close
Array ( ) 1

తాజా వార్తలు

అలక అందమే కానీ..

‘మా ఆయన మాటిమాటికీ అలుగుతారు. చిన్న విషయానికీ వారం రోజులు మూతి బిగించుకుని కూర్చుంటారు. ఎలా వేగాలో ఏంటో’ తన బాధను చెప్పుకుంది మాధవి. ‘అయ్యో అక్కా ఈయనేమన్నా తక్కువ తిన్నారనుకుంటున్నావా? అలకపాన్పు ఎక్కారంటే రెండు మూడు రోజుల వరకు దిగనే దిగరు’ తన గోడు వెళ్లబోసుకుంది ప్రసన్న... వీళ్లిద్దరి భర్తలే కాదు, ఇలా ఈమధ్య ఊ అంటే అలుగుతున్న మగాళ్లు పెరిగిపోతున్నారు! నిన్న మొన్నటి వరకూ అలక అంటే ఆడవాళ్లదే అన్నట్టు ఉండేది పరిస్థితి. జానపద అలకపాటల నుంచి కవుల వర్ణనల వరకూ అన్నిచోట్ల ఆడవాళ్ల అలకే కనిపిస్తుంది. కానీ, నేడు ప్రతి ఇంట్లో మగవారి అలకలు షరా మామూలు అయిపోయాయి.  
కొత్త దంపతుల మధ్య ఈ అలకలు పెద్ద చిక్కులు తెచ్చిపెడతాయి. అప్పటి వరకు తనకు సంబంధించిన పనులన్నీ తల్లే చూసుకునేది కాబట్టి పెళ్లయ్యాక భార్య కూడా అలానే ఉండాలనుకుంటాడు భర్త. ‘ఇవాళ ఆఫీసులో మీటింగ్‌ ఉందని నిన్ననే చెప్పా. బట్టలు ఇస్త్రీ చేయించవచ్చు కదా! మా అమ్మయితే చూసుకుని రెడీ చేయించి ఉంచేది’ అంటూ మొదలుపెడతాడు.. ఇక ఆ రోజంతా చిరుబుర్రులే. సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చాక కూడా అలాగే అలిగి కూర్చుంటాడు. నిజానికి కొత్త పెళ్లికూతురికి ఇల్లు, మనుషులు వాతావరణం అంతా కొత్తే. సర్దుకుపోవడానికి సమయం పడుతుంది. ఈ విషయం శ్రీవారు అర్థం చేసుకుంటే ఏ సమస్యా ఉండదు. కానీ, లేనిపోని పట్టింపులతో చిన్న చిన్న విషయాలకు అలుగుతుంటాడు. ‘పెళ్లిలో మా పెద్దమ్మ వాళ్ల బంధువులు వస్తే పలకరించలేదట! వాళ్లు చాలా ఫీలయ్యారు’ అంటాడు. అసలు వాళ్లెవరో కూడా ఆ అమ్మాయికి సరిగా తెలియకపోవచ్చు. అప్పుడెలా స్పందిస్తుందనేది అర్థం చేసుకోవాల్సింది భర్తే. పెళ్లయిన కొత్తలోనే అలకలతో అమ్మాయిని బెదరగొడితే తన మనసులో అతని మీద ప్రేమ బదులు బాధ, భయంలాంటివి ఏర్పడతాయి. ఇవి జీవితాంతం ఉండిపోతాయి. కాబట్టి అయిన దానికీ కానిదానికీ అలిగి మూతిముడుచుకుని కూర్చోడం మానేయాలి. భర్త ప్రేమతో చెబితే దేన్నయినా సులువుగా అర్థం చేసుకుంటుంది భార్య. అమ్మలా ప్రేమిస్తుంది.
ఇక కొంతమంది భర్తలు అలిగారంటే భార్యను ఏమీ అనరు గానీ మౌనంగా ఉండిపోతారు. వాళ్లు మాట్లాడకుండా ఉన్నారంటేనే అర్థమైపోతుంది అలకపాన్పు ఎక్కాడని. వాళ్లను అక్కడి నుంచి దింపడానికి శ్రీమతికి తలప్రాణం తోకకు వస్తుంది. ఇంతా చేసి ఆయన ఏం సాధిస్తాడంటే.. ఏమీ ఉండదు! భార్యను బాధపెట్టినవారవుతారు తప్ప సమస్య పరిష్కారం కాదు. మౌనంగా ఉండటం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. బంధం బలహీనపడుతుంది. ఇద్దరూ సామరస్యంగా మాట్లాడుకుంటే అలకలన్నీ గాల్లో ఎగిరిపోతాయి.
ఈరోజుల్లో ఎక్కువ మంది నవ దంపతులు ఉమ్మడి కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. పెళ్లవగానే నగరంలో కొత్తకాపురం పెట్టడం, ఉద్యోగ బాధ్యతల్లో మునిగిపోవడం... ఇద్దరూ ఉద్యోగస్తులయితే ఫర్వాలేదు. కానీ గృహిణులకు మాత్రం ఇది సవాలే! రోజూ ఒక్కతే ఇంట్లో ఉండాల్సి రావడంతో ఇల్లాలిని ఒంటరితనం చుట్టుముడుతుంది. కనీసం ఆదివారమైనా బయటకి తీసుకువెళ్లమని భర్తను అడుగుతుంటుంది. సెలవుండేదే ఒక్కరోజు, ఈ రోజైనా ఇంట్లో విశ్రాంతి తీసుకుందామని భర్త చెబుతుంటాడు. ఇలాంటి విషయాల దగ్గరే ఇద్దరి మధ్యా అలకలు మొదలవుతాయి. అవి కాస్తా గొడవలుగా మారి చినికి చినికి గాలివానవుతాయి. అదే భార్య అడిగింది కదాని తనని కాసేపు బయటకి తీసుకెళ్తే గొడవే ఉండదు. పోనీ భర్తకి దొరికేది ఒక్కరోజే కదా అని, భార్య సర్దుకుపోతే ఇక సమస్యే ఉండదు. ఒకరినొకరు అర్థం చేసుకుని మసలుకుంటే అలకలకు చోటే ఉండదు. చిలిపితగాదాలు, చిన్న చిన్న గొడవలు సహజం. చిన్నపాటి అలకల తర్వాత ప్రేమబంధం మరింత బలపడుతుంది కూడా. అయితే వాటిని సాగదీయకుండా మొగ్గదశలోనే తుంచేయాలి. అప్పుడే ఆ అలక కాస్తా ఆనందంగా మారుతుంది. కాపురం హరివిల్లవుతుంది.

- శాంతి జలసూత్రం


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.