close
Array ( ) 1

తాజా వార్తలు

ఈ కాగితాలే తలరాత మారుస్తాయని!!

లాటరీ ఉచ్చులో చిక్కిన జనం

పాలకొండ కేంద్రంగా దందా

బాధితుల సొమ్ములు మింగేసిన వ్యసనం

నిందితుడి అరెస్టుతో వెలుగులోకి మరిన్ని నిజాలు

పాలకొండ, పాలకొండ గ్రామీణం, న్యూస్‌టుడే

నారాయణ నుంచి కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్లు

తెల్లకాగితాలపై కొన్ని అంకెలు వాటి పక్కనే ఆంగ్లంలో కొన్ని పేర్లు...

అవీ...ఇంట్లోని ప్రింటర్‌లో ప్రింట్‌ తీసి ఇచ్చినవి!!

ఇవన్నీ అసలో...నకిలీవో పక్కన పెడితే...

అవే అసలైన లాటరీ టిక్కెట్లనీ వాటిని కొంటే తమకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని కష్టాలన్నీ తీరిపోతాయని ఎందరో ఆశ పడ్డారు!

నిత్యం వందలు..వేలు ఖర్చు చేసి కొన్నారు!!

చివరికి... రాష్ట్రంలో నిషేధిత  లాటరీ టిెక్కెట్ల దందా నిర్వహిస్తున్న ‘నారాయణరావు’ పోలీసులకు  చిక్కడంతో కలకలం రేగింది!!

జిల్లాలో చర్చనీయాంశంగా మారిన లాటరీ టికెట్లు వ్యవహారానికి పాలకొండ ప్రధాన కేంద్రంగా మారింది. తనదైన శైలిలో దందా సాగిస్తున్న నారాయణరావు లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఈ ఉచ్చులో చిక్కుకున్నవారిలో చాలా మంది చిరు వ్యాపారులే. ఒక్కో టికెట్‌ ధర రూ. 20 నుంచి రూ. 1000 వరకూ ఉంటుంది. నిత్యం ఎందరో వీటిని కొనేవారు. పోలీసులు పక్కా సమాచారం సేకరించి దాడి చేసి బుధవారం నిందితుడిని పట్టుకోగలిగారు.

అసలా... నకిలీనా?

లాటరీ దందా బయటపడడంతో నారాయణరావు నుంచి నిత్యం టికెట్లు కొనుగోలు చేసేవారంతా ఘొల్లుమంటున్నారు. తమకు విక్రయించినవి అసలా...నకిలీనా అన్న విషయం తేల్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆ టిక్కెట్లపై కేవలం నంబరు తప్ప కంపెనీకి సంబంధించి ఎటువంటి సమాచారం ఉండదు. కేవలం తెల్లకాగితంపై కొన్ని అంకెలు ముద్రించినవే టికెట్లుగా చెలామణి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా కొందరు సిద్ధపడుతున్నారు.

కమిషన్‌ ఏజెంట్లును నియమించుకుని...

రాష్ట్రంలో లాటరీ టికెట్లు నిషేధించక ముందు పాలకొండ, రాజాం, ఆమదాలవలస, కొత్తూరు, వీరఘట్టం తదితర ప్రాంతాల్లో నారాయణరావు

టికెట్లు విక్రయించేవారని సమాచారం. తరువాత కొంత మంది కమిషన్‌ ఏజెంట్లను నియమించుకున్నారు. వీరి ద్వారానే ఇన్నాళ్లు టిక్కెట్లను విక్రయిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో లాటరీ టికెట్ల విక్రయం నిషేధించినా గతంలో ఉన్న పరిచయాల ద్వారా ఇప్పటికీ ఈ వ్యవహారాన్ని ఆయన చక్కబెడుతున్నారు. గతంలో అత్యంత సామాన్య జీవనం గడిపిన ఈయన కొద్ది సంవత్సరాలకే ఆర్థికంగా మంచి స్థానానికి వెళ్లినట్లు చెబుతున్నారు.

చరవాణిలోనే ఫలితాలు!

లాటరీ ఫలితాలు తెలుసుకునేందుకు టికెట్ట్లు కొనుగోలు చేసిన వారు ఓ ప్రత్యేక యాప్‌లో చూసుకోవాలని చెప్పేవారు. వారు కొన్ని టికెట్లును యాప్‌లో నమోదు చేస్తే ఫలితాలు కనిపిస్తాయని చెప్పేవాడని...అలాగే చూసేవారమని పలువురు చెబుతున్నారు. అయితే గత కొన్నేళ్లుగా నారాయణరావు వద్ద తరచూ లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసినా ఇప్పటికీ ఒక్కసారి కూడా తమకు పైసా కూడా రాలేదని పలువురు వెల్లడిస్తున్నారరు. అతని అరెస్టు నేపథ్యంలో ‘ మేం కొనుగోలు చేసినవి నకిలీవనే అనుమానం కలుగుతోంది’ అని వాపోతున్నారు.

నారాయణరావుపై శ్రీకాకుళంలోని ఓ కొనుగోలుదారు పోలీసులకు సమాచారం అందించినట్లు సమాచారం. మరో వైపు నారాయణరావు జిల్లా కేంద్రంలో నియమించుకున్న కమిషన్‌ ఏజెంట్ల నుంచి వచ్చిన సమాచారమూ అతడిని పట్టించిందనే ప్రచారం సాగుతోంది. ఎట్టకేలకు ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగి వలపన్ని పట్టుకున్నారు. అలాగే పాలకొండలో అతడి ఇంట్లో దాడి చేశారు. ప్రింటర్‌, కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకొని వాస్తవాలు బయటపెట్టారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.