close

తాజా వార్తలు

భార్యాభర్తలు

అప్పరాజు నాగజ్యోతి

సోఫాలో పడుకున్న హారిక కాలింగ్‌బెల్‌ శబ్దానికి కళ్ళు నులుముకుంటూ లేచివెళ్ళి తలుపుల్ని తెరిచింది.
ప్రమోద్‌ లోపలికి వచ్చాక షూస్‌ విప్పుతూ భార్యని పలకరించబోతే ఆఫీసు నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చాడన్న కోపంతో మొహాన్ని విసురుగా పక్కకి తిప్పేసుకుంది హారిక.
‘ఛ, ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూనే ఉంటుంది. ఆఫీసులో చచ్చేంత చాకిరీ చేసి అలిసిపోయి ఇంటికి చేరుకున్న భర్తని కాసింత చిరునవ్వుతో స్వాగతిస్తే ఈవిడ సొమ్మంతా కరిగిపోతుందేమో!’ మనసులోనే చిరాకుపడుతూ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి బట్టలు మార్చుకుని మొహంపైన కాసిని చల్లటినీళ్ళని చిలకరించుకుని హాల్లోకొచ్చాడు ప్రమోద్‌.
డైనింగ్‌ టేబుల్‌ మీద ఉన్న గిన్నెల్ని చూసి ‘‘నేను ఆఫీసు క్యాంటీన్‌లో తినేశాను.
నువ్వూ తినేసి పడుకో’’ అని చెప్పేసి బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి అలసటగా పక్కమీద వాలిపోయాడు ప్రమోద్‌.
హారిక కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి.
‘అతనికిష్టమైన చీర కట్టుకుని తల్లో మల్లెపూలు తురుముకుని సాయంత్రం నుంచీ తన రాకకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నానన్న ధ్యాసైనా లేదు ఈ మనిషికి! ఛ, బుద్ధి తక్కువై పెళ్ళి చేసుకున్నా ఇతన్ని’ మనసులోనే బాధపడింది హారిక.
ఆలస్యమవడం వలన కొంతా భర్తమాటలకి మరికొంతా ఆకలి చచ్చిపోవడంతో తినకుండానే గిన్నెలన్నీ సర్దేసి బెడ్‌రూమ్‌లోకి వచ్చి పడుకుంది. మూడు నిమిషాలనంతరం నడుంమీద పడ్డ భర్త చేతిని కోపంగా విసిరికొట్టింది.
అప్పటికే బాగా అలిసిపోయి ఉన్న ప్రమోద్‌ ఇక భార్యని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలేవీ పెట్టుకోకుండా అటువైపుకి తిరిగి పడుకున్నాడు. కళ్ళుమూసుకున్నాడే కానీ నిద్రపట్టలేదతనికి. ఏవేవో ఎడతెగని ఆలోచనలు.
‘పెళ్ళిచూపుల్లో హారిక చిరునవ్వుని చూసి పడిపోయాను. ‘తొందరపడద్దురా, మరో చక్కటి పెళ్ళి సంబంధం ఉంది... ఆ అమ్మాయినీ చూశాకే నిర్ణయం తీసుకుందాం’ అంటూ అమ్మా నాన్నా చెప్పినా వినకుండా హారికని తప్పితే మరెవ్వరినీ చేసుకునేది లేదని కచ్చితంగా చెప్పేసి పెళ్ళి చేసుకున్నాను. ఆమె అందమైన చిరునవ్వుని చూస్తే చాలు... నా అలసటంతా క్షణంలో మటుమాయమవుతుందని ఆశపడ్డాను. కానీ ఆ రోజున తన పెదవులపై చూసిన నవ్వుని మళ్ళీ ఎన్నడూ చూసిందే లేదు. నేనేదో లోటు చేస్తున్నట్లుగా ఎప్పుడూ మొహం గంటు పెట్టుకునే ఉంటుంది. ఛ, హారికని పెళ్ళి చేసుకుని జీవితంలో సరిదిద్దుకోలేని పొరపాటు చేశాను’ ఆలోచనలతో భారమైన మనసుతో ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు ప్రమోద్‌.
అతని పక్కనే పడుకున్న హారిక మనస్థితీ అలాగే ఉంది. ‘సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అని మోజుపడి ఇతన్ని పెళ్ళి చేసుకున్నాను. మంచి సంపాదన ఉంటుంది కాబట్టి బెంగళూరులోని మాల్స్‌, పబ్స్‌ సరదాగా చుట్టేయొచ్చనీ మా ఊళ్ళోలా చిన్న థియేటర్లలో కాకుండా చక్కగా మల్టీప్లెక్స్‌లో వారంవారం సినిమాలు చూడొచ్చనీ ఆశపడ్డా! ఛ, ఒక్క ఆశా తీరలేదు. పొద్దున్న బయల్దేరి ఆఫీసుకి వెళ్తే తిరిగి ఇంటికి చేరుకునేది రాత్రి పదకొండు దాటాక. ఒక ముద్దూ లేదు, ముచ్చటా లేదు. అమ్మావాళ్ళు తెచ్చిన మరో సంబంధాన్ని తిరగ్గొట్టి మరీ ఇతన్ని పెళ్ళాడాను. పెద్దవాళ్ళ మాటల్ని పెడచెవిన పెట్టినందుకు నాకిలాంటి శాస్తి జరగవలసిందే’ తనని తానే నిందించుకుంటూ చాలాసేపు పక్కమీదే దొర్లుతూ ఎప్పటికో నిద్రపోయింది హారిక.
పెళ్ళైన ఈ పదినెలల కాలంలో వాళ్ళిద్దరూ ఇలా ఎడమొహం పెడమొహం పెట్టుకోవడం ఎన్నిమార్లు జరిగిందో లెక్కలేదు.

* * *

ఆ శనివారం సాయంత్రం హోటల్‌ తాజ్‌లో ప్రాజెక్ట్‌ టీమ్‌ మెంబర్లందరినీ  కుటుంబాలతో సహా పార్టీకి ఆహ్వానించాడు- ప్రమోద్‌ పనిచేస్తున్న ప్రాజెక్ట్‌కి డైరెక్టర్‌గా ఉన్న సాయిప్రసాద్‌.
స్టార్‌ హోటల్‌ని చూడటం అదే మొదటిసారి కావడంతో హారికకి అక్కడి వాతావరణమంతా కొత్తగా ఉంది. న్యూజెర్సీ నుంచి వచ్చిన  క్లయింట్‌ జాన్‌కి టీమ్‌లోని ప్రతీ ఒక్కరినీ పేరుపేరునా పరిచయం చేస్తూ వచ్చాడు సాయిప్రసాద్‌. హారికనీ పరిచయం చేయగా జాన్‌ ఆమెకి షేక్‌హ్యాండ్‌ ఇవ్వబోతే వెంటనే హారిక రెండు చేతులనీ జోడించి అతనికి నమస్తే చెప్పింది. అది చూస్తూనే ప్రమోద్‌ మొహం ఎర్రబడింది. అసలే ఇటువంటి పార్టీలకి చీరెలో వెళ్తే బావుండదు. ఏదైనా మోడరన్‌ డ్రెస్‌ వేసుకోమని చెబితే భార్య ససేమిరా అందన్న కోపంలో ఉన్నాడతను. అందుకే పార్టీ పూర్తి అయ్యేవరకూ కూడా హారికతో మౌనంగానే ఉన్నాడు. కారులో ఇంటికి బయలుదేరగానే ఒక్కసారిగా బరస్టయ్యాడు.
‘‘జాన్‌ అమెరికానుండి వచ్చాడు. వాళ్ళ సంప్రదాయం ప్రకారం అతను నీకు షేక్‌హ్యాండ్‌ ఇవ్వబోతే నువ్వు సంస్కారం లేకుండా ప్రవర్తిస్తావా? అతనెంత అవమానంగా ఫీలయ్యాడో తెలుసా?’’
‘‘షేక్‌హ్యాండ్‌ ఇవ్వడం అమెరికా సంప్రదాయమైతే, నమస్తే చెప్పడం భారతదేశ సంప్రదాయం. ఇందులో అంత అవమానం ఏముందీ...’’
‘‘ఇక చాల్లే ఆపు, చేసిన దానికి మళ్ళీ సమర్ధింపు కూడాను! అయినా నీలాంటి పల్లెటూరు బైతుని పెళ్ళి చేసుకున్నందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి.’’

* * *

అలా మూడు గొడవలూ ఆరు అలకలుగా వాళ్ళ కాపురం సాగుతోంది.
ఆరోజు హారిక పుట్టినరోజు.
పెళ్ళి తర్వాత వచ్చిన మొట్టమొదటి పుట్టినరోజవడంతో ఆ రోజంతా భార్యాభర్తలిద్దరూ కలిసి సరదాగా గడపాలనే ముందర అనుకున్నా, ప్రమోద్‌ చేస్తున్న ప్రాజెక్టు చివరి దశలో ఉండటం వలన అతనికి ఆఫీసులో సెలవు దొరకలేదు. అందుకని సాయంత్రం ప్రమోద్‌ ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా మాల్‌కి వెళ్ళి షాపింగ్‌ చేసుకుని, మల్టిప్లెక్స్‌లో సినిమా చూసి, డిన్నర్‌ కూడా బయటే చేసేసి, ఎంజీ రోడ్‌ మీద సరదాగా చెట్టాపట్టాలేసుకుని తిరిగేటట్టుగా ప్రోగ్రామ్‌ని మార్చుకున్నారు.
సాయంత్రమవుతూనే కొత్త చీర కట్టుకుని అందంగా ముస్తాబై, అభిసారికలా భర్త రాకకై వేయి కళ్ళతో ఎదురుచూడసాగింది హారిక. రాత్రి పదిగంటలు దాటినా భర్త జాడలేకపోవడంతో నిరాశకి గురైంది ఆమె మనసు.
చకోరపక్షిలా కళ్ళల్లో వత్తులు వేసుకుని అతనికోసం ఎదురుచూపులు చూడటమూ, ఆపైన నిరాశతో నిద్రలోకి జారుకోవడమూ ఆమెకి అలవాటే అయినప్పటికీ, పెళ్లయాక వచ్చిన మొదటి పుట్టినరోజున కలిగిన ఆశాభంగాన్ని ఆమె సున్నితమైన మనసు
తట్టుకోలేకపోయింది.
ఎప్పటిలాగే రాత్రి పదకొండు గంటలుదాటిన తరవాత ఇంటికి చేరుకున్న ప్రమోద్‌ ‘‘వెరీ వెరీ సారీ హారీ, ఆఫీసులో అర్జెంటు పని తగలడంతో త్వరగా ఇంటికి రాలేకపోయాను. రేపు సాయంత్రం ఇద్దరం బైటకి వెళ్ళి సరదాగా గడుపుదాం.’’
అప్పటికే ఆమె మనసు తీవ్రంగా గాయపడటంతో అతని మాటలు వినిపించనట్లుగానే బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోయింది హారిక. బాగా అలిసిపోయి ఉండటంతో అతను త్వరగానే నిద్రపోగలిగినా, కలత చెందిన మనసుతో ఉన్న హారికకి మాత్రం ఆ రాత్రి కాళరాత్రే అయింది.

* * *

ఉదయం పెందలాడే మెలకువ వచ్చిన ప్రమోద్‌కి పక్కమీద హారిక కనబడలేదు. త్వరగా నిద్ర లేచేసింది కాబోలనుకుంటూ బాత్‌రూమ్‌కి వెళ్ళొచ్చి మళ్ళీ పడుకోబోతుండగా తలగడపైన నాలుగు మడతలుగా పెట్టిన గులాబీరంగు కాగితం అతని కంటపడింది. ఏమిటా అని విప్పి చూస్తే ‘నేను మా ఊరికి వెళ్తున్నాను’ అంటూ అందులో ఒకే ఒక్క వాక్యం, దానికింద హారిక సంతకం కనిపించడంతో కొద్దిక్షణాలపాటు అతని మెదడు పని చేయలేదు. ముందుగా తనతో ఒక్కమాటైనా చెప్పకుండా భార్య అలా ఇంటి నుంచి వెళ్ళిపోవడం అతనికి అవమానంగా తోచింది. అతని ఇగో తీవ్రంగా గాయపడింది.
‘నేనేదో కావాలనే ఆఫీసునుండి ఆలస్యంగా వచ్చినట్లుగా, తనపట్ల మహాపరాధం చేసినట్లుగా, తన పుట్టింటివాళ్ళ ముందు నన్నో రాక్షసుడి మాదిరి చిత్రీకరించాలనే వెళ్ళింది. వెళ్ళనీ... ఎన్నాళ్ళైనా పుట్టింట్లోనే ఉండనీ... ఎన్నటికైనా తన తప్పు తెలుసుకుని తానే తిరిగిరావాలి. నేను మాత్రం వెళ్ళి తనని బతిమాలి ఇంటికి తెచ్చుకుని చులకన కాను’ మనసులో గట్టిగా అనుకున్నాడు ప్రమోద్‌.

* * *

హారిక ఊరికి వెళ్ళి అప్పటికి రెండు రోజులైంది.

బార్యకి ఫోనైనా చేయకుండా బింకంగా ఉండిపోయాడే కానీ ఇంట్లో ఆమెలేని లోటు ప్రమోద్‌కి స్పష్టంగా తెలుస్తోంది.
ఆ రోజు సాయంత్రం బామ్మ వర్థనమ్మ నుండి ఫోన్‌ వచ్చింది.
‘‘నాన్నా పండూ, నిన్ను చూసి చాలా రోజులైందిరా. ఒక్కసారి వచ్చివెళ్ళమంటే నువ్వేమో ఆఫీసులో సెలవు దొరకదంటావు. ఇక ఉండబట్టలేక మన ఊళ్ళోనే ఉండే నీ స్నేహితుడు పార్థుతో బయలుదేరి రేపు ఉదయానే రైల్లో నేనే అక్కడికి వస్తున్నాను. నువ్వు స్టేషన్‌కి రా.’’
చిన్నతనంలో బామ్మ దగ్గరే ఉండి, పదోక్లాసు దాకా చదువుకున్న ప్రమోద్‌కి బామ్మతో ఎంతో చనువు. తల్లిదండ్రులతో కూడా పంచుకోని విషయాల్ని బామ్మతో చెప్పుకుంటాడతను. ఒక్క మాటలో చెప్పాలంటే అతనికి బామ్మంటే ప్రాణం. అందుకే ఊరు నుంచి బామ్మ వస్తోందంటే ప్రమోద్‌కి సంతోషం కలిగింది.
ఉదయమే స్టేషన్‌కి వెళ్ళి బామ్మని రిసీవ్‌ చేసుకుని, ఆమెని జాగ్రత్తగా తీసుకొచ్చిన స్నేహితుడికి కృతజ్ఞతలు చెప్పుకుని బామ్మతో కలిసి ఇంటికి వచ్చాడు ప్రమోద్‌.
స్నానం, పూజా ముగించుకుని హాల్లో సోఫాలో తీరిగ్గా కూర్చున్నాక మనవడిని అడిగింది వర్థనమ్మ. ‘‘ఏరా పండూ, అమ్మాయి కనిపించదే... పుట్టింటికిగానీ వెళ్ళిందేమిట్రా? ఏదైనా విశేషమా?’’ ఒక్క క్షణం ఏం చెప్పాలో తోచలేదు ప్రమోద్‌కి.
అబద్ధాలు చెప్పే అలవాటు లేదతనికి. అందులోనూ బామ్మతో హాస్యానికైనా అబద్ధం చెప్పి ఎరగడు. అందుకే తన మీద అలిగి భార్య పుట్టింటికి వెళ్ళిందంటూ ఉన్న విషయమే చెప్పాడు.
ఆ తర్వాత మనవడిని లాలించీ బుజ్జగించీ భార్యాభర్తల మధ్యన జరిగిన గొడవలన్నీ తెలుసుకుంది వర్థనమ్మ.
బామ్మ ఒళ్ళో తల పెట్టుకుని ఆమెతో అన్ని విషయాలూ మనసు విప్పి చెప్పుకున్నాడు ప్రమోద్‌.
‘‘బామ్మా, జరిగినదాంట్లో అసలు నా తప్పేముంది చెప్పు? తనకి బొత్తిగా కల్చర్‌ తెలియకపోయినా, మోడరన్‌ డ్రెస్సులు వేసుకుని ఫ్యాషన్‌గా తయారవడం చేతకాకపోయినా సర్దుకుపోయాను. అలాంటిది, నేనేదో చెడ్డవాడినన్నట్లుగా నాతో ఒక్కమాటైనా
చెప్పకుండా చిన్న ఉత్తరం ముక్క పెట్టేసి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఆడది... తనకే అంత పొగరుంటే... సంపాదిస్తున్నవాణ్ణి, మగాణ్ణి నాకెంత ఉండాలి? పుట్టింట్లో ఎన్నాళ్ళుంటుందో నేనూ చూస్తాను.’’
