ఒక్కరోజే వంద కోట్ల మంది ఇంటిగడప దాటలేదు
close

తాజా వార్తలు

Published : 21/03/2020 20:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక్కరోజే వంద కోట్ల మంది ఇంటిగడప దాటలేదు

శనివారం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం ఇది

న్యూయార్క్‌: చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణకిస్తోంది. ఈ అంటువ్యాధి నుంచి ప్రజలను రక్షించుకొనేందుకు అన్ని దేశాలూ పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాయి. శనివారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద కోట్ల మంది ఇంటికే పరిమితమవ్వడం విశేషం. పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సంస్థలు మూసివేయడం, చాలామంది ఇంటి నుంచే పనిచేయడంతో ఇది సాధ్యమైంది. ఇక కొవిడ్‌-19తో చనిపోయిన వారి సంఖ్య 11వేలకు చేరుకుంది.

వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచంలోని 35 దేశాల్లో 90 కోట్ల మందికి పైగా ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టలేదు. ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతోనే అందులో 60 కోట్ల మంది ఇంట్లో ఉన్నారు. ఇక కొవిడ్‌-19 తమనేమీ చేయదని యువత అతి ప్రదర్శించొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రూస్‌ అధానోమ్‌ గెబ్రెయేసుస్‌ అన్నారు. ఇక చైనాలో వరుసగా మూడో రోజు కొత్త కరోనా కేసులేవీ నమోదు కాలేదు. హాంకాంగ్‌లో శుక్రవారం 48 అనుమానిత కేసులు నమోదు కావడం కలవరపరుస్తోంది.

ఇటలీలో శనివారమూ మరణమృదంగం కొనసాగింది. ఒకే రోజు 627 మరణాలు సంభవించాయి. దీంతో మరణించిన వారి సంఖ్య 4,032కు చేరుకుంది. ఈ దేశ జనాభా 6 కోట్లే. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌-19 మరణాల్లో 36 శాతం వాటా వారిదే కావడం అందరినీ వేధిస్తోంది. నమోదైన కేసుల్లో 8.6 శాతం రేటుతో అక్కడ చనిపోతున్నారు.

ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌, ఇతర ఐరోపా దేశాలు ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని కఠినంగా ఆదేశించాయి. బయటకు వస్తే జరిమానా విధిస్తామని చెప్పాయి. జర్మనీలోని బవేరియాను లాక్‌డౌన్‌ చేశారు. బ్రిటన్‌ సైతం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. పబ్బులు, రెస్టారెంట్లు, థియేటర్లను మూసేసింది. ఈ ప్రభావం పడిన వారికి వేతనాలు అందిస్తామని తెలిపింది. ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత బొండి సముద్రతీరాన్ని మూసేశారు.

కరోనాపై విజయం సాధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పినప్పటికీ అక్కడి రాష్ట్రాలు కొన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. న్యూయార్క్‌, కాలిఫోర్నియా, ఇల్లినాయిస్‌లో ప్రజలు ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి. అతిపెద్ద రాష్ట్రం కాలిఫోర్నియాలో వెయ్యికి పైగా కేసులు నమోదు కాగా 19 మంది చనిపోయారు. 4 కోట్ల మంది జనాభాను ఇంట్లోనే ఉండాలని ఆదేశించింది. 7000 కేసులు, 39 మరణాలు సంభవించిన న్యూయార్క్‌లోనూ ఆదివారం సాయంత్రం వరకు ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని హెచ్చరించింది. ఆ రాష్ట్రాల నిర్ణయాలను ట్రంప్‌ అభినందించారు. సరిహద్దు మీదుగా అనవసర ప్రయాణాలు వద్దని అమెరికా, మెక్సికో ఒప్పందం చేసుకున్నాయి. ట్రిలియన్‌ డాలర్ల అత్యవసర ప్యాకేజీపై ఇంకా స్పష్టత రాలేదు.

వుహాన్‌ను లాక్‌డౌన్‌ చేయడం ఫలితాలను ఇవ్వడంతో ఐరోపా దేశాలు అదే మార్గంలో పయనిస్తున్నాయి. ఎందుకంటే చైనా తర్వాత ఎక్కువ మరణాలు ఐరోపాలోనే చోటు చేసుకుంటున్నాయి. చైనాలో వైరస్‌ ప్రభావం తగ్గడంతో ఐదు లక్షల మెడికల్‌ మాస్క్‌లను గ్రీస్‌ సహా ఐరోపా దేశాలకు పంపించింది.

మధ్య ఆసియాలో వణికిస్తున్న వైరస్‌ మెల్లమెల్లగా ఆఫ్రికాలోకి ప్రవేశించింది. డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో శనివారం మొదటి కొవిడ్‌ మరణం నమోదైంది. బుర్కినా ఫాసోలో రెండు నమోదయ్యాయి. మొత్తం సబ్‌ సహారన్‌ ఆఫ్రికాలో ఐదుగురు మరణించారు. ఆఫ్రికాలో మొత్తం కొవిడ్‌-19 కేసులు 1000 దాటాయి. అక్కడి వైద్య వ్యవస్థ పటిష్ఠంగా లేకపోవడం కలచివేస్తోంది. ఎక్కువ జనసాంద్రత ఉన్న ఆ నగరాల్లో సోషల్‌ డిస్టెన్స్‌ కష్టమే.

ఇరాన్‌లో శనివారం 123 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ ఉపద్రవం దాటగలమని అత్యున్నత నేత అయతుల్లా అలీ, అధ్యక్షుడు హసన్‌ రౌహాని అంటున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా అమలు చేస్తున్న కఠిన నిబంధనలకు మాత్రం వెనుకాడుతున్నారు. ఆ దేశంలో మొత్తం 20వేల మందికి కరోనా సోకింది. 1500 మంది మరణించారు.

లాటిన్‌ అమెరికాలో క్యూబా, బొలీవియా తమ సరిహద్దులను మూసివేస్తున్నట్టు ప్రకటించాయి. మంగళవారం నుంచి తప్పనిసరి ఐసోలేషన్‌ పాటిస్తున్నామని కొలంబియా తెలిపింది. శనివారం నుంచి రియో డి జెనీరో బీచ్‌లు మూసివేస్తుండటంతో ప్రభుత్వం ఇచ్చే తక్కువ పరిహారంతో ఎలా బతకాలోనని వీధి వ్యాపారులు వాపోతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని