close
Array ( ) 1

తాజా వార్తలు

అరుంధతీ నమస్తుభ్యం

విద్యాజీవితం నిర్విఘ్నంగా సాగడానికి ‘సరస్వతీ నమస్తుభ్యం’ అని ప్రార్థిస్తాం. మరి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో విలసిల్లడానికి ‘అరుంధతీ నమస్తుభ్యం’ అనుకోవాలి. మాటల్లోనే కాదు బాటలోనూ అరుంధతిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆమె పంచమహా పతివ్రతల్లో ఒకరు. వారిలోనూ ఆమె ప్రత్యేకత సంతరించుకున్నది. వసిష్టుడి సహధర్మచారిణి అయిన అరుంధతి నక్షత్రాన్ని హిందువుల పెళ్లిళ్లలో వధూవరుల చేత దర్శనం చేయించడం సంప్రదాయం. ఇంతటి మహత్తరమైన గౌరవం పొందడానికి అరుంధతికి మించిన అర్హులు లేరు. ఆమె చరిత్రను తలచుకుంటే పుణ్యం దక్కుతోందని నైమి సంహిత చెబుతోంది. అసలు అరుంధతి అన్న పేరులోనే గొప్ప విశేషం ఉంది. ‘అరుం’ అంటే అగ్ని తేజస్సు, బంగారం వన్నె అనే అర్థాలు ఉన్నాయి. ధతి అంటే ధరించేది. అయితే పేరులో అగ్నిని ధరించే ఆ దేవత తన మీద నిప్పు దేవుడు ఆరాటపడ్డా ఇబ్బంది పడకుండా తన శక్తివల్ల పాతివ్రత్యాన్ని కాపాడుకుంది. సీత అగ్ని పునీత అయితే, అరుంధతి అగ్ని ఛాయలు సైతం తనకు అంటకుండా జాగ్రత్త పడింది. ‘తార’ స్థాయిలో కీర్తి సంపాదించుకుంది.
బలహీనతల్లో ఎవరి బలం వారిది. అగ్నిదేవుడు ఇందుకు మినహాయింపు కాదు. అగ్నిదేవుడు ఒక బలహీన క్షణంలో కామాగ్ని దేవుడయి సప్తర్షుల భార్యల మీద కన్నేస్తాడు. ఈ విషయాన్ని అగ్ని దేవుడి భార్య స్వాహాదేవి పసికట్టింది. దాంతో ఆమె సప్తర్షుల భార్యలుగా తానే రూపం ధరించి, ఆయా కాంతలుగా అగ్నిదేవుణ్ని నమ్మించి పొందు ఇద్దామ నుకుంది. కానీ అరుంధతి దగ్గర స్వాహాదేవి పప్పులు ఉడకలేదు. అగ్ని దేవుడి ఆటలూ సాగ లేదు. అరుంధతి పాతివ్రత్యం చెక్కు చెదరలేదు. అరుంధతి వేషం స్వాహాదేవి వేయలేకపోయింది. ఇది అరుంధతి మాహాత్మ్యం.
అరుంధతిని అరంజ్యోతి, ఆరంజ్యోతి అనేవాళ్లు ఉన్నారు. ఎవరు ఏమని పిలిచినా అరుంధతి అరుంధతే. తాను వసిష్టుని ఆలు కావాలన్న ఆశయాన్ని సిద్ధింపజేసుకున్న మహిమాన్వితురాలు.
భర్త అంటే భరించేవాడు అని కదా అర్థం. వసిష్టుడు తన భార్య అయిన అరుంధతిని ఎల్లవేళలా కాపాడతాడన్నది ప్రతీతి. అలాంటి అరుంధతి అన్ని నక్షత్రాల మధ్య అందరికీ కనిపిస్తుందా? అన్నదీ ప్రశ్నే. కనిపించినా, కనిపించకపోయినా కనిపించినట్టు చెప్పడం కూడా ఆధునిక సమాజంలో రివాజు అయిపోయింది. కానీ కనిపించకపోతే కనిపించలేదని చెప్పే ‘అసాధారణవ్యక్తులూ’ ఉంటారు. అరుంధతి కనిపించిందా? అని పురోహితుడు అడగ్గానే అరుంధతి కనిపించలేదుగానీ, పెళ్లికోసం అప్పు చేసిన ఆరువేల రూపాయలు కనిపిస్తున్నాయంటూ వెనకటికి ఓ పెళ్లి కొడుకు కిసుక్కుమన్నాడట. అది చీకట్లో పురోహితుడికి కనిపించినా, కనిపించకపోయినా విషయం అర్థమై ఉంటుంది.
ఇంతకీ అరుంధతి ఎవరు? ఏమి ఆమె పెళ్లికథ?  అంటే బోలెడు విషయాలు ఉన్నాయి. యాగకర్త మేధాతిథి అరుంధతిని పెంచి పెద్ద చేసి వసిష్టుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అరుంధతి వసిష్టుడికి దార. తార. వసిష్టుడితో అరుంధతి అంటే తారతో తార.
అరుంధతిని దర్శించుకుంటే దంపతులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయన్నది అనాదిగా ఉన్న అఖండమైన విశ్వాసం.
దంపతులు అన్యోన్యంగా ఉండి చక్కటి సంతానా న్ని పొంది వాళ్లు సమాజానికి మేలు చేయాలన్నదే గా అందరి ఆకాంక్ష. విశ్వామిత్రుడి శాపకారణంగా వసిష్టుడు తల్లడిల్లిపోతాడు. వసిష్టుడు బతుకు మీద విరక్తితో చనిపోవడానికి కాళ్లుచేతులను తానే కట్టేసుకుని నదిలోకి దూకుతాడు. వసిష్టుడు చనిపోవడాన్ని ఏమాత్రం సహించలేని నదీమతల్లి ఆయనను కాపాడుతుంది. కానీ వసిష్టుడు జీవచ్ఛ వంలా అయిపోయాడు. అప్పుడు అర్ధాంగి అయిన అరుంధతి తన పతి దేవుణ్ని కంటికి రెప్పలా చూసుకుంది. జీవితభాగస్వామి ఎలా ఉండాలో కళ్లకు కట్టేట్టు చూపించింది. ఇది ఆదర్శం కదా!
అరుంధతి దర్శనం వల్ల సమకూరే ప్రయోజనం అంతేనా? కాదు కాదు ఆరోగ్య ప్రయోజనం కూడా ఉందంటారు. అరుంధతీ నక్షత్రాన్ని దర్శించుకుంటే కంటికి ఉన్న చూపు పెరుగుతుందట. నిశిత దృష్టి కలుగుతుందట! ఎన్నో సంప్రదాయాల్లో ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉంటాయి. వాటిని నిగ్గు దేల్చుకుని ఆచరించుకుంటే జీవితం సార్థకమవుతుంది. అదేగా కావల్సింది.

 - శంకరనారాయణ


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.