మనవడి ఆవేశం చల్లారేదాకా అతని తలని చేత్తో నిమురుతూ ఉండిపోయిన వర్థనమ్మ మెల్లిగా గొంతు విప్పింది. ‘‘చూడు పండూ, ముందుగా నువ్వు ఈ ఆవేశాన్ని తగ్గించుకోవాల్రా. ఆవేశం అనర్థదాయకం, అది మనలోని విచక్షణని చంపేస్తుంది. ఇప్పుడు చెప్పరా నాన్నా, ఇందాక ఏమన్నావ్‌... ‘మగాణ్ణీ, డబ్బులు సంపాదించేవాణ్ణీ’ అనా! ఏం నాన్నా, నువ్వు బైటకి వెళ్ళి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తుంటే, మరి నీ భార్య ఇంట్లోనే ఉండి ఇంటిని చక్కదిద్దుకోవడం లేదా? అదిమాత్రం పని కాదట్రా? భార్యాభర్తలంటే ఒకే బండికి కట్టిన రెండు చక్రాల్లాంటివారు పండూ. అందులో ఒకరూ ఎక్కువా, మరొకరు తక్కువా అన్న ప్రసక్తే లేదు. ఏ చక్రం కూలినా బండి పక్కకి ఒరిగిపోవలసిందే. కాబట్టి నీ భార్య కంటే నువ్వు ఎక్కువ అనే ఆ తప్పుడు భావనని ముందుగా నీ మనసులో నుంచి తీసేసెయ్‌.’’
బామ్మ మాటలకి సిగ్గుపడ్డాడు ప్రమోద్‌.
‘‘నీ తప్పేమిటని అడిగావు కదూ... దానికి సమాధానం చెప్పే ముందు ఒక్క విషయం చెప్పు. నీకు మరో మంచి సంబంధం కూడా వస్తే ఆ పిల్లని చూడనైనా చూడకుండా హారికనే చేసుకుంటానని పట్టుపట్టావు.
‘ఆ అమ్మాయి నీకు ఎందుకు అంతగా నచ్చింది’ అని నేనడిగినదానికి ఆ రోజున నువ్వేం చెప్పావు? ‘హారిక ముత్యాలముగ్గు సినిమాలో సంగీతలా ముగ్ధమనోహరంగా ఉంది బామ్మా! చక్కటి తేటతెలుగులో మాట్లాడింది. నాతో కలిసి పనిచేసే అమ్మాయిలని జీన్స్‌, మినీ స్కర్ట్‌ లాంటి మోడరన్‌ డ్రెస్సుల్లో చూసి చూసి విసిగిపోయాను. అలాంటి పిచ్చి ఫ్యాషన్‌ పోకడలేమీ లేకుండా అందమైన చీరకట్టులో స్వచ్ఛమైన ఆంధ్రా కన్నెపిల్లలా ఉన్న హారిక నాకు చాలా నచ్చింది బామ్మా’ అని చెప్పావా లేదా?
‘అవునన్నట్లు’గా తలాడించాడు ప్రమోద్‌.
‘‘ఆ రోజున ఆ పిల్లలో నీకే లక్షణాలైతే నచ్చాయో అవే లక్షణాలు ఈనాడు నీకంటికి లోపాలుగా అగుపిస్తుంటే మరి ఆ దృష్టి దోషం నీదా, ఆ పిల్లదా... నువ్వే ఆలోచించు. ఈవేళ నీ అభిరుచులు మారిపోయాయని నీ భార్య కూడా మారిపోవాలని ఆశించడంలో ఎంత న్యాయం ఉంది చెప్పు? క్షణాలమీద నీక్కావలసినట్లుగా మారిపోయేందుకు ఆ అమ్మాయేమీ మరబొమ్మ కాదుగా... మనసున్న మనిషి. నీ భార్యలో నువ్వు కోరుకున్న మార్పుని చూడాలనుకుంటే, మెల్లిగా లాలించీ బుజ్జగించీ నీకు కావలసినట్లుగా ఆమెని మలచుకోవాలి. దగ్గరుండి ఆమెకి అన్నీ నేర్పించుకోవాలి. అంతేకానీ, ఆమె మనసుని గాయపరచడం, ఆమెపట్ల దురుసుగా ప్రవర్తించడం నీ తప్పు కాదంటావా?’’ మెత్తగా చెప్పినా పదునుగా ఉన్న బామ్మ మాటలకి ఆలోచనల్లోపడ్డాడు ప్రమోద్‌.
‘నిజమే, నాదే తప్పు. హారికతో చాలాసార్లు రూడ్‌గా ప్రవర్తించి ఆమె మనసుని బాధపెట్టాను’ అనుకున్నాడు పశ్చాత్తాపంతో.మనవడిలో అంతర్మథనం మొదలైందని గమనించిన వర్థనమ్మ అతన్ని ఒంటరిగా వదిలేసి వంటగదిలోకి వెళ్ళింది.

