close

తాజా వార్తలు

Published : 21/02/2020 23:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

యువతలో గుండెపోటు ఎందుకు వస్తోంది?

ఇంటర్నెట్‌డెస్క్‌: గతంతో పోలిస్తే ప్రస్తుత జీవనశైలిలో ఒత్తిడి బాగా పెరిగింది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా ఉరుకులు, పరుగులతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ రకమైన జీవనశైలి యువ గుండెలకు చిచ్చుపెడుతోంది. 30 నుంచి 35 ఏళ్లకే గుండె జబ్బులు వస్తున్నాయి. అస్తవ్యస్తమైన జీవనశైలికి తోడు వృత్తిపరమైన, వ్యక్తిగతమైన ఒత్తిళ్లు, శారీరక శ్రమ లేకుండా ఎక్కువసేపు కూర్చొని పని చేయటం, పొగ తాగటం, జంక్‌ఫుడ్స్‌, హైబీపీ, కొలెస్ట్రాల్‌, షుగర్‌ ఇవన్నీ గుండెపోటు రావడానికి దారి తీస్తాయి. 

గుండెపోటుకు కారణాలు.. 

గుండెనొప్పి రావడానికి ప్రధాన కారణాలు అందరికీ తెలిసినవే. అవి పెద్దవారిలోనైనా, యుక్త వయసులోనైనా ఒకేలా ఉంటాయి. తినే ఆహారంపై సరైన నియంత్రణ, శారీరక వ్యాయామం లేకపోవడం, నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, ఆందోళనలు, ధూమపానం, మద్యపానం లాంటి దురలవాట్లు. ఇవన్నీ కలిసి మొదట్లో బరువు పెరగడానికి కారణం అవుతాయి. ఆపై మధుమేహం, హైబీపీ, కొలెస్ట్రాల్‌ సమస్యల్ని తెచ్చిపెట్టి చివరికది గుండె రక్తనాళాల్లో బ్లాకుల్ని తెచ్చిపెట్టే కరోనరి ఆటరీ డిసీస్‌కు దారి తీస్తుంది. యుక్త వయసులో వచ్చే గుండెపోటుతో వచ్చే చిక్కేంటంటే దానికి సంబంధించిన లక్షణాలు పెద్దగా కనిపించకపోవడం. చాలాసార్లు నిశ్శబ్దంగా విరుచుకుపడి అది ప్రాణాల మీదకు తెస్తుంది. అందుకే యుక్త వయస్కులు అందరూ కూడా 25 ఏళ్లు దాటాకా గుండె ఆరోగ్యాన్ని తెలిపే కొన్ని పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరమని డాక్టర్లు సలహాలిస్తున్నారు. 

వయసు పైబడిన వారితో పోలిస్తే చిన్న వయసులో వచ్చే గుండెపోటు ప్రమాదకరమైనది.. ప్రాణాంతకమైంది కూడా. ఇందుకు కారణం ఉంది. పెద్ద వయసులో గుండెపోటు ఒక్కసారిగా రాదు. రక్తనాళాల్లో అడ్డంకులు అనేవి క్రమంగా పెరుగుతూ వస్తాయి. ఇలాంటప్పుడు బ్లాక్‌ అవుతున్న రక్తనాళాలకు పక్కనే కొల్లేటరల్స్‌ అనే చిన్న చిన్న రక్తనాళాలు పుట్టుకొస్తాయి. దీంతో ప్రధాన రక్తనాళంలో అడ్డంకి మూలంగా రక్తప్రసారం ఆగిపోయినా పక్కనే ఉండే కొల్లేటరల్స్‌ రక్తనాళాల సాయంతో గుండెకు కొంచెమైనా రక్తం అందుతుంది. యువతలో ఇలాంటి పరిస్థితి కనిపించదు. కొల్లేటరల్‌ రక్తనాళాలు ఏర్పడకపోవడంతో గుండెపోటు వచ్చినప్పుడు పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తుంటుంది. సమతుల ఆహారం తీసుకోవడం, నిత్యం కనీసం ఒక గంటపాటు వ్యాయామం చేయటం, ఆందోళన, ఒత్తిళ్లను తగ్గించుకునే విధంగా యోగా, ధ్యానం, పుస్తక పఠనం లాంటి కొన్ని మంచి వ్యాపకాలను ఆశ్రయించడం ద్వారా గుండె రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేట్లు జాగ్రత్త పడొచ్చు. తద్వారా యువతరంలో గుండె పని తీరు బాగా ఉండేవిధంగా చూసుకోవచ్చు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని