానీ సమాధానమివ్వలేదు.
‘‘ఇల్లు కనుక్కుని వెళితే మీ పాప కనిపించింది. చాలా పెద్దదయింది. తనే చెప్పింది మీరు ఇక్కడున్నారని. బాబూ, సారూ ఎక్కడ?’’ అంటూ చుట్టూ చూశాడు.
ఆమె చిన్నగా నిట్టూర్చి ‘‘ఆయన పోయి ఐదు సంవత్సరాలయింది. అబ్బాయి విదేశాల్లో పెద్ద డాక్టరు. వాడికిక్కడికి వచ్చే తీరిక లేదు. ఇక అమ్మాయికి- దాని సంసారం, దాని లోకమేదో దానిది. ఎప్పుడో ఒకసారి మొక్కుబడిగా వచ్చి పోతుంటుంది’’ అంది బాధగా.
‘‘ఏం ఫర్వాలేదు మేడమ్‌, మీకు తగ్గిపోతుంది’’ అన్నాడతడు అనునయంగా.
ఆమె విరక్తిగా నవ్వి ‘‘నయంకాని మాయరోగమేదో కమ్మి నేను ఇక్కడొచ్చి పడ్డాను. కలియుగ లక్షణమేమిటంటే మనిషి ఈ లోకంలో చేసే పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని ఇక్కడే అనుభవించాలి, తప్పదు. డబ్బు కోసం నేనెన్ని అకృత్యాలు చేశానో, ఎంతమంది అభాగ్యులను పీడించానో నాకు తెలుసు. చివరకు శవాలతోకూడా వ్యాపారం చేశాను.
ఆ పాపం ఊరికే పోతుందా? దాని ఫలితమే ఇదిగో ఇలా ఈ ఐసీయూలో వచ్చి పడ్డాను. ఈ ఐసీయూ అనే అక్షరాలు చూసినప్పుడల్లా నాకు ఆ భగవంతుడు నాతో ‘నీ జీవితంలో నువ్వు చేసిన పాపపు పనులన్నీ నేను చూస్తూనే ఉన్నాను... ఐ సీ యూ’ అని అన్నట్లనిపిస్తుంది. నీకో విషయం తెలుసా... గత ఆరు నెలల్లో నన్ను చూడటానికి వచ్చింది నువ్వొక్కడివే’’ అంది. ఆవిడ కనుకొలకుల్లోంచి రెండు కన్నీటి బొట్లు జారిపడ్డాయి.
‘‘అయ్యో, బాధపడకండి మేడమ్‌... అన్నీ సర్దుకుంటాయ్‌. మీరు మళ్ళీ మామూలుగా అయిపోతారు’’ అన్నాడు అతడు ఓదార్పుగా.
ఆమె తల అడ్డంగా ఊపుతూ ‘‘ఇప్పుడు నాకు బతకాలనే ఆశ కూడా ఏమీ లేదు.
ఆ రోజుల్లో సంపాదన అంటే డబ్బు ఒక్కటే అనుకుని పొరబడ్డానే కానీ అంతిమ క్షణాల్లో ‘నా’ అనే వాళ్ళను నలుగుర్ని సంపాదించుకోవటమే అని తెలుసుకోలేకపోయాను. అది తెలిసివచ్చే సమయానికి అంతా అయిపోయింది. కనీసం నువ్వైనా వచ్చావు నన్ను చూడటానికి. థాంక్యూ’’ అంది.
మరికొద్దిసేపు ఆమెతో మాట్లాడాక ఆ ఆసుపత్రినుంచి బయటపడ్డాడతడు. ‘ఐ సీ యూ... నేను నిన్ను చూస్తూనే ఉన్నాను’ అని దేవుడు అన్నట్లుగా ఆవిడ చెప్పిన మాటలు అతడి చెవిలో మారుమోగుతున్నాయి. ‘నిజంగా దేవుడు ఉన్నాడా? ఉండి మనిషి చేసే ప్రతి పనినీ చూస్తున్నాడా? అంటే తను చేసిన పనులు కూడా చూశాడా? మరి తానెలా సంపాదించాడు? ఎంతమందిని పీల్చి పిప్పి చేశాడు. ఎన్ని శవాల దగ్గర డబ్బులు వసూలు చేశాడు. ఆ పాపమే తనని చుట్టుముట్టిందా? వాళ్ళందరి ఉసురు తగిలే తన భార్య చనిపోయిందా?’ ఆ మాట తలుచుకునేసరికి అతడి వెన్నులోంచి చలి మొదలైంది.
‘రేపు తన గతీ ఇంతేనా? చేసిన పాపం చెపితే పోతుందా... లేక ప్రాయశ్చిత్తం చేసుకోవాలా?’ ఇలాంటి ఆలోచనలతో అతడికి పిచ్చెక్కినట్లైంది.
అతడు తిండి సరిగ్గా తినకపోవటం కోడలు గ్రహించి భర్తకి చెప్పింది. దాంతో అతడు రెండు మూడురోజులపాటు తండ్రి వాలకాన్ని గమనించి ‘‘ఎందుకలా ఉన్నావు నాన్నా, ఆరోగ్యం బాగాలేదా?’’ అనడిగాడు. అదేమీ లేదనీ తాను బాగానే ఉన్నాననీ బుకాయించాడతడు.
ఇంట్లో ఒంటరిగా ఉంటే తను శవాల దగ్గర నిలబడి వాటి తాలూకు చుట్టాలను డబ్బులడగటం గుర్తుకొచ్చేది. కళ్ళు మూసుకుంటే చాలు... శవాలు కనిపించేవి. ఉన్నట్లుండి అవి లేచి కూర్చున్నట్లూ తన చుట్టూ తిరుగుతూ నాట్యం చేస్తున్నట్లూ అనిపించి అతడి గుండెలు గుబగుబలాడిపోయేవి. అప్పట్నుంచి గుళ్ళూ గోపురాలూ తిరగటం మొదలుపెట్టాడు. పూజలూ పునస్కారాలూ చేయించటం మొదలుపెట్టాడు. మాటిమాటికీ బెడ్‌కి అతుక్కుపోయిన ఆ డాక్టరమ్మ అన్న మాటలే గుర్తుకొచ్చేవి. అర్ధరాత్రిళ్ళు ఉలిక్కిపడి లేచి కూర్చునేవాడు. ఇలాగే ఉంటే కొద్దిరోజుల్లో తనకి పిచ్చెక్కటం ఖాయమని అతడికి అర్థమైపోయింది. కానీ ఏం చెయ్యాలో తెలియలేదు.
* * *
ఆ కాలనీలో ఎవరో చనిపోయారని తెలియటంతో శంకరయ్య కొడుకూ కోడలూ వెళ్తూ అతన్ని కూడా రమ్మని పిలిచారు.
మొదట రానని చెప్పినా, మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో వాళ్ళ వెనకే నడిచాడు. అక్కడికెళ్ళాక అతన్ని ఏదో ఆవహించినట్లు ముందుకు నడిచి ఆ శవం కోసం పాడె తయారు చెయ్యటం మొదలుపెట్టాడు. శవాన్ని లేపినప్పుడు అతడు కూడా తన భుజాన్ని ఆ పాడెకు ఆనించాడు. శవం దహనమయ్యేదాకా అక్కడే ఉండి స్నానం చేసి ఇంటికొచ్చాడు.
ఎందుకో తెలీదుగానీ ఆరోజు అతడు ప్రశాంతంగా నిద్రపోయాడు.
తెల్లారి లేచాక అతడు ఆ ముందు రోజు తాను చేసిందంతా తలుచుకున్నాడు. అంతే... అతనికి తన బాధ పోగొట్టుకునే మార్గమేదో తోచినట్లయింది. వెంటనే బ్యాంకుకు వెళ్ళి కొంత డబ్బు డ్రా చేసి, అక్కడ్నుంచి కొడుకుని తీసుకెళ్ళి ఒక చిన్న టూ వీలర్‌ కొన్నాడు.
‘‘ఇప్పుడీ వయసులో నీకెందుకు నాన్నా ఈ బండి?’’ అని కొడుకు అడిగాడు.
అతడు నవ్వాడేగానీ సమాధానమివ్వలేదు.
ఆ రోజు మొదలు ఊర్లో ఎవరింట్లో ఎవరు చనిపోయినా అతడక్కడ హాజరయ్యేవాడు.
ఆ శవం అంత్యక్రియలయ్యేదాకా దానితోనే ఉండేవాడు. ఎవరేమనుకున్నా పట్టించుకునేవాడు కాడు. ఎవరేమిచ్చినా పుచ్చుకునేవాడు కాడు. ఎవరింట్లోనూ ఎంగిలిపడేవాడు కాడు.
పొద్దున్నే లేచి శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుని మనసులో ‘అందరూ క్షేమంగా ఉండాలి స్వామీ’ అని కోరుకునేవాడు. వచ్చి ఆసుపత్రి దగ్గర కూర్చునేవాడు. ఎవరు చనిపోయినా వారి తాలూకు చుట్టాలను తన బండి మీద అనుసరించి వెళ్ళేవాడు.

ఎవరు వచ్చినా రాకపోయినా ఆ ఊర్లో ప్రతి శవంతోనూ శంకరయ్య శ్మశానంలో తప్పనిసరిగా ఉండేవాడు. ఎక్కడ ఎవరు చనిపోయినా అక్కడ శంకరయ్య కనిపించకపోతే ఎవరో ఒకరు అతనికి ఫోన్‌ చేసి తెలియజేసేంత పేరు వచ్చిందతనికి.
మామగారి వరస నచ్చని కోడలు ‘‘ఏమిటీ ప్రతిరోజూ మామయ్యగారు ఇలా అశుభకార్యాలకు వెళ్ళి వస్తుంటే మీరేమీ పట్టించుకోరేం?’’ అని భర్తని అంది.
అతడికి భార్య చెప్పింది సబబనిపించి తండ్రి దగ్గర ఆ ప్రస్తావన తెచ్చాడు. దానికతడు ‘‘చూడు... చనిపోయిన వ్యక్తిని చివరిదాకా సాగనంపటం అశుభం కాదు... శుభమే. నాకేది సంతృప్తినిస్తుందో ఆ పనినే చేస్తున్నా’’ అన్నాడు.
‘‘అలా అయితే ఆయన ఇక్కడుండటానికి వీలు లేదు’’ అంది అతని కోడలు వంటింట్లోంచి.
కొడుకేమీ మాట్లాడకపోవటం చూసి ‘‘సరే, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను’’ అన్నాడు.
‘‘నిన్ను వెళ్లమని కాదు నాన్నా. ఈ పని మానెయ్‌. మాతో హాయిగా ఉండు’’ అన్నాడు కొడుకు.
అతడేమీ మాట్లాడలేదు. అప్పటికా సమస్య తీరిపోయిందనుకున్నారతని కొడుకూ కోడలు. కానీ మర్నాడు ఉదయం అతడు ఇంట్లో కనిపించకపోయేసరికి అతడికోసం ఊరంతా గాలించారు. ఎంతకీ కనబడకపోయేసరికి పోలీస్‌ కంప్లైంట్‌ ఇచ్చారు. అయినా లాభం లేకపోయింది.
పదిహేను రోజుల తర్వాత అతడు ఒక శ్మశానం దగ్గర ఉన్నాడని ఎవరో చెప్పటంతో వెంటనే అతని కొడుకూ కోడలూ ఇద్దరూ వెళ్ళి,  ఇంటికి రమ్మని ప్రాధేయపడ్డారు.
అతడు తల అడ్డంగా ఊపి ‘‘ఈ వయసులో నాకేది చెయ్యాలనిపిస్తే అది చెయ్యనివ్వండి. నేను ఈ పక్కనే ఉన్న ఒక స్వామీజీ ఆశ్రమంలో ప్రశాంతంగా ఉన్నాను. నా గురించి బెంగ వద్దు’’ అన్నాడు నిర్లిప్తంగా.
‘‘నేనే పొరపాటున నోరు జారాను. మీకు నచ్చిన పని మీరు చేసుకోండి. కానీ వచ్చి ఇంట్లో ఉండండి’’ అంది అతని కోడలు. కానీ మౌనమే అతని సమాధానమైంది.
ఎంత బతిమాలినా అతడు ఒప్పుకోకపోవటంతో, ఇక ఆయన తమ మాట వినేట్లు లేడని, అతని కొడుకు తన భార్యతో కలిసి పక్కనున్న ఆశ్రమంలోని స్వామిజీ దగ్గరికెళ్లి ‘‘మా తండ్రిని ఇంటికి వచ్చేయమని చెప్పండి’’ అని ప్రార్ధించాడు.
దానికాయన చిద్విలాసంగా నవ్వి, ‘‘మూడో కన్ను ఆ పరమశివుడికే కాదు... ప్రతి మనిషికీ ఉంటుంది. ఆ కన్ను తెరుచుకోవటమనేది ప్రళయానికో విధ్వంసానికో కాదు... అది జ్ఞానోదయానికీ చైతన్యానికీ సూచిక. నీ తండ్రి అంతర్మథనమేమిటో తెలీదుకానీ అతడికి జ్ఞానోదయమైందని మాత్రం చెప్పగలను. ఆయన మనసుకి నచ్చిన పనిని చెయ్యనిద్దాం. ఆ పరమేశ్వరుడి చల్లని చూపు అతనిపై ఎల్లప్పుడూ ప్రసరిస్తూనే ఉంటుంది. ఇక మీరు అతని గురించి బెంగ వదిలెయ్యండి’’ అన్నాడు.
ఇక చేసేదేమీలేక ఇద్దరూ బయటికొచ్చి శంకరయ్యని కలిసి, వీలున్నప్పుడు ఇంటికి వస్తూండమని చెప్పి భారంగా అక్కడ్నుంచి కదిలారు. వారు చెప్పింది అంతగా వినిపించుకున్నాడో లేదో తెలీదుగానీ మళ్ళీ వడివడిగా శ్మశానంలోకి అడుగులేయసాగాడాయన.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.