* * *

పుట్టింటికి వచ్చిన రెండురోజుల తర్వాత హారిక నోరు తెరిచి తన సంసారంలో అడుగడుగునా తనకెదురైన ఆశాభంగాలని తల్లితో పంచుకుంది. ‘‘ఉదయానే ఇంటినుంచి బయల్దేరి ఆఫీసుకి వెళ్ళడం, అర్ధరాత్రి దాటుతుండగా అలిసిపోయి ఇంటికి చేరడం తప్పిస్తే ఒక సరదా పాడూ ఏమీ లేవమ్మా ఆయనకి. ఒట్టి గానుగెద్దు జీవితం. బెంగళూరులో చూడవలసిన చక్కటి ప్రదేశాలెన్నో ఉన్నాయని ముచ్చటపడ్డాను. కానీ అవేవీ మేము చూసింది లేదు, సరదాగా ఎక్కడా షాపింగ్‌ చేసిందీ లేదు. అవన్నీ పక్కన పెట్టు... కాస్త నిమ్మళంగా కూర్చుని ఆయన నాతో నాలుగు కబుర్లు చెప్పిన రోజులుగానీ, మేమిద్దరం కలిసి కాఫీ తాగిన రోజులుగానీ లేవమ్మా. ఎప్పుడూ ఉరుకుల పరుగుల జీవితమే. చివరకి నా పుట్టినరోజున కూడా కాస్త పెందరాళే ఇంటికిరావాలనిపించలేదాయనకి. ఎలాగమ్మా ఇలాంటి మనిషితో జీవితాంతం కలిసి కాపురం చేయడం?’’ కూతురు చెప్పినదంతా ఓపిగ్గా విన్నాక సుజాత నోరు విప్పింది.
‘‘హారీ, ఒక్క మాటడుగుతాను.
ఉన్నదున్నట్లుగా చెప్పు. ఆ రోజున నీకు మేము తెచ్చిన రెండో సంబంధం, అదే...
ఆ సెంట్రల్‌ గవర్నమెంట్‌ సంబంధం గుర్తుందా? నేనూ మీ నాన్నా ఆ సంబంధాన్నే ఇష్టపడ్డాం. కానీ నువ్వు మాత్రం ప్రమోద్‌నే చేసుకుంటానని పట్టుబట్టావు.’’
గొంతుక ఎండిపోయినట్లవడంతో వంటింట్లోకివెళ్ళి మంచినీళ్ళు తాగి వచ్చిన తరవాత మళ్ళీ కొనసాగించింది సుజాత.
‘‘ఆనాడు ప్రమోద్‌ని నువ్వు ఎందుకు ఇష్టపడ్డావో నీకు గుర్తుందా? నీ స్కూల్‌ ఫ్రెండ్‌ రాశి వాళ్ళు ఇక్కడికి రాకముందు బెంగళూరులో ఉండేవాళ్ళు. అక్కడి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఎంత ఆడంబరంగా జీవితాన్ని గడుపుతారో, ప్రాజెక్ట్‌ పనిమీద ఎన్నెన్ని దేశాలని చుట్టివస్తారో, ఎంత బాగా ఎంజాయ్‌ చేస్తారో తను నీకు కళ్ళకి కట్టినట్లుగా చెప్పేది. ఆ వయసులో అవన్నీ నీ మనసులో తిష్ట వేయడంతో నువ్వు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరునే పెళ్ళి చేసుకోవాలనీ అతనితో కలిసి విదేశాలన్నీ తిరిగి రావాలనీ నిర్ణయించుకున్నావు... అవునా?’’
ఔనన్నట్లుగా తలూపింది హారిక.
‘‘మరి పెళ్ళి చేసుకోవడానికి ముందు నీకున్న ఆశలకీ కోరికలకీ అనుగుణంగా పెళ్ళవగానే హనీమూన్‌కి స్విట్జర్లాండ్‌ వెళ్ళారు. ఆ తర్వాత రెండునెలలు ప్రాజెక్ట్‌ పనిమీద అతను అమెరికాకి వెళ్తుంటే నువ్వూ తనతో వెళ్లావు. ఫారిన్‌ వెళ్ళాలన్న ముచ్చట తీరిపోయింది కాబట్టి ఇకపై ప్రతీరోజూ నీ భర్త నీకోసం ఆఫీసు నుంచి త్వరగా ఇంటికి వచ్చేసి, నీ సరదాలని తీర్చాలనీ నీతో కబుర్లు చెప్పాలనీ నీతో కలిసి షాపింగ్‌ చేయాలనీ నువ్వు కోరుకోవడం మొదలుపెడితే, మరి నీ మారిన కోరికలపట్టీకి అనుగుణంగా అతని ఉద్యోగం మారిపోవడం సాధ్యమా? అసలు నువ్వలా ఆశించడంలో ఏమైనా న్యాయముందా? నీక్కావలసినట్లుగా మారిపోయేందుకు అతనేమైనా సోఫా కవరా... డైనింగ్‌ టేబుల్‌ మ్యాటా? బుద్ధీ, బుర్రా ఉన్న మనిషమ్మా అతను. నిజంగా అతనిలో నువ్వు ఆశించిన మార్పు రావాలీ అని నువ్వనుకుంటే, ముందుగా నీలో మార్పు రావాలి. ఉద్యోగులకి లక్షల్లో జీతాన్నిస్తున్న కంపెనీలు, ఆ జీతాలకి తగినట్లుగా వారిచేత పని చేయించుకోవడం మామూలేనన్న విషయాన్ని చదువుకున్న నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా? ఆఫీసులో పనిచేసి అలిసిపోయి ఇంటికి చేరుకున్న భర్తని నువ్వు చిరునవ్వుతో ఎదురెళ్ళి సేదతీరిస్తే ‘ఎప్పుడెప్పుడు ఇంటికి చేరుకుందామా’ అన్న కోర్కె అతన్ని కాల్చేస్తుంది. అలాకాకుండా, అలసటతో ఇంటికి చేరిన భర్తని నీ అలకలతో మరింత హైరానాపెడితే ఇంటికి రావాలన్న కోర్కె చచ్చిపోయి ఆఫీసులోనే మరింత సమయం గడిపేసే ప్రమాదముంది. కాదంటావా?’’
తల్లి చెప్పినదానికి ఆలోచనలో పడింది హారిక. అది గమనించిన సుజాత వేడివేడి కాఫీ తెస్తానంటూ వంటింట్లోకి వెళ్ళింది.
‘నిజమేగా, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగస్తుల చేత కంపెనీ యాజమాన్యం వాళ్ళిచ్చే జీతానికి రెట్టింపు పని చేయిస్తారన్న విషయం అందరికీ తెలిసిందేగా. మరేమిటో నా మనసుకి ఇంత చిన్న విషయం తోచనేలేదు. అప్పటికీ పాపం ఆయన ‘సారీ’ చెప్పనే చెప్పారు. తప్పంతా నాదే. నేనే ఆవేశంలో ఆయనకి చెప్పకుండా ఇలా దూకుడుగా వచ్చేశాను. ఆయన చాలా హర్టయి ఉంటారు, అందుకే నాకు ఫోన్‌ కూడా చేయలేదు. అయినా తప్పు నాదైనప్పుడు ముందుగా ఆయనే నన్ను పలకరించాలని అనుకోవడం దేనికి? నేనే ఫోన్‌ చేసి ఆయనకి సారీ చెప్పచ్చుగా’ అనుకుంటూ సెల్‌ఫోన్‌ చేతిలోకి తీసుకుంది హారిక.
అప్పటికే ఆమె ఫోన్‌లో ఆరేడు మిస్డ్‌ కాల్స్‌ ఉన్నాయి ప్రమోద్‌ నుంచి.
‘అయ్యో, ఫోన్‌ సైలెంట్‌లో ఉండిపోయిందే’ అనుకుంటూ వెంటనే ప్రమోద్‌కి ఫోన్‌ చేసింది. మొదటి రింగ్‌కే ఫోన్‌ ఎత్తాడు ప్రమోద్‌.
‘‘ఏమండీ, ఇప్పుడే మీ నుండి వచ్చిన మిస్డ్‌ కాల్స్‌ చూశాను’’ అని చెబుతూ ఒక్క క్షణం ఆగింది. ‘‘సారీ అండీ... ఆరోజున బాగా కోపంలో ఉండి మీతో చెప్పకుండా వచ్చేశాను...’’ అంటున్న హారికని సగంలోనే ఆపేశాడు ప్రమోద్‌.
‘‘ఫర్లేదులే హారీ, నిజానికి నాదే తప్పు. నీకు సారీ చెబుదామనే అన్నిసార్లు ఫోన్‌ చేశాను. అన్నట్లు మా ప్రాజెక్టు పూర్తయింది. నాకు నాలుగురోజులు సెలవు దొరికింది.
సరదాగా ఇద్దరమూ గోవాకి వెళదామని అక్కడ రిసార్ట్‌ బుక్‌ చేశాను. మధ్యాహ్నం రెండుగంటలకి కారులో బయలుదేరి
నీ దగ్గరకి వస్తాను. నువ్వు రెడీగా ఉంటే అక్కడనుండే గోవాకి వెళదాం, సరేనా?’’
ప్రమోద్‌ మాటలకి హారిక మనసు ఆనందంతో నాట్యం చేసింది.
‘‘అలాగేనండీ, నేను సిద్ధంగా ఉంటాను.’’
‘‘మరి, నీ అలక పోయినట్లేనా చిన్నా?’’
ఆ పిలుపుకి హారిక మనసంతా పులకించింది.
ప్రమోద్‌కి భార్యపట్ల అమితమైన ప్రేమ కలిగినప్పుడు ‘చిన్నా’ అంటూ ప్రేమగా పిలుస్తాడు. పెళ్ళైన కొత్తలోనూ, హనీమూన్‌ రోజుల్లోనూ తప్పిస్తే ఈమధ్య కాలంలో అతడు ఆమెనలా పిలిచింది లేదు.
‘‘అలక ఎప్పుడో పోయింది మహానుభావా. మీరెప్పుడెప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్నాను’’ అంది హారిక తన్మయంగా.
‘‘అయితే సరే. ఇప్పుడు నేను అలిగాను. ఎందుకంటే మా ఆవిడ నానుండి దూరంగా పారిపోయి నన్ను పస్తులుంచింది’’ చెప్పాడు ప్రమోద్‌.
‘‘మీ అలక ఎలా తీర్చాలో నాకు తెలుసులెండి’’ అంది హారిక.
ఆమె చెప్పిన దానికి అటునుండి ప్రమోద్‌ ఏదో చిలిపిగా అన్నట్లున్నాడు.
సిగ్గుతెరలు మొహాన్ని కమ్మేయడంతో, అరుణవర్ణం దాల్చిన కూతురి వదనాన్నీ గుసగుసలుగా మారిన సంభాషణనీ అప్పుడే కాఫీ కప్పులతో లోనికి రాబోతున్న సుజాత చూసింది.
కూతురు ఎవరితో మాట్లాడుతోందో అర్థమవగా వాళ్ళ ఏకాంతానికి భంగం కలగకుండా తలుపుల్ని దగ్గరకి లాగి అక్కడనుండి